కేరళ కోలుకుంటోంది… క్రమంగా లాక్ డౌన్ ను?

కరోనా వైరస్ నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సోమవారం నుంచి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. కరోనా కట్టడిని ఇప్పటికే [more]

Update: 2020-04-19 18:29 GMT

కరోనా వైరస్ నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సోమవారం నుంచి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. కరోనా కట్టడిని ఇప్పటికే చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థిితి, ప్రజల ఇబ్బందులపైన దృష్టి పెట్టింది. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని పినరయి సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రంగాలకు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రమార్గదర్శకాలతో పాటు….

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రంగాలకు మినహాయింపులు ఇస్తూనే కేరళ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుంది. పాక్షికంగా మరికొన్ని రంగాలకు కూడా మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానంగా లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడి ప్రజలు అక్కడే గత నెలరోజులుగా నిలిచిపోయారు. సొంత గ్రామాలకు నడిచిపోయేందుకు కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజా రవాణాను…..

ఈ నేపథ్యంలో జిల్లాల మధ్య ప్రజారవాణాను పరిమితంగా పునరుద్ధరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రవాణా వాహనాల్లో తక్కువ మందితో ప్రయాణించాలన్న నిబంధన విధించింది. అంటే గతంలో బస్సులో నలభై మంది ప్రయాణిస్తే ఇప్పుడు కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లే అవకాశముండటంతో పాటు కేరళ ట్రాన్స్ పోర్ట్ కూడా కొంత కోలుకునే అవకాశాలున్నాయి.

రెస్టారెంట్లను సయితం….

అలాగే రాత్రి ఏడుగంటల వరకూ రెస్టారెంట్లు తెరిచి ఉంచాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. రెస్టారెంట్ లలో కూడా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఈ మినహాయింపులు ఇవ్వడానికి రాష‌్ట్రంలో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించింది. కాసర్ గడ్, మలప్పరం, కోజికోడ్, కన్నూరు జిల్లాలను రెడ్ జోన్లగా ప్రకటించారు. ఇక్కడ 20 నుంచి కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇక ప్రయివేటు వాహనాలను కూడా అనుమతిస్తారు. బేసి, సరిసంఖ్యలో వాహనాలను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద కేరళలో దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే ఆలోచనలో పినరయి విజయన్ ఉన్నారు.

Tags:    

Similar News