అలిగితే ఏమవుతుంది? ఇలా అవుతుందట
అత్త మీద కోపం దుత్త మీద చూపించారనే సామెత వినే ఉంటారు కదా! అలాంటిదే ఇప్పుడు వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి [more]
అత్త మీద కోపం దుత్త మీద చూపించారనే సామెత వినే ఉంటారు కదా! అలాంటిదే ఇప్పుడు వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి [more]
అత్త మీద కోపం దుత్త మీద చూపించారనే సామెత వినే ఉంటారు కదా! అలాంటిదే ఇప్పుడు వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి విషయంలో నిజం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది ఎన్నికల్లో పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ సంపాయించుకుని విజయం సాధించారు. అదే సమయంలో జగన్ కెబినెట్‌లో మంత్రి పదవిని కూడా ఆకాంక్షించారు. అయితే, ఆ పదవి ఆయనకు దక్కలేదు. అయితే, జగన్ ఆయనకు వెంటనే విప్ పదవిని ఆఫర్ చేశారు. అయినా కూడా కాదన్నారు. కానీ, అప్పటికే కేబినెట్ కూర్పు అయిపోయింది. దీంతో జగన్ చేయాల్సింది చేశారు. కానీ, సదరు నాయకుడు మాత్రం పదిమాసాలు పూర్తయిపోయి.. రేపో మాపో ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్నా.. మంత్రి పదవి తనకు దక్కలేదనే ఆవేదన, అలక ఇంకా వీడలేదట.
బీసీ కోటాలో….
చిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు విజయవాడ కు సమీపంలోని పెనమలూరు నియోజకవర్గం ప్రజలు. ఈ నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో కొలుసు పార్థసారధి విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. 2009 ఎన్నికల్లో పార్థసారథి ఇక్కడ నుంచి స్వల్ప తేడాతో విజయం సాధించారు. వైఎస్ నాడు జిల్లాలో మహామహులను కాదని పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక 2014లో వైసీపీ నుంచి బందరు ఎంపీగా ఓడిన పార్థసారథి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో సీనియార్టీ కోటాతో పాటు బీసీ (యాదవ వర్గం) కోణంలో జగన్ మంత్రి పదవి ఇస్తారని ఆశించారు.
రహదారి విస్తరణలో వైసీపీ సానుభూతిపరులకు….
అయితే, సామాజిక సమీకరణలు కుదరకపోవడంతో పార్థసారథిని జగన్ పక్కన పెట్టారు. ఇదే వర్గానికి చెందిన అనిల్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో ఇక్కడ సారధికి షాక్ తప్పలేదు. అయితే, ఆయన మాత్రం తనకు ఉద్దేశ పూర్వకంగా పదవి ఇవ్వలేదనే ఆవేదనతో ఉన్నారు. ఈ బాధనంతా ఆయన నియోజకవర్గంపై చూపిస్తున్నారట. ఇప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధిపై కనీసం దృష్టి పెట్టలేదని ఇక్కడి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజానికి విజయవాడ టు బందర్ ప్రధాన రహదారి విస్తరణలో చాలా మంది తమ ఇళ్లను పోగొట్టుకున్నారు. వీరిలో గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే న్యాయం జరిగింది. వైసీపీకి సానుభూతి పరులు అన్నవారికి న్యాయం జరగలేదనేది వాస్తవం.
నియోజకవర్గ సమస్యలపై….
ఈ క్రమంలో వీరంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన మాత్రం వీరి సమస్యను పట్టించుకోవడం మానేసి.. మీ సమస్య ఏదైనా ఉంటే స్పందనలో చెప్పుకోండి! అంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారని వీరి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అదే సమయంలో చిన్నపాటి పనులు కూడా చేపట్టడం లేదని అంటున్నారు. కేవలం తన వ్యవహారాలు, ఉంటే అసెంబ్లీకి వెళ్లడం లేదంటే ఇంటికే పరిమితం అన్నట్టుగా పార్థసారథి వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు. మొత్తానికి మంత్రి పదవి రాలేదని మాపై అలిగితే మేం ఏం చేస్తామని ప్రజలు నిట్టూరుస్తున్నారు. నిజమే కదా!!?