కేసీఆర్ ని మోడీ అవమానించాడా ?

అదే హైదరాబాద్, అదే ఢిల్లీ పెద్ద, అదే తెలంగాణా బిడ్డ. నాడు అంజయ్య. నేడు కేసీఆర్. ఆరణాల కూలీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన టంగుటూరి అంజయ్యకు [more]

Update: 2020-11-29 08:00 GMT

అదే హైదరాబాద్, అదే ఢిల్లీ పెద్ద, అదే తెలంగాణా బిడ్డ. నాడు అంజయ్య. నేడు కేసీఆర్. ఆరణాల కూలీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన టంగుటూరి అంజయ్యకు 1980 దశకంలో నాటి బేగంపేట విమానాశ్రమంలో తీరని అవమానమే జరిగింది. చేసిన వారు అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ వారసుడు రాజీవ్ గాంధీ. దాంతో నాడు అది సంచలనం అయింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరిట ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి అది మూల కారణమైంది. మరి ఇపుడు దేశంలో ఇందిరాగాంధీ అంతటి అధికారాలను కలిగిన సర్వ శక్తి మంతుడిగా ఉన్న మోడీ అదే హైదరాబాద్ గడ్డ మీద మరో ముఖ్యమంత్రి కేసీఆర్ ని అవమానించాడు అని టీయారెస్ నాయకులు గట్టిగా విమర్శిస్తున్నారు.

అది నిజమేనా…?

మోడీ అధికారిక పర్యటన పేరిట హైదరాబాద్ కి వచ్చారు. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల వేళ రావడంతో దాని మీద వేరేగా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మరో వైపు తెలంగాణాలో బీజేపీ టీయారెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సీన్ ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ తనకు స్వాగతం పలికేందుకు సీఎం హోదాలో కేసీఆర్ రానవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తన వ్యతిగత కార్యదర్శి ద్వారా వర్తమానం పంపించారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎం గవర్నర్ ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా కూడా ఘనంగా స్వాగతం పలుకుతారు. అలాటిది కేసీఆర్ ని రావద్దు అని చెప్పడమేంటి అని టీయారెస్ వర్గాలు గరం గరం అవుతున్నాయి. ఒక విధంగా ఇలాంటి ఘటన ఇంతకు ముందు జరగకపోవడంతో ప్రధాని మోడీ చేసింది కరెక్టా కాదా అన్న చర్చ అయితే ఉంది. మరో వైపు చూస్తే మోడీ తన అధికారిక పర్యటనలో నిరాడంబరత పాటించాలనా, లేక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.

అగ్గి రాజుకుందిగా…?

అసలే గత కొన్నాళ్ళుగా బీజేపీ మీద భగభగలాడిపోతున్న టీయారెస్ కి మోడీ ఇలా అనుకోని బ్రహ్మాస్త్రం అందించారు అన్న మాట అయితే వినిపిస్తోంది. నిజానికి మోడీ ఈ టైంలో రావడం అంటేనే అందులో రాజకీయ అర్ధాలు చాలా ఉన్నాయని అంటున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రిని స్వాగతానికి రావద్దు అనడం ద్వారా దాన్ని ఇంకా పెంచి పెద్ద చేశారు అన్నది కూడా ఉంది. అయితే కేసీఆర్ ని అవమానం చేశారని, ఇది మొత్తం తెలంగాణా సమాజానికి అవమానమని టీయారెస్ నేతలు అంటున్నారు. నిజానికి మోడీ అవమానం చేద్దామని రావద్దు అనలేదు, కేసీఆర్ స్వాగతానికి వస్తే మాటా మంతీ ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్ధులుగా ఉన్న వేళ అది వేరేగా ప్రభావితమై బీజేపీకి గ్రేటర్ లో వేడి తగ్గుతుంది అని భావించి ఉండొచ్చు. లేదా తనతో పాటే వ్యాక్సిన్ పరిశీలనకు కేసీఆర్ కూడా వస్తే ఆ క్రెడిట్ ఆయనకూ దక్కుతుంది అన్న ఆలోచన ఏదైనా ఉందేమో తెలియదు కానీ మొత్తానికి మోడీ కేసీఆర్ ని రావద్దు అనడంతో అది రాజకీయంగా కొత్త చిచ్చు రేపుతోంది.

సెంటిమెంట్ రేగుతుందా …?

నిజానికి రెండు దశాబ్దాలుగా తెలంగాణా సెంటిమెంట్ తోనే టీయారెస్ చలి కాచుకుంది. దాని ప్రతిఫలాలన్నీ కూడా ఏ ఒక్కరికీ వదలకుండా మొత్తానికి మొత్తం తానే అనుభవించింది. ఇపుడు తెలంగాణా సెంటిమెంట్ తగ్గిపోయింది అన్న మాట అయితే గట్టిగా ఉంది. అది మళ్ళీ మళ్ళీ రాజేద్దామన్నాఅసలు కుదిరేది కాదు, ఈ సెంటిమెంట్ వల్ల అంతిమంగా దక్కాల్సిన రాష్ట్రం కూడా సాధించాక అంతకన్నా వేరే గరిష్ట ప్రయోజనమేది జనాలకు ఉండబోదు, ఇక కేసీఆర్ కి కావాల్సింది రాజకీయ లబ్ది అయితే ఇప్పటికే రెండు సార్లు సీఎం పదవిని ఇచ్చి అనేక ఎన్నికల్లో విజయాలను అందించిన తెలంగాణా సమాజం మళ్లీ సెంటిమెంట్ అంటూ ఆయింట్ మెంట్ పూయించుకోవడానికి సిద్ధంగా ఉంటుందనుకోవడం కూడా పొరపాటే. మొత్తానికి చూసుకుంటే మాత్రం అంజయ్యకు జరిగిందే నిజమైన అవమానం. ఎందుకంటే ఆయన నోరూ వాయీ లేని కాంగ్రెస్ నియమిత ముఖ్యమంత్రి, అది కూడా ఎయిర్ పోర్టుకు వెళ్ళి ముఖాముఖీగా ఇబ్బంది పడ్డవాడు. కేసీఆర్ విషయానికి వస్తే మోడీ లాగానే తెలంగాణా వరకూ చూస్తే సర్వ శక్తిమంతుడు. ఆయనకు అవమానం జరిగింది అంటే తెలంగాణా సమాజం నమ్మదు, అలా కనుక నమ్మితే కేసీఆర్ శక్తి సామర్ధ్యాల మీద కూడా నమ్మకం పోయినట్లే మరి.

Tags:    

Similar News