బాస్ లో ఎంత మార్పు వచ్చింది?

వరస ఓటములతో టీఆర్ఎస్ తెలంగాణలో ఇబ్బందిపడుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో కొంతమార్పు కన్పిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు దూరంగా [more]

Update: 2020-12-21 09:30 GMT

వరస ఓటములతో టీఆర్ఎస్ తెలంగాణలో ఇబ్బందిపడుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో కొంతమార్పు కన్పిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు దూరంగా ఉండకుండా వారికి అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సమస్యలు ముఖ్యమైనవి ఉంటేనే తనను కలవవచ్చని ఇప్పటికే కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూత్రప్రాయంగా తెలిపారు.

కలవడం ఇక….

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం చాలా కష్టమైన పనే. గత ఆరేళ్ల నుంచి ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్ కు రావడం కూడా గగనమే. ఏదైనా సమావేశాలు ఉంటే తప్ప కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశం లేదు. మంత్రులు కూడా మంత్రి వర్గ సమావేశాలు, సమీక్షలకు తప్పించి ప్రగతి భవన్ కు అనుమతి లేదు. దీంతో తమ నియోజకవర్గంలో, జిల్లాలో ముఖ్యమైన సమస్యలున్నా వాటిని కేటీఆర్ కు చెప్పుకుంటున్నారు తప్ప ఏం చేయలేకపోతున్నారు.

ఓటమి తోనే…..

అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలహీనపడటంతో కేసీఆర్ లో అనూహ్యమైన మార్పు వచ్చిందంటున్నారు. ఇకపై ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను స్వయంగా కలుసుకోవాలని కేసీఆర్ భావించారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

జిల్లాల పర్యటనలూ….

దీంతో పాటు ఇక జిల్లాల పర్యటనలను కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెెంట్ కేసీఆర్ తో పాటు మంత్రులకు కూడా సూత్రప్రాయంగా తెలియజేశా రంటున్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలోనే జిల్లాల పర్యటనలు చేయడం కేసీఆర్ కు అలవాటు, అయితే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల దెబ్బకు కేసీఆర్ లో అనూహ్యమైన మార్పు వచ్చిందంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఈ రెండు ఎన్నికలతో కొంత గుణపాఠం నేర్చుకున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News