ఆరు పార్టీలు మారిన ఆ మాజీ మంత్రి పరిస్థితి అధోగతే

ఆయ‌నో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. మాజీ మంత్రి.. ప‌లు పార్టీలు మారి ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారు. అయితే ప్రతి ఎన్నిక‌కూ ఓ పార్టీ మారుతూ రావ‌డంతో చివ‌ర‌కు [more]

Update: 2020-10-22 02:00 GMT

ఆయ‌నో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. మాజీ మంత్రి.. ప‌లు పార్టీలు మారి ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారు. అయితే ప్రతి ఎన్నిక‌కూ ఓ పార్టీ మారుతూ రావ‌డంతో చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లే కాకుండా పార్టీ అధిష్టానాలు ఆయ‌న్ను లైట్ తీస్కొనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. దీంతో ఆయ‌న అటూ ఇటూ ఎటూ కాకుండా రాజ‌కీయంగా అధికార పార్టీలో ఉండి కూడా ఎవ్వరూ ప‌ట్టించుకోని.. ఎవ్వరూ గుర్తించ‌ని నేత‌గా మిగిలిపోయారు. ఆ నేతే మాజీ మంత్రి, మాజీ కాపు కార్పొరేష‌న్ చైర్మన్ కొత్తప‌ల్లి సుబ్బారాయుడు. మాజీ హోం మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్య శిష్యుడుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలో వ‌రుస విజ‌యాలు సాధించారు. పార్టీ ఓడిపోయినా 2004లో గెలిచిన ఆయ‌న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2009 ఎన్నిక‌ల్లో సీటు అనౌన్స్ అయ్యాక చిరంజీవి ప్రజారాజ్యంలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వరసగా పార్టీలు మారుతూ….

త‌ర్వాత కాంగ్రెస్ త‌ర‌పున ( ప్రజారాజ్యం విలీనం నేప‌థ్యంలో ) 2012 ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్ష ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించినా టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. చంద్రబాబు కాపు కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చినా.. గ‌త ఎన్నిక‌ల వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేను త‌ప్పించి త‌న‌కు సీటు ఇవ్వలేద‌ని కొత్తప‌ల్లి సుబ్బారాయుడు మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ప‌లు పార్టీలు మారుతూ వ‌స్తోన్న కొత్తప‌ల్లి అంటే న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు చికాకు వ‌చ్చేసింది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా……

ఇప్పుడు ఆయ‌న‌కు స్థానికంగా ఓ వ‌ర్గం ఉన్నా కొత్తప‌ల్లి సుబ్బారాయుడు అధికార పార్టీలో ఉన్నా కూడా ఆయ‌న్ను ఎవ్వరూ గుర్తించ‌డం లేదు. జ‌గ‌న్ 2014 ఎన్నిక‌ల్లో అప్పటిక‌ప్పుడు పార్టీలోకి వ‌చ్చినా న‌ర‌సాపురం ఎమ్మెల్యే సీటుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్ష ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించినా ( పైగా సుబ్బారాయుడు కోసం జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటు అయిన ముదునూరు ప్రసాద‌రాజును ఆచంట‌కు పంపి మ‌రీ ) వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు సుబ్బారాయుడును క‌నీసం గుర్తించ‌ని ప‌రిస్థితి. పైగా కాపు కార్పొరేష‌న్ ప్రస్తుత చైర్మన్ జ‌క్కంపూడి రాజా సుబ్బారాయుడుకు వ‌రుస‌కు అల్లుడే ( జ‌క్కంపూడి సోద‌రే సుబ్బారాయుడు కోడ‌లు) అవుతాడు. అటు నుంచి కూడా పార్టీలో గుర్తింపు కోసం సుబ్బారాయుడు ఎన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నా వ‌ర్కవుట్ కావ‌డం లేదు.

కమిట్ మెంట్ లేకపోవడంతో….

ప్రస్తుతం న‌ర‌సాపురం ఎమ్మెల్యేగా ఉన్న ముదునూరు ప్రసాద‌రాజును కొత్తప‌ల్లి సుబ్బారాయుడు రాజ‌కీయంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ప్రసాద‌రాజు సుబ్బారాయుడి కంటే రాజ‌కీయంగా చాలా జూనియ‌ర్ అయినా క‌మిట్‌మెంట్‌తో ఉండ‌డం ఇప్పుడు ఆయ‌న‌కు చాలా ప్లస్ అయ్యింది. పైగా 2012 ఉప ఎన్నిక‌ల్లో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రీ ఆయ‌న వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నిక‌ల్లో సుబ్బారాయుడు కోసం త‌న సీటు వ‌దులుకుని మ‌రీ ఆచంట‌లో పోటీ చేశారు. రేపు మంత్రివ‌ర్గ మార్పుల్లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మైంది. ఇప్పటికే న‌ర‌సాపురంలో ప్రసాద‌రాజు హ‌వా కొన‌సాగుతుండ‌గా రేపు మంత్రి ప‌ద‌వి వ‌స్తే ఇక కొత్తప‌ల్లి సుబ్బారాయుడు మ‌రింత వెన‌క ప‌డిపోవ‌డం ప‌క్కా.

ఇక్కడైనా కుదురుకోగలరా?

ఇవ‌న్నీ తెలిసే కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి లేదా పార్టీ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఉండ‌డంతో పాటు విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నా జ‌గ‌న్ కాదు క‌దా క‌నీసం జిల్లా, స్తానిక నేత‌లు కూడా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు. జ‌గ‌న్ న‌ర‌సాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో బీసీలు, రాజుల‌కు ఇస్తోన్న ప్రయార్టీ కూడా కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ప‌ద‌వికి పెద్ద అడ్డంకిగా మారింది. మ‌రి సుబ్బారాయుడు ప‌ద‌వులు లేక‌పోయినా ఇక్కడైనా కుదురుకుంటారా ? మ‌ళ్లీ ప‌క్క చూపులు ఏవైనా చూస్తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News