ఎరుపు…మెరుపులా మారిందే

కేసీఆర్ అన్న మూడు అక్షరాలు, టీఆర్ఎస్ అన్న మరో మూడు అక్షరాలు తారకమంత్రంగా తెలంగాణా రెండు దశాబ్దాలుగా గడిపింది, నడిచింది. కేసీఆర్ సినిమా నటుడు కాదు, పవర్ [more]

Update: 2019-10-18 11:00 GMT

కేసీఆర్ అన్న మూడు అక్షరాలు, టీఆర్ఎస్ అన్న మరో మూడు అక్షరాలు తారకమంత్రంగా తెలంగాణా రెండు దశాబ్దాలుగా గడిపింది, నడిచింది. కేసీఆర్ సినిమా నటుడు కాదు, పవర్ ఫుల్ పొలిటీషియన్ కాదు, కానీ ఆయనలో నిజాయతీ, కమిట్ మెంట్ చూసి 2001లో టీఆర్ఎస్ పేరిట ఉద్యమం మొదలైతే వెనకా ముందూ చూడకుండా యావత్తు తెలంగాణా సమాజం అనుసరించింది. అదే సమయంలో రాజకీయల్లో తలపండిన తలకాయలు ఎన్నో ఉన్నా కూడా వారిని కనీస మాత్రంగా కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేసిన చరిత్ర తెలంగాణాది. తెలంగాణాని ఇచ్చిన కాంగ్రెస్ ని మెచ్చిన బీజేపీని సైతం పక్కన పెట్టి మరీ కేసీఆర్ ని రెండు సార్లు సీఎం ని చేసిన ఘనతా తెలంగాణాదే. మరి అంతటి కేసీఆర్ టీఆర్ఎఉ ప్రభ ఇపుడు మెల్లగా మసకబారుతోందా అనిపించే విధంగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎర్ర బస్సు కన్నెర్ర….

కేసీఆర్ ఎపుడూ అనుకోని ఉండరేమో. సకల జనుల సమ్మె పేరుతో ఎర్ర బస్సు సోదరులను కలుపుకుని కాంగ్రెస్ సర్కార్ ని గడగడలాడించినది తానేనని భ్రమించిన గులాబీబాస్ కి ఇపుడు అసలు శక్తి ఏంటో తెలిసివస్తోంది. యాభైవేలమంది కార్మిక సోదరులు ఒక్కరిగా నిలబడి పిడికిలి బిగిస్తే ప్రభుత్వం తనదైనా వణకాల్సిందేనన్న కొత్త సత్యాన్ని ఇపుడు టీఆర్ఎస్ అధినేత బాగా తెలుసుకుంటున్నారు. గులాబీ రంగు మాత్రమే చూస్తూ వస్తున్న కేసీఆర్ కి ఆర్టీసీ ఎరుపు ఎదురునిలిచి ఢీ కొట్టడాన్ని అసలు ఊహించి ఉండరేమో. ఏది ఏమైనా ఆర్టీసీ సమ్మె తెలంగాణా సర్కార్ని అతలాకుతలం చేస్తోంది. ఎలాగైనా అణచేయవచ్చుననుకున్న కేసీఆర్ సర్కార్ కి చుక్కలు చూపిస్తోంది. ఇపుడు తెలంగాణా ఉద్యోగులు సైతం మద్దతుగా నిలవడంతో సమ్మె మరింత బలపడుతోంది. నిజానికి ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అంచనాలు తప్పు అని కూడా ఇపుడే తెలుస్తోంది. మిగిలిన ప్రభుత్వ సంస్థలు వేరు, ఆర్టీసీ వేరు, ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణీకులతో ముడిపడిఉన్న పెద్ద రవాణా సంస్థ. దాంతో సహజంగానే జనంలోనూ సర్కార్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది.

ఉప ఎన్నిక కాదది….

సరిగ్గా కీలకమైన సమయంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఉత్తర తెలంగాణాలో మామూలుగానే టీఆర్ఎస్ కి బలం తక్కువ. ఇక అది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వదిలేసిన సీటు. ఆయన సతీమణి నిలబడ్డారు. ఆ విధంగా ఉత్తమ్ కి ప్రతిష్టాత్మకం. మరో వైపు టీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత ఉందని ఎంపీ ఎన్నికల్లోనే రుజువు అయింది. దానికి తోడు బీజేపీ కూడా బలంగా దూసుకుపోతోంది. ఇంకో వైపు ఐదారువేల ఓట్లు ఉన్న సీపీఐ మొదట మద్దతు ఇచ్చి ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కార్ వైఖరికి నిరసనగా ఉపసంహరించుకుంది. ఇక ఆర్టీసీ సమ్మె ప్రభావం అన్నింటికంటే అతి పెద్ద సమస్య. ఇన్ని వైపుల నుంచి పన్నిన పద్మవ్యూహం నేపధ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. మరి ఇక్కడ కనుక టీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయండంలో సందేహమే లేదు. ఒకే ఒక ఉప ఎన్నిక మొత్తం టీఆర్ఎస్ జాతకాన్ని మార్చేస్తుందా…చూడాలి మరి.

Tags:    

Similar News