బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారుగా

దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా తన కొత్త కారును మార్కెట్లోకి ఇలా దింపిందో లేదో మళ్ళీ ఎపి రాజకీయాలు దాని చుట్టూ తిరగడం మొదలైంది. కియా కారు [more]

Update: 2019-08-09 03:30 GMT

దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా తన కొత్త కారును మార్కెట్లోకి ఇలా దింపిందో లేదో మళ్ళీ ఎపి రాజకీయాలు దాని చుట్టూ తిరగడం మొదలైంది. కియా కారు కస్టమర్లకు ఎంత మైలేజ్ ఇస్తుందో కానీ అధికారవిపక్షాలు ఇప్పుడు కియా క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు మైలేజ్ కోసం పోరాటం మొదలు పెట్టారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని విపక్ష టిడిపి సంబరాలు మొదలెట్టేసింది. కాదు వైఎస్ చేసిన కృషి ఫలితమే కియా అంటూ కౌంటర్ అటాక్ గట్టిగా మొదలు పెట్టింది అధికార వైసీపీ.

బాబు పటానికి పాలాభిషేకం …

కియా పరిశ్రమ తమ వల్లే అని చెప్పుకునే ప్రయత్నాల్లో టిడిపి చాలా దూకుడుగా తన రాజకీయం స్టార్ట్ చేసింది. దార్శనికుడి స్వప్నం అంటూ చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రికి ట్విట్టర్ లో సన్మానం చేసినంత పనిచేశారు. మరోపక్క మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వంటివారు మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు జరిపించేశారు. ఇంకోపక్క విపక్ష నేత కియాకు అభినందనలు అంటూ హడావిడి మొదలు పెట్టారు. ఇలా అధికారపార్టీ ని టార్గెట్ చేస్తూ టిడిపి చేస్తున్న ఈ తరహా ప్రచారం చర్చనీయాంశంగా మళ్ళీ మారింది.

ఆ లేఖ గాలి తీసేసిందా …

ఇటీవలే ఈ పరిశ్రమ ఘనత తమదే అంటూ అధికారవిపక్షాలు శాసన సభ వేదికగా మాటల యుద్ధం సాగించాయి. ఆ సమయంలో ప్రభుత్వానికి కియా సీఈఓ రాసిన లేఖ ను వైసిపి బయటపెట్టి టిడిపి గాలి తీసేసింది. అయితే ఈ లేఖను బలవంతంగా రాయించారంటూ టిడిపి ఆరోపణలకు దిగింది. అలా ఒకరిపై మరొకరు తమ ప్రభుత్వ ఘనతగా చాటుకునేందుకు అసెంబ్లీలో చేసిన ప్రయత్నం ముగిసింది అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్లాంట్ నుంచి కియా కార్లు మార్కెట్ లోకి విడుదల కావడంతో తిరిగి రెండు పక్షాలు మైలేజ్ కోసం మళ్ళీ మాటల యుద్ధమే కాదు చేతలు మొదలు పెట్టేశాయి.

బుగ్గన అలా మాధవ్ ఇలా …

ఇక కార్లను మార్కెట్ లోకి విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనలేదు. ఆయన పక్షాన హాజరైన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డ, కియా వైఎస్ కృషిగా చెప్పుకొచ్చారు. ఇక ఎంపి గోరంట్ల మాధవ్ మరో అడుగు ముందుకు వేసి కియా లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే తమ సర్కార్ ఆశయాన్ని కారుమీదే రాయడం చర్చనీయాంశం అయ్యింది. ఇలా కియా కారుకు మీడియా లో పెద్దగా ప్రకటనలు ఇవ్వలిసిన పనిలేకుండా అధికారవిపక్షాలు ఉచిత ప్రచారాన్ని కల్పిస్తూ మార్కెటింగ్ చేసేస్తున్నాయి. మరికొంతకాలం కియా పరిశ్రమ మైలేజ్ కోసం అధికార విపక్షాలు ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ లుగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News