టిక్ పెట్టేస్తున్నారా?

రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీలో పోటీ పెరిగింది. రెండు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం [more]

Update: 2020-02-26 16:30 GMT

రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీలో పోటీ పెరిగింది. రెండు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయం కొరవడిందని కేసీఆర్ భావిస్తున్నారు. సమన్వయం చేయగలిగిన నేత అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నో ఛాన్స్ అని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండూ అధికార పార్టీకే…..

నిజానికి రెండు రాజ్యసభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. రెండూ సంఖ్యాబలాన్ని బట్టి అధికార టీఆర్ఎస్ మాత్రమే గెలుచుకుంటుంది. కానీ రెండు స్థానాల కోసం పది మంది వరకూ పోటీ పడుతున్నారు. గతంలో సామాజిక వర్గాలుగా అభ్యర్థులను ఎంపిక చేసిన కేసీఆర్ ఈసారి మాత్రం సీనియారిటీకి, నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారన్నది గులాబీ పార్టీలో విన్పిస్తున్న టాక్. ఇప్పటికే కొందరు సీనియర్లు రాజ్యసభ సభ్యత్వం కోసం తమ అభ్యర్థనలను గులాబీ బాస్ ముందు ఉంచారట.

ఇద్దరిలో ఒకరు….

కేసీఆర్ కుమార్తె కవిత పేరు రాజ్యసభకు విన్పించినా ఆమె అయిష్టత చూపుతుందంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన బోయినపల్లి వినోద్ కుమార్ పేరు బలంగా విన్పిస్తుంది. ఆయన ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఎంపీలను సమన్వయం చేసేందుకు వినోద్ ను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే గత ఎన్నికలలో తన సీటును త్యాగం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు.

పొంగులేటి పేరు…..

ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కాకుండా నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఆయన పార్టీనే నమ్ముకుని ఉన్నారు. మరోవైపు జగన్ కూడా కేసీఆర్ కు పొంగులేటి పేరును సిఫార్సు చేసినట్లు తెలిసింది. వీరితో పాటు మాజీ స్పీకర్ మధుసూధనాచారి సయితం ఈసారి తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కేసీఆర్ ను కోరుతున్నారు. అయితే రెండు సీట్లలో ఈసారి బీసీలకు ఛాన్స్ దక్కే అవకాశం లేదు. మరి కేసీఆర్ మనసులో ఎవరున్నారనేది తేలాల్సి ఉంది. రెండింటిలో ఒకటి మాత్రం కవిత కాని, వినోద్ కుమార్ లకు దక్కే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News