Konda : కొండా చూపు అటువైపేనట

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆయన ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒక [more]

Update: 2021-10-14 09:30 GMT

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆయన ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కానీ అప్పుడు ఆ యా పార్టీలు పెట్టుకునే పొత్తులను బట్టి తాను ఏ పార్టీలోకి వెళ్లాలన్నది కొండా విశ్వేశ్వర్ రెడ్డి డెసిషన్ కు రానున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తున్నారు.

సమదూరం పాటిస్తూ….

టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన బీజేపీలో చేరాలనుకున్నా వచ్చే ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై సందిగ్దంలో ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన మద్దతు ఈటల రాజేందర్ కే అని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ ను ఓడించాలంటే ఈటలకు మద్దతివ్వాలని ఆయన పిలుపుినిచ్చారు. అంటే బీజేపీకి బహిరంగంగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించినట్లయింది.

సత్సంబంధాలు….

మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తోనూ సఖ్యతగానే ఉంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సత్సంబంధాలను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో పరీక్షలకు సిద్దమంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డితో కలసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనతో కలసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు పార్టీలకు దగ్గరగానే ఉంటూ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

ఎన్నికలకు ముందు….

అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. కాంగ్రెస్ మాత్రమే కమ్యునిస్టులు, టీడీపీ, కోదండరామ్ వంటి పార్టీ లతో కలసి వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఆయన బీజేపీకి మద్దతు పలికారు. బీజేపీ అనే కంటే వ్యక్తిగతంగా ఈటలకు మద్దతిచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ వైపే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొగ్గు చూపే అవకాశముంది.

Tags:    

Similar News