మళ్లీ కేఈ అవసరం పడినట్లుందిగా?

చంద్రబాబు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకు ఇప్పుడు అండగా ఉంటుంది కూడా అతి కొద్ది మంది మాత్రమే. ప్రధానంగా రాయలసీమలో పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా [more]

Update: 2020-09-18 06:30 GMT

చంద్రబాబు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకు ఇప్పుడు అండగా ఉంటుంది కూడా అతి కొద్ది మంది మాత్రమే. ప్రధానంగా రాయలసీమలో పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అయితే సీమలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నది చంద్రబాబు ఆలోచన. అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు బయటకు రావడం లేదు. పరిటాల ఫ్యామిలీ కూడా పూర్తిగా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంది. కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ సయితం కూడా కన్పించడమే మానేశారు.

సీనియర్ నేతలందరూ…..

ఇక చిత్తూరు జల్లాలో అమర్ నాధ్ రెడ్డి అప్పుడప్పుడూ మెరుస్తుంటారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. గల్లా ఫ్యామిలీ గుంటూరుకే పరిమితమయింది. కడప జిల్లాలో పార్టీ నేతలందరూ దాదాపు ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్ వంటి నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు కడప జిల్లాలో సీనియర్ నేతలు అంటూ లేకుండా పోయారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు…..

మిగలింది కర్నూలు జిల్లాయే. ఇక్కడ కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఉంది. కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు 2019 ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా గాని ఆయన టీడీపీలోనే ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం బీసీల ఓటు బ్యాంకు దెబ్బతినిందంటున్నారు. యనమల బీసీ నేతగా చెప్పుకుంటున్నా ఆయనను బీసీలే విశ్వసించరు. ఆయనంతా హైఫై నేత కావడమే కారణం. ఇక బీసీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేఈ కృష్ణమూర్తి ఒక్కరే ఉన్నారు. అచ్చెన్నాయుడిని ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన ప్రాంతాల బీసీలు తమ వాడిగా గుర్తించరు.

బీసీల విషయంలో….

ఇటువంటి పరిస్థితుల్లో బీసీలను తిరిగి తనవైపునకు తిప్పుకోవాలంటే చంద్రబాబుకు మళ్లీ కేఈ కృష్ణమూర్తి అవరం తప్పదు. కానీ కేఈ కృష్ణమూర్తిపై చంద్రబాబుకు పీకల దాకా కోపం ఉందంటున్నారు. దానికి కారణం తనకు చెప్పకుండానే డోన్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేఈ చెప్పడం. డోన్ నియోకవర్గంలో 33 వార్డులకు 13 వార్డుల్లో మాత్రమే టీడీపీ నామినేషన్లు వేయగలిగింది. ఈ కోపంతోనే బీసీల విషయంలో కేఈ కృష‌్ణమూర్తి సాయం తీసుకోవడానికి చంద్రబాబు సందేహిస్తున్నారని చెబుతున్నారు. అయితే త్వరలోనే కేఈతో మాట్లాడి బీసీల విషయంలో పార్టీ ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద కేఈ అవసరం మళ్లీ చంద్రబాబుకు ఇప్పుడు అవసరమొచ్చింది.

Tags:    

Similar News