కేసీఆర్ సారూ.. ఇంత కాస్ట్లీ చేశారేమీ?

తెలంగాణ సర్కార్ కి వైరస్ మహమ్మారి స్థాయి పూర్తిగా అర్ధం అయిపోతుంది. ఇది ప్రతిపక్షాలను కట్టడి చేసినంత సులభం కాదని లెక్కేసింది. ఇప్పటివరకు ప్రయివేట్ ఆసుపత్రులకు దూరంగా [more]

Update: 2020-06-16 09:30 GMT

తెలంగాణ సర్కార్ కి వైరస్ మహమ్మారి స్థాయి పూర్తిగా అర్ధం అయిపోతుంది. ఇది ప్రతిపక్షాలను కట్టడి చేసినంత సులభం కాదని లెక్కేసింది. ఇప్పటివరకు ప్రయివేట్ ఆసుపత్రులకు దూరంగా జరుగుతున్న కరోనా చికిత్స, పరీక్షలను ఇప్పుడు వారికి కట్టబెట్టక తప్పలేదు. రాబోయే రోజుల్లో కరోనా మోగించబోయే ప్రమాద ఘంటికలను తట్టుకుని ప్రభుత్వ వైద్య విభాగంతో సుదీర్ఘ పోరాటం సాగించడం కష్టమని అంచనాకు రావడంతో ఇప్పుడు ప్రయివేట్ ఆసుపత్రులకు కరోనా వ్యాప్తిని అరికట్టే బాధ్యత బదలాయించారు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయి అని ట్యాగ్ లైన్ తగిలించింది టి సర్కార్. ఇప్పటివరకు పేషేంట్లకు కరోనా పరీక్షలు జరిపేందుకు సైతం ప్రభుత్వాలు ప్రయివేట్ కి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం అటు టెస్ట్ లకు ఇటు చికిత్స కు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ధరలు ఫిక్స్ చేసి …

తెలంగాణ లో కరోనా టెస్ట్ లకు రెండు వేల రెండు వందల రూపాయలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇంటికి వచ్చి చేస్తే మరో ఆరువందల కలుపుకుని రెండువేల ఎనిమిది వందల రూపాయలకు మించకూడదని చెప్పింది. అదే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి రోజుకు నాలుగు వేలరూపాయలకు పైబడి వసూలు చేయకూడదని అలాగే వెంటిలేటర్ పై చికిత్స పొందేవారి నుంచి 9 వేలరూపాయలకు మించకూడదని, ఐసియు లో ఉంచితే రోజుకు 7 వేలరూపాయలు దాటకూడదని సర్కార్ తేల్చింది. వ్యాధి తీవ్రత పెద్దగా లేకున్నా ఆసుపత్రి అవసరం లేకపోయినా కూడా రోగిని ఉంచి వైద్యం చేశారని నిర్ధారణ అయితే మాత్రం ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది. దాంతో ఇప్పుడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే కాస్ట్లీ వైద్యం తప్పదని తేలిపోతుంది. వైరస్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం లేదని చెప్పడం ద్వారా ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే ఖర్చు అయిపోతారని పరోక్షంగా హెచ్చరించినట్లు అయ్యింది.

అందరికి వస్తే అంతే సంగతులు …

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తో పాటు వారి కుటుంబం తొలుత వైరస్ బారిన పడుతుంది. ఆ లెక్కన ఒక కుటుంబం లో నలుగురికి పాజిటివ్ వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే వారి ఆస్తులు అమ్ముకునేంత పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రయివేట్ నే కాకుండా ప్రభుత్వ వైద్యం అందే వెసులుబాటు ఉండటంతో కొంత ఊపిరి పీల్చుకోవొచ్చు. కానీ ఇప్పటికే ప్రభుత్వ వైద్య విభాగం పై తీవ్ర వత్తిడి పడుతుంది. దాంతో వారు రోగులు వారి బంధువులతో యుద్ధం చేస్తున్నారు. కేసుల సంఖ్య ఇకపై మరింత గా పెరగనున్నట్లు నిపుణుల అంచనా. దాంతో ప్రైవేట్ కి కూడా కరోనా చికిత్స బదలాయిస్తే తప్ప ముప్పు నుంచి కాపాడుకోలేమని అంతా ఇచ్చిన సూచనలతో ఎట్టకేలకు గులాబీ బాస్ ఎస్ అనేశారు. దాంతో ఇప్పుడు ఈ నిర్ణయం పై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Tags:    

Similar News