దిద్దుబాటు ఓకే.. సర్దుబాటు చేయగలరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు క్రమంగా చర్యలు ప్రారంభించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ [more]

Update: 2021-01-04 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు క్రమంగా చర్యలు ప్రారంభించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలయిందని కేసీఆర్ గుర్తించారు. ఇది పార్టీకి సోకకూడదని భావించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.

కొన్నేళ్లుగా నామినేటెడ్ పోస్టులను…..

గత కొన్నేళ్లుగా నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ భర్తీ చేయలేదు. ముఖ్యమైన నేతలకు మాత్రమే పదవులను కేటాయించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరోవైపు బీజేపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వల విసురుతుంది. ఆర్థికంగా, ప్రజల్లో బలమున్న నేతలను వదులుకోకూడదని కేసీఆర్ ఇప్పటికి తెలుసుకున్నారు. అందుకే నామినేటెడ్ పోస్టులను వరసగా భర్తీ చేయాలని నిర్ణయించారు.

సునీతా లక్ష్మారెడ్డికి…..

ఇందులో భాగంగా మెదక్ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి ఎంపిక చేశారు. ఆరేళ్ల నుంచి తెలంగాణ మహిళ ఛైర్ పర్సన్ పదవిని కేసీఆర్ భర్తీ చేయలేదు. సునీతా లక్ష్మారెడ్డి మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వదలి టీఆర్ఎస్ లో చేరారు. 1999, 2004, 2009లో వరసగా సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ పనిచేశారు.

మరికొందరికి కూడా….

సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ గేలం వేస్తుందని తెలుసుకున్న కేసీఆర్ ఆమెకు నామినేటెడ్ పోస్టును కట్టబెట్టారు. కేబినెట్ ర్యాంకు పదవి కావడంతో సునీతా లక్ష్మారెడ్డి సయితం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె తరహాలోనే మరికొందరికి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే యోచనలో ఉన్నారు. పదవుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో గులాబీపార్టీలో జోష్ మొదలయింది. కొందరు ఇప్పటికే కేటీఆర్ వద్ద పైరవీలు ప్రారంభించినట్లు తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ పార్టీ లో అసంతృప్త నేతలను బుజ్జగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Tags:    

Similar News