కొత్త పెత్తందారు అయ్యారే

ప్రాంతీయ పార్టీలు దండుగ. వాటికి జాతీయ ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవు, కేవలం తమ జాతి లబ్ది కోసం తప్పించి ఆలోచనలు ముందుకు వేయలేరు అంటోంది కమలం [more]

Update: 2019-09-24 11:00 GMT

ప్రాంతీయ పార్టీలు దండుగ. వాటికి జాతీయ ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవు, కేవలం తమ జాతి లబ్ది కోసం తప్పించి ఆలోచనలు ముందుకు వేయలేరు అంటోంది కమలం పార్టీ. దేశానికి మేలు జరగాలంటే ఆసేతు హిమాచలం ఒకే పార్టీ గొడుకు కిందకు రావాలన్నది బీజేపీ గట్టి నినాదం. దేశం బలంగా ఉండాలన్నా, ఐక్యత సాధించాలన్నా కూడా జాతీయ పార్టీల వల్లనే సాధ్యమని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పైగా ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదని, అవి వట్టి కుటుంబ పార్టీలని కూడా అంటోంది. కేవలం తమ కుటుంబం, తమ సామాజికవర్గం తప్ప వారి పరిధి పెరగదు అంటోంది మరి ఈ వాదనని ప్రాంతీయ పార్టీలు తిప్పికొట్టకుండా ఉంటాయా.

మోడీతో ఢీ….

తెలంగాణాలో రెండవమారు ముఖ్యమంత్రి అయ్యాక జాతీయ స్థాయిలో తనకు సీనియారిటీ పెరిగిందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆయన ఈ మధ్య ఏకంగా కేంద్రంపై పెద్ద నోరు చేసుకుంటున్నారు. నిండు అసెంబ్లీలో ఆయన బీజేపీని టార్గెట్ చేయడం ఆసక్తికరమైన అంశమే. ఇంతకాలం బీజేపీ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న కేసీఆర్ ఇపుడు అటునుంచి ఇటువైపునకు వచ్చేశారు. బీజేపీకి గట్టి షాకులు ఇవ్వాల్సిందేనని నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజా బడ్జెట్ సెషన్లో ఆయన బీజేపీ మీద విసుర్లు విసిరింది కూడా ఆ వ్యూహంలో భాగమే. కేంద్రం తెలంగాణాకు ఏమీ సాయం చేయలేకపోవడం వల్లనే బడ్జెట్ సైజు తగ్గిస్తున్నట్లుగా చెప్పుకున్న కేసీఆర్ తెలంగాణా నుంచి వేల కోట్లు పన్నుల రూపంలో తీసుకెళ్తున్న బీజేపీ ఇస్తున్నది మాత్రం పెద్దగా ఏదీ లేదని కడిగిపారేశారు. ఇక మధ్యలో మరోసారి రాజకీయ భాషను వాడారు. తాను మరో మూడు టెర్ములు సీఎం గా ఉంటానని కూడా ఆయన చెప్పుకున్నారు. దాంతో బీజేపీకి నో ఛాన్స్ అని చెప్పేసిన కేసీఆర్ మరో అడుగు ముందుకేసి కేంద్రేంలో విచిత్రమైన ప్రభుత్వం ఉందని, దానికి రాష్ట్రాల గోడు పట్టదని పెద్ద గొంతు చేసుకున్నారు. మోడీ సర్కార్ విధానాల పైన కూడా కేసీఆర్ మండిపడ్డారు.

మమతకు ధీటుగా…..

జాతీయ పార్టీ నాయకులు ఢిల్లీలో వాన వస్తే గొడుగు పడతారు తప్ప రాష్ట్రాల్లో పరిస్థితులకు తగిన విధంగా స్పందించలేరని కేసీఆర్ అనడాన్ని బట్టి చూస్తే బీజేపీ జాతీయ నినాదానికి గట్టి కౌంటరే ఇచ్చారనుకోవాలి. ప్రాంతీయ పార్టీలే ఎప్పటికైనా శాశ్వతమని, అవి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని కేసీఆర్ అంటున్నారు. జాతీయ పార్టీ నాయకులు రిమోట్ కంట్రోల్లో ఉంటారని, వారు తమ పార్టీ నేతలు చెప్పినట్లుగా మాట్లాడుతారు తప్ప సొంతంగా ఒక్క ఆలోచన చేయలేరని, వారికి స్వేచ్చ కూడా లేదని కేసీఆర్ అనడం ద్వారా బీజేపీ దూకుడుకు సరైన సమాధానం చెప్పాలనుకుంటునట్లుగా అర్ధమవుతోంది. ఇప్పటివరకూ చూస్తే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోడీ సర్కార్ని ఎదిరిస్తూ వస్తున్నారు. ఇపుడు మరో గొంతుగా కేసీఆర్ రెడీ అయ్యారని అంటున్నారు. ఓ విధంగా మమత కంటే కూడా ధీటుగా, గట్టిగా కేసీఆర్ వాదన ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో జాతీయ వాదంతో దూసుకువస్తున్న బీజేపీకి ప్రాంతీయ పార్టీల కొత్త పెత్తందారుగా కేసీఆర్ నిలువరిస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News