వార్నింగ్ తో సరిపెట్ట లేదట

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదని [more]

Update: 2020-11-24 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదని అంటూనే గెలవకపోతే జాగ్రత్త అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ లో కొంత ఆందోళన బయలుదేరిందంటున్నారు. గెలుపోటములు సహజమే అయినా సిట్టింగ్ స్థానం కోల్పోవడంపై ఆయన నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

దుబ్బాక లో ఓటమి తర్వాత…..

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి తాను కూడా బాధ్యత వహిస్తానని ఆయన నేతలతో అన్నట్లు సమాచారం. కేవలం కొందరి వల్లనే ఈ ఓటమి ఎదురయిందని పరోక్షంగా టీఆర్ఎస్ క్యాడర్ పై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బేస్ లేని పార్టీ విజయం సాధించిందంటే టీఆర్ఎస్ నేతల తప్పిదాలే కారణమని ఆయన సూటిగా చెప్పినట్లు తెలిసింది. ఏ ఏ వర్గాలు తమపై అసంతృప్తిగా ఉన్నది తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కూడా కేసీఆర్ అన్నట్లు సమాచారం.

బాధ్యతలు అప్పగింత…..

ఇక దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ లో రిపీట్ కాకూడదని కేసీఆర్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కేటీఆర్ నేతృత్వంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లబోతున్నామని, వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమించడమే కాకుండా వందకు తగ్గకుండా స్థానాలను సాధించి తన వద్దకు రావాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.

దగ్గరుండి పర్యవేక్షిస్తానని…..

తాను జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేలోపు మూడు సార్లు సర్వే చేయిస్తానని, సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అందించి అప్రమత్తం చేస్తానని కూడా కేసీఆర్ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. దూకుడు మీద ఉన్న బీజేపీకి కళ్లెం వేయాలంటే గ్రేటర్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడమే ముందున్న లక్ష్యమని కేసీఆర్ కొంత కఠినంగానే నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికను కూడా తాను దగ్గరుండి పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News