ఏదైనా రాత ఉండాలి… మారుతుందేమో?

ఏదైనా అదృష్టం ఉండాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి దక్కినోళ్లు అనేకమంది. వారికి సామాజిక అంశాలతోపాటు అనేకం కలసి వచ్చాయి. మరికొందరు అత్యంత దురదృష్టవంతులు. [more]

Update: 2021-08-16 03:30 GMT

ఏదైనా అదృష్టం ఉండాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి దక్కినోళ్లు అనేకమంది. వారికి సామాజిక అంశాలతోపాటు అనేకం కలసి వచ్చాయి. మరికొందరు అత్యంత దురదృష్టవంతులు. ఆరు సార్లు గెలిచినా ఎలాంటి పదవులు దక్కని వారు కూడా ఉన్నారు. వారిలో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఒకరు. పాణ్యం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, స్వతంత్ర, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు.

ఆరుసార్లు గెలిచి…..

1985 నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనేక ఈక్వేషన్లు ఆయనకు ఇబ్బందిగా మారాయి. కర్నూలు జిల్లా కావడం, రెడ్డి సామాజికవర్గం కావడంతో మంత్రి పదవి ఇంతవరకూ దక్కలేదు. 2004, 2009లో వరసగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అప్పటికే ఆయనకు ఐదు సార్లు గెలిచిన రికార్డు ఉంది.

ఈసారైనా…?

అయితే తాజాగా జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందా? లేదా? అన్నది కూడా సందేహంగానే మారింది. సామాజికవర్గమే ఆయనకు అవరోధంగా మారే అవకాశముందంటున్నారు. అందుకే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇదే చివరి ఛాన్స్ అని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కూడా అధిష్టానానికి చెప్పారంటున్నారు. ఇస్తే తాను మాజీ మంత్రిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

వారసుడిని రెడీ చేసి….

పాణ్యం నియోజకవర్గంలో ఆయన వారసుడు ఇప్పటికే కలియ తిరుగుతున్నారు. తండ్రికి తోడుగా ఉంటూ పార్టీపైనా, నియోజకవర్గంపైనా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు నరసింహారెడ్డి బరిలో ఉంటారని కాటసాని రాంభూపాల్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆరుసార్లు గెలిచినా ఏ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి దక్కని అత్యంత దురదృష్టవంతుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. చూడాలి. ఈసారి జగన్ ఆయన రాతను మారుస్తారేమో?

Tags:    

Similar News