కొలుసుకు కీలక పదవి…?

ఆయ‌న మాజీ మంత్రి, కాంగ్రెస్‌లోని వైఎస్ వంటి ఉద్ధండుల‌కు కృష్ణా జిల్లా విష‌యంలో అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసిన నేత‌గా గుర్తింపు పొందారు. మంత్రిగా కూడా చ‌క్రం [more]

Update: 2019-08-24 11:00 GMT

ఆయ‌న మాజీ మంత్రి, కాంగ్రెస్‌లోని వైఎస్ వంటి ఉద్ధండుల‌కు కృష్ణా జిల్లా విష‌యంలో అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసిన నేత‌గా గుర్తింపు పొందారు. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు ఇష్టంలేకున్నా, జ‌గ‌న్ సూచ‌న‌లు స‌ల‌హాల మేర‌కు ఆయ‌న మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత పార్టీలోకీల‌క నేత‌గా అప్పటి అధికార ప‌క్షం టీడీపీపై వ్యూహాత్మక విమ‌ర్శలు చేసే నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు.

మంత్రి పదవి వస్తుందని…..

ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది జ‌ర‌గిన ఎన్నిక‌ల్లో ఆయ‌న పెన‌మ‌లూరు నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసార‌థి. బీసీ కోటాలో త‌న‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. అయితే, జ‌గ‌న్ ఆయ‌న‌కు అనుకున్న విధంగా అవ‌కాశం ఇవ్వలేక పోయారు. ఒక్క కొలుసు పార్థసార‌థి అనేంటి.. వ‌స్తుంద‌ని గ్యారెంటీగా భావించిన రోజా, చెవిరెడ్డి, గ‌డికోట వంటి వారికి ఎవ‌రికీ కూడా మంత్రులుగా ప‌ద‌వులు ద‌క్కలేదు. దీంతో వీరికి ఇత‌ర ప‌ద‌వులు ఇచ్చి సంతృప్తి ప‌రిచారు జ‌గ‌న్‌.

కీలక పదవి……

రోజాకు ఏపీఐఐసీ, చెవిరెడ్డికి విప్ స‌హా.. తుడా చైర్మన్‌, గ‌డికోట కు చీఫ్ విప్ ప‌ద‌వుల‌ను అప్పగించా రు. ఇక‌, కొలుసు పార్థసార‌థి కి కూడా విప్ ప‌ద‌వి ఇచ్చినా.. ఆయ‌న దానిని తిర‌స్కరించిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌డిచిన రెండు మాసాలుగా కొలుసు మౌనం వ‌హిస్తున్నారు. ఎక్కడా పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌లేక పోతున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న‌కు జ‌గ‌న్ కీల‌క ప‌ద‌విని అప్పగించ‌నున్నార‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయనకు ప్రాంతీయ అభివృద్ధి మండలి (రీజినల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) ఛైర్మన్‌ పదవి వరిస్తోంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు రానున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ గా…

రాష్ట్రంలోని 13 జిల్లాలను అయిదు ప్రాంతీయ బోర్డు మండళ్లుగా విభజించి ఛైర్మన్లను నియమించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. గతంలో వైఎస్‌ హయాంలో ఈ మండళ్లు తెరమీదకు వచ్చాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కలిపి గానీ లేదా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కలిపి ఒక మండలి కానీ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా మండలికి కొలుసు పార్థసారథిని ఛైర్మన్‌గా నియమించనున్నారు. దీంతో అటు ఆయ‌న‌లోని అసంతృప్తిని తొల‌గించ‌డం, ఇటు కీల‌క‌మైన నాయ‌కుడికి కీల‌క బాధ్యత‌లు అప్పగించిన‌ట్టు ఉంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కొంచెం ఆల‌స్యమైనా కొలుసు కీల‌క ప‌ద‌వి కొట్టారనే వ్యాఖ్యలు పెన‌మ‌లూరులో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News