ఈ రాజుగారికి కూడా జ‌గ‌న్ దెబ్బేశారా ?

కాంగ్రెస్ లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా తమ మాటనే నెగ్గించుకునే రకం విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు. ఆయన తనతో పాటు తన వారసుడు సుకుమార్ [more]

Update: 2021-08-07 13:30 GMT

కాంగ్రెస్ లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా తమ మాటనే నెగ్గించుకునే రకం విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు. ఆయన తనతో పాటు తన వారసుడు సుకుమార్ వర్మకు కూడా మరో పదవిని బతిమాలో, గద్దించో తెచ్చుకుంటారు. ఇప్పటికి దాదాపుగా పదేళ్ళుగా సుకుమార్ వర్మ విశాఖలోని డీసీసీబీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు వైసీపీలోనూ ఆ పదవిని వరుసగా నిర్వహించారు. అస‌లు ఇలాంటి ఛాన్స్ ఏ జిల్లాలో .. ఏ నేత‌కు కూడా రాద‌నే చెప్పాలి. ఇప్పుడు మరో టెర్మ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే మాత్రం వైసీపీ పెద్దలు దెబ్బేశారు అన్న మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నామినేటెడ్ ప‌ద‌వులు ఒకేసారి భ‌ర్తీ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన విశాఖ డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో పెద్ద ట్విస్టే ఇచ్చారు.

మహిళల కోటాలో….

చివరాఖరు దాకా సుకుమారవర్మకే డీసీసీబీ పీఠం అని చెప్పి ఆఖరున దాన్ని మహిళా కోటా కిందకు మార్చేశారు అన్న మాట వినిపిస్తోంది. దాంతో వర్మకు అవకాశం దక్కలేదు అంటున్నారు. నిజానికి ఈ పదవి తనకు ఖాయ‌మని వర్మ చాలా ఆశలే పెట్టుకున్నారు అంటున్నారు. కన్నబాబురాజు కూడా ధీమాగా ఉన్నారు. రూరల్ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న తన కుటుంబాన్ని కాదని డీసీసీబీ ఎక్కడికీ పోదని కూడా భావించారు. డీసీసీబీ మ‌ళ్లీ మాదేన‌య్యా అంటూ ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో ప‌బ్లిక్‌గానే చెప్పుకునే వారు. అయితే జగన్ మాత్రం వర్మను మార్చేశారు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ…..?

ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటున్న కన్నబాబురాజు ఫ్యామిలీ వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా హుళక్కి చేస్తారా అన్న కలవరపాటునకు గురి అవుతోందిట. వచ్చే ఎన్నికల్లో సుకుమారవర్మను పోటీకి నిలపాలని కన్నబాబు రాజు భావిస్తున్నారు. అప్పటిదాకా డీసీసీబీ చైర్మన్ గా ఉంటే జనాల్లో ఫోకస్ ఉంటుందని, పొలిటికల్ గా హైలెట్ అవుతారని భావించారు. అయితే కన్నబాబురాజు ఫ్యామిలీ ఆలోచనలు అన్నీ తల్లకిందులు అయ్యేలా వైసీపీ హై కమాండ్ వ్యవహరించిందని అంటున్నారు.

గత ఎన్నికలలోనూ…?

ఇక క‌న్న‌బాబు రాజుకు గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ రావ‌డ‌మే పెద్ద గ‌గ‌నం అయ్యింది. స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు టిక్కెట్ వ‌ద్ద‌ని చాలా మంది చెప్పినా.. చివ‌ర‌కు ఏదోలా తిమ్మిని బ‌మ్మిని చేసి మ‌రీ టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు. పైగా విశాఖ జిల్లాలో ఇప్ప‌టికే విశాఖ నార్త్ సీటును క్ష‌త్రియ వ‌ర్గానికే చెందిన కెకె. రాజుకు ఖ‌రారు చేసేశారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వి కూడా వ‌చ్చింది. జ‌గ‌న్ కెకె. రాజుపై గట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.ఈ నేప‌థ్యంలో అదే జిల్లాలో ఎక్కువ సంఖ్య‌లో లేని క్ష‌త్రియుల‌కు మ‌రో ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌ర‌నే అంటున్నారు. అందుకే కన్నబాబురాజు ఫ్యామిలీకి ఇదే చివ‌రి ఛాన్స్ అంటున్నారు. ఈ పరిణామాలు బట్టి చూస్తూంటే మాత్రం వచ్చేసారి కాపులకు కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ ఎలమంచిలి టికెట్ దక్కుతుంది తప్ప రాజు గారి వారసుడికి కానే కాదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

Tags:    

Similar News