కేసీఆర్ వ్యూహంలో న‌లిగిపోతున్న సీనియ‌ర్లు

రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్న తెలంగాణ అధిప‌తి, సీఎంకేసీఆర్ వ్యూహం వేస్తే.. దానికి ఎవ‌రైనా క‌ట్టుబ‌డాల్సిందే. ఆయ‌న వ్యూహాలు, రాజ‌కీయ చ‌తుర‌త అలాంటిది. తొలిసారి తెలంగాణ‌లో [more]

Update: 2020-07-31 09:30 GMT

రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్న తెలంగాణ అధిప‌తి, సీఎంకేసీఆర్ వ్యూహం వేస్తే.. దానికి ఎవ‌రైనా క‌ట్టుబ‌డాల్సిందే. ఆయ‌న వ్యూహాలు, రాజ‌కీయ చ‌తుర‌త అలాంటిది. తొలిసారి తెలంగాణ‌లో పీఠం ఎక్కిన స‌మ‌యంలో కేసీఆర్ వివిధ పార్టీల నాయ‌కుల‌ను త‌న‌పార్టీలోకి చేర్చుకున్నారు. ఇలా వ‌చ్చిన వారిలో టీడీపీలో మంచి ఫామ్‌లోఉన్న తుమ్మల నాగేశ్వర‌రావు, క‌డియం శ్రీహ‌రి ఉన్నారు. ఇక‌, మధుసూద‌నాచారి, నాయిని న‌ర‌సింహారెడ్డిలు ఆదినుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. వీరికి తొలి ప్రభుత్వంలో కేసీఆర్ అత్యుత్తమ ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగావారు క‌ల‌లో కూడా ఊహించ‌ని ప‌దవుల‌ను వారికి క‌ట్టబెట్టారు.

కడియం ను మంత్రిని చేసి…..

2014లో ఎంపీగా ఉన్న క‌డియం శ్రీహ‌రిని పార్టీలోకి తీసుకుని ఆయ‌న‌తో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చిమ‌రీ ఉప‌ ముఖ్యమంత్రి ప‌దవిని ఇచ్చారు. ఆ త‌ర్వాత విద్యాశాఖ మంత్రిని చేశారు. నాయిని న‌ర‌సింహారెడ్డికి ఏకంగా హోంశాఖ‌ను అప్పగించారు. తుమ్మ‌ల‌ను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. అదేవిధంగా మ‌ధుసూద‌నాచారికి స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చారు. ఇంత‌లా వారిని గౌర‌వించిన కేసీఆర్ పార్టీలోను, ప్రభుత్వంలోనూ మంచి స్థానాలే ఇచ్చారు. అయితే, రెండో ద‌ఫా ప్రభుత్వంలో మాత్రం వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది. తుమ్మల ఓడిపోయారు. మ‌ధుసూద‌నాచారి కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక క‌డియం 2014 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత కేసీఆర్ ఆయ‌న్ను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేశారు.

సీనియర్ నేతలందరినీ….

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘ‌న్‌పూర్ సీటు త‌న‌కు లేదా త‌న కుమార్తె కావ్యకు ఇవ్వాల‌ని కోరినా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు పూర్తిగా ప‌క్కన పెట్టేయ‌డంతో ఆయ‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక‌, గతంలో హోం మంత్రిగా చేసిన నాయినికి అస‌లు టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో వీరి ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే వ్యాఖ్యలు రాజ‌కీయంగా పెను ప్రకంప‌న‌లు సృష్టించాయి. కానీ, వారు గ‌తంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేసీఆర్‌కు అనుంగులుగానే వ్యవ‌హరించినా.. చిన్నపాటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే కేసీఆర్ వారిని ప‌క్కన పెట్టారా? అనే చ‌ర్చ ఉంది. కానీ, వాస్తవానికి ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎన్నో ఉన్నప్పటికీ.. శ్రీనివాస‌యాద‌వ్‌కు మాత్రం మ‌ళ్లీ త‌న మంత్రి వ‌ర్గంలో సీటు ఇచ్చారు. ఈ న‌లుగురు విష‌యంలో మాత్రం కేసీఆర్ ప‌క్కన పెట్టడం గ‌మ‌నార్హం.

గుర్తింపు ఉన్న నేతలే…..

నిజానికి ఈ న‌లుగురు కూడా ప్రజ‌ల్లో మంచి గుర్తింపు ఉన్న నాయ‌కులే అయిన‌ప్పటికీ.. వీరిని ఎందుకు ప‌క్కన పెట్టాల్సి వ‌చ్చింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని విష‌యం. గ‌తంలో ఏరికోరి తెచ్చుకుని ఎమ్మెల్సీల‌ను సైతం చేసి మంత్రి ప‌ద‌వులు క‌ట్టబెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం వారిని ప‌క్కన పెట్ట‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంట‌నేది పెను చ‌ర్చకు దారితీసింది. అయితే, వాస్తవానికి ఇలాంటి నిరాద‌ర‌ణ‌కు గురైన నాయ‌కులు స‌హ‌జంగానే పార్టీలు మారిపోతారు. కానీ, వీరు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారు. దీనికి వీరి కృత జ్ఞత అయినా కార‌ణం అయి ఉంటుంది. లేదా.. కేసీఆర్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని వ‌దులుకోవ‌డం ఇష్టంలేక‌పోవ‌డం అయినా కార‌ణం అయి ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News