కేఈ ఫ్యామిలీ పొలిటిక్ ఫ్యూచ‌ర్‌… ఆ ఒక్కడిపైనే ఆశ‌లు

క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గం ప‌త్తికొండ‌. 1994 నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ ఇక్కడ ఓట‌మి లేకుండా వ‌రుస విజ‌యాలు సాధించింది. అలాంటిది [more]

Update: 2021-01-08 00:30 GMT

క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గం ప‌త్తికొండ‌. 1994 నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ ఇక్కడ ఓట‌మి లేకుండా వ‌రుస విజ‌యాలు సాధించింది. అలాంటిది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి కె. శ్రీదేవిరెడ్డి భారీ మెజార్టీతో విజ‌యం సాధించి టీడీపీ కంచుకోట బ‌ద్దలు కొట్టారు. 2009 పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ప‌త్తికొండ‌పై క‌న్నేసిన కేఈ కుటుంబం ఇక్కడ పాగా వేసింది. 2009 ఎన్నిక‌ల్లో కేఈ ప్రభాక‌ర్ పోటీ చేసి విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాల‌తో ప్రభాక‌ర్ తాను పోటీ నుంచి త‌ప్పుకుని త‌న సోద‌రుడు కృష్ణమూర్తికి సీటు త్యాగం చేయ‌డం, ఆయ‌న విజ‌యం సాధించ‌డం జ‌రిగాయి. ఆ త‌ర్వాత ఆయ‌న చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగాను, డిప్యూటీ సీఎంగాను వ్యవ‌హ‌రించారు.

ఓటమి నాటి నుంచి….

పేరుకు పెద్దాయ‌న‌గా ఉన్నా ఆయ‌న డిప్యూటీ సీఎం హోదాలో ఇమ‌డ లేక‌పోయార‌న్నది అప్పటి పార్టీ, ప్ర‌భుత్వ వ‌ర్గాల టాక్‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణమూర్తి పోటీ నుంచి త‌ప్పుకుని త‌న సోద‌రుడు కేఈ. శ్యాంబాబుకు సీటు ఇప్పించుకున్నారు. అయితే శ్యాంబాబు తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేయ‌లేక ఓట‌మి పాల‌య్యారు. ఆయ‌న ఓడిపోవ‌డం ఒక ఎత్తు అయితే భారీ మెజార్టీతో త‌మ కంచుకోట‌ను కోల్పోవ‌డం మ‌రో ఎదురు దెబ్బ. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్పటి నుంచి కేఈ కుటుంబం ప‌త్తికొండ‌తో అంటీముట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తోంద‌న్న చ‌ర్చలు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

క్యాడర్ కు అందుబాటులో లేక….

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉండ‌డంతో అన్నీ తానై చ‌క్రం తిప్పిన శ్యాంబాబు కొంత దూకుడుగానే ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల నుంచి విమ‌ర్శలు వ‌చ్చినా గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌నే పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత మాత్రం అటు తండ్రి, ఇటు త‌న‌యుడు ఇద్దరూ నియోజ‌క‌వ‌ర్గంకు దూరంగా ఉంటోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. శ్యాంబాబు ఎక్కువుగా హైద‌రాబాద్‌కే ప‌రిమితం అవుతూ స్థానికంగా పార్టీ కార్యక్రమాలు జ‌రిగేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్యాంబాబు స్థానికంగా కేడ‌ర్‌కు అందుబాటులో లేక‌పోవ‌డం పార్టీకి మైన‌స్ అవుతోంది.

యాక్టివ్ అయితేనే….?

దీనికి తోడు గ‌త ఎన్నిక‌ల‌కు ముందే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేర‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వ‌ర్గం స‌ప‌రేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తోన్న ప‌రిస్థితి. ఇక కేఈ ఫ్యామిలీకి ప‌ట్టున్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గం డోన్‌లో కూడా ఆ ఫ్యామిలీ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓడుతూ వ‌స్తోంది. కృష్ణమూర్తి సోద‌రులు ఇద్దరూ డోన్‌లో గ‌త రెండు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయారు. ఈ క్రమంలోనే కేఈ ఫ్యామిలీ రాజ‌కీయం బ‌తికి బ‌ట్టక‌ట్టాలంటే శ్యాంబాబు మ‌రింత‌గా యాక్టివ్ అవ్వడంతో పాటు స్థానికంగా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రస్తుతం క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో టీడీపీ, వైసీపీ నుంచి పలువురు యువ‌నేత‌లు దూసుకుపోతున్నారు. శ్యాంబాబు త‌న ఫ్యామిలీ రాజ‌కీయ వార‌స‌త్వం నిల‌బెట్టడంతో పాటు రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవాలంటే మ‌రింత‌గా శ్రమించ‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News