గులాబీ బాస్ కు గుబులు అందుకే?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే వరస అపజయాలు తప్పవని, ప్రభుత్వంలో, పార్టీలో అసంతృప్తి తలెత్తే [more]

Update: 2020-11-26 09:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే వరస అపజయాలు తప్పవని, ప్రభుత్వంలో, పార్టీలో అసంతృప్తి తలెత్తే అవకాశముందని కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పదికి మించి స్థానాలను సాధించకూడదని నేతలకు దిశానిర్దేశం చేశారు.

అసంతృప్తి తలెత్తితే….?

ఇప్పటి వరకూ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేసీఆర్ చెప్పిందే వేదం. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ ను కలవని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారు. ఇక మంత్రి పదవుల విషయంలోనూ అనేక మంది అసంతృప్తి ఉన్నా కేసీఆర్ ఇమేజ్ ను చూసి ఎవరూ ఇంతవరకూ బయటపడలేదు. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ కేసీఆర్ దే ఫైనల్ నిర్ణయం కావడంతో అసంతృప్తి ఉన్నా ఇప్పటి వరకూ ఎవరూ పెదవి విప్పలేదు.

ఇమేజ్ తగ్గిందంటూ…..

కానీ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పట్టిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతుందని ఎమ్మెల్యేలు సయితం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బాధ్యతను పూర్తిగా సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించారు. ఈ ఎన్నికల్లోనూ వైఫల్యం చెందితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కే ఇబ్బంది అని కేసీఆర్ భావిస్తున్నారు.

అభ్యర్థుల ఎంపిక నుంచి….

అందుకే కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థుల జాబితాను కూడా దగ్గరుండి పరిశీలించారు. అసంతృప్తిని ఎదుర్కొంటున్న కార్పొరేటర్లకు తిరిగి టిక్కెట్ ఇవ్వలేదు. 26 మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు టిక్కెట్లు ఇవ్వలేదు. బీజేపీకి పెద్దగా సమయం ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకూ బీజేపీ పై కొంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అలా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు కేసీఆర్ కు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News