కోట‌గిరి వార‌సుల స‌మ‌రం… ప‌శ్చిమ వైసీపీలో ప్రకంప‌న‌లు ?

స్థానిక సంస్థల ఎన్నిక‌ల వేళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అధికార వైసీపీ ఎంపీ ఇంట్లోనే ముస‌లం మొద‌లైంది. ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు, ఆయ‌న సోద‌రి అయిన [more]

Update: 2021-02-02 14:30 GMT

స్థానిక సంస్థల ఎన్నిక‌ల వేళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అధికార వైసీపీ ఎంపీ ఇంట్లోనే ముస‌లం మొద‌లైంది. ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు, ఆయ‌న సోద‌రి అయిన ఈస్ట్ య‌డ‌వ‌ల్లి ( కోట‌గిరి స్వగ్రామం) మాజీ స‌ర్పంచ్ పొన్నాల అనిత‌కు మ‌ధ్య తీవ్రమైన వార్ న‌డుస్తోంది. కొద్ది రోజులుగానే వీరి మ‌ధ్య నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న ఈ అస‌మ్మతి జ్వాల‌లు స్థానిక సంస్థల ఎన్నిక‌ల వేళ బ‌హిర్గతమ‌వుతున్నాయి. చివ‌ర‌కు ఈ అన్నాచెల్లెల యుద్ధంలో ఎవ‌రికి వారు పైచేయి సాధించే క్రమంలో ఒక‌రి మాట మ‌రొక‌రు వినే ప‌రిస్థితి కూడా చేయిదాటింద‌ని తెలుస్తోంది. వీరి తండ్రి అయిన దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు జీవించి ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో నాడు కోట‌గిరి కుటుంబానికి అనుకూలంగా ప‌రిస్థితులు లేవు. అప్పుడు ప్రజ‌ల కోరిక మేర‌కు అనిత స్వయంగా స‌ర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వగ్రామంలో కోట‌గిరి ప‌ట్టు నిలిపారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో అనిత పోటీలో ఉండ‌గానే విద్యాధ‌ర‌రావు ఆక‌స్మికంగా మృతి చెందారు. ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వీరిద్దరు వైసీపీలోనే ఉండ‌డంతో పాటు శ్రీథ‌ర్ గెలుపు కోసం అనిత ప్రచారం కూడా చేశారు. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య చిన్న చిన్నగా ఏర్పడిన మ‌న‌స్పర్థలు క్రమంగా పెరిగిన‌ట్టు టాక్ ?

తాజా ఎన్నిక‌ల్లో అన్నా వ‌ర్సెస్ చెల్లి ?

ఇప్పుడు కూడా ఈస్టు య‌డ‌వ‌ల్లి పంచాయ‌తీని జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌పున కోట‌గిరి శ్రీథ‌ర్ చిన్నాన్న కుమారుడు కోట‌గిరి కిషోర్ ( కామ‌వ‌ర‌పుకోట సొసైటీ అధ్యక్షులు ) కుమారుడు సాయిని స‌ర్పంచ్ అభ్యర్థిగా నిల‌బెట్టారు. సాయి గెలుపుకోసం ఎంపీ స్థాయిలో ఉండి మ‌రీ కోట‌గిరి శ్రీథ‌ర్ వ్యూహాలు ప‌న్నడంతో పాటు స్థానికంగా ప్రచారం కూడా చేస్తున్నారు. సాయి ఎంపిక అనిత‌కు తెలియ‌కుండా జ‌ర‌గ‌డంతో ఆమె హుటాహుటీన హైద‌రాబాద్ నుంచి య‌డ‌వ‌ల్లి వ‌చ్చి ఏకాభిప్రాయం లేకుండా స‌ర్పంచ్ అభ్యర్థిని ఎలా ? ఎంపిక చేస్తార‌ని అగ్గిమీద గుగ్గిలం కావ‌డంతో పాటు… ఆమె కూడా పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కోట‌గిరి కుమార్తెగా అనిత‌కు వీరి స్వగ్రాలో మంచి పేరు ఉంది. పార్టీల‌కు అతీతంగా ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆమె సాయం చేస్తారు.

శ్రీధర్ వెర్షన్ ఇదీ….

అయితే కోట‌గిరి శ్రీథ‌ర్ వ‌ర్గం వెర్షన్ మ‌రోలా ఉంది. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి తా,క ఎంపీగా ఉండ‌గా.. వీరి చిన్నాన్న కుమారుడు కిషోర్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు సాయి పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఇక అనిత‌కు స్థానికంగా పొలిటిక‌ల్‌గా స్పేస్ ఇవ్వలేదు. ఇది ఆమెకు న‌చ్చక‌పోవ‌డంతో ఆమె స‌ర్పంచ్ రేసులో ఉండ‌డంతో పాటు త‌న సోద‌రుడితోనే తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆమె స‌ర్పంచ్‌గా ఉన్న స‌మ‌యంలో నాడు టీడీపీ నేత‌లు కూడా ఆమెకు ప్రయార్టీ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ వ‌చ్చేలా చూస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత ఆమెకు ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలో చేరి కుటుంబంలో ఐక్యత చాటారు. అయితే అనంత‌ర కాలంలోనే ఆమెకు ప్రాధాన్యత లేక‌పోవ‌డంతో ఆమె సైతం త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చి…..

కోట‌గిరి శ్రీథ‌ర్ వ‌ర్గం త‌మ అభ్య‌ర్థని ప్రక‌టించ‌డంతో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన అనిత త‌న వ‌ర్గంతో గ్రామంలోనే స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశం జ‌రుగుతున్నప్పుడు కూడా ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ త‌న స్వగ్రామంలోనే ఇంట్లో ఉండి ఆరా తీసిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ ఇంట్లో జ‌రుగుతోన్న ఈ వార్ జిల్లాలోనే చ‌ర్చనీయాంశంగా మారింది.

రాజీ ప్రయ‌త్నాలు ఫ‌లించేనా ?

కోట‌గిరి ఫ్యామిలీ అంటేనే రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు. అలాంటి కుటుంబంలో అన్న, చెల్లి మ‌ధ్యే విబేధాలు వ‌చ్చాయ‌న్న ప్రచారంతో వీరి మ‌ధ్య రాజీ చేసేందుకు స‌మీప బంధువులు ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే అటు అన్నకు, ఇటు చెల్లికి ఇద్దరికి రాజ‌కీయంగాను, వ్యక్తిగ‌తంగాను క్లీన్ ఇమేజ్ ఉంది. అదే స‌మ‌యంలో ఇద్దరూ పంతానికి పోతే తాము అనుకున్నది సాధించే వ‌ర‌కు వ‌ద‌ల‌ర‌న్న టాక్ కూడా ఉంది. అందుకే కోట‌గిరి శ్రీథ‌ర్ ఎంపీగా ఉండి కూడా త‌న స్వగ్రామంలో స‌ర్పంచ్ ఎన్నిక‌ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నార‌ని అర్థమ‌వుతోంది. మ‌రి ఈ వీరి మ‌ధ్య రాజీ కుదురుతుందా ? లేదా ? ఇద్దరు ర‌ణ‌క్షేత్రంలో దూకుతారా ? ఎవ‌రిది పై చేయి అవుతుంద‌న్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News