అక్కడే కొత్తపల్లి కట్టెలమ్ముకోవాల్సిందేనా?

ఆయ‌న స‌మైక్య రాజ‌కీయాల్లోనే ఓ సీనియ‌ర్ నేత‌. స‌మైక్య రాష్ట్రంలోనే మాజీ మంత్రిగా చ‌క్రం తిప్పాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప‌లు కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. జిల్లాలో [more]

Update: 2021-09-22 15:30 GMT

ఆయ‌న స‌మైక్య రాజ‌కీయాల్లోనే ఓ సీనియ‌ర్ నేత‌. స‌మైక్య రాష్ట్రంలోనే మాజీ మంత్రిగా చ‌క్రం తిప్పాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప‌లు కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. జిల్లాలో మ‌హామ‌హులు ఉన్నా కూడా ఆయ‌న చెప్పిందే వేదంగా న‌డిచేది. అలాంటి నేత రాజ‌కీయంగా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో ఇప్పుడు వైసీపీలో పూచిక పుల్ల మాదిరిగా మారిపోయారు. రాష్ట్రం, జిల్లా సంగతి దేవుడు ఎరుగు.. చివ‌ర‌కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓ కౌన్సెల‌ర్ టిక్కెట్ ఇప్పించుకోలేని దీన‌స్థితికి దిగ‌జారిపోయారు. ఆ నేత ఎవ‌రో కాదు మాజీ మంత్రి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం కేంద్రంగా రాజ‌కీయాలు ప్రారంభించిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ప్రభుత్వ వ్యతిరేక గాలుల‌ను సైతం త‌ట్టుకుని ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న న‌ర‌సాపురం ఎంపీగా గెలిచి.. త‌న సోద‌రుడు జాన‌కీరామ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

ఏ పార్టీని విడిచి పెట్టకుండా?

త‌ర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో పార్టీ చిత్తుగా ఓడినా కొత్తప‌ల్లి సుబ్బారాయుడు గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలోకి జంప్ చేసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ప్రస్తుత న‌ర‌సాపురం ఎమ్మెల్యే ప్రసాద‌రాజు కొత్తప‌ల్లి సుబ్బారాయుడుని చిత్తుగా ఓడించారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆయ‌న 2012 ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. ష‌రా మామూలుగానే 2014 ఎన్నిక‌లకు ముందు వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేసి మ‌ళ్లీ ఓడారు. ఆ త‌ర్వాత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ప‌నిచేశారు. ఇలా టీడీపీ – ప్రజారాజ్యం – కాంగ్రెస్ – వైసీపీ – టీడీపీ ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ ఇలా ఎన్నో పార్టీలు మారడం వ‌ల్ల ఆయ‌న రాజ‌కీయ ప్రభ మ‌స‌క‌బారి ఆయ‌న అవుట్ డేటెడ్ లీడ‌ర్ అయిపోయారు.

టీడీపీ హయాంలో….

2014లో ఓడిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీలోకి వ‌చ్చి ఏపీ కాపు కార్పోరేష‌న్ ఛైర్మన్ అయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు సీటు ఇవ్వలేద‌ని మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లారు. పార్టీ మారిన స‌మ‌యంలో జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చార‌ట‌. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతోంది. ఎమ్మెల్సీ కాదు క‌దా.. క‌నీసం జిల్లా స్థాయి నామినేటెడ్ ప‌ద‌వి కూడా కొత్తప‌ల్లి సుబ్బారాయుడికి ఇవ్వలేదు. అన్నింటిక‌న్నా ఘోర అవ‌మానాలే ఆయ‌న‌కు మిగులుతున్నాయి.

ఆయన వర్గం అంటేనే?

ప్రస్తుతం న‌ర‌సాపురంలో ఎమ్మెల్యే ప్రసాద‌రాజు ( కాబోయే మంత్రి అని టాక్ ?) పెత్తనం న‌డుస్తోంది. చివ‌ర‌కు త‌న వ‌ర్గానికి ఓ కౌన్సెల‌ర్ ప‌ద‌వి ఇప్పించుకునేందుకు కూడా కొత్తప‌ల్లి సుబ్బారాయుడు అష్టక‌ష్టాలు ప‌డుతున్నారు. ఇక ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రిగిన‌ప్పుడు కూడా కొత్తప‌ల్లి సుబ్బారాయుడుని అసలు ప్రాప‌బుల్స్‌లోకే తీసుకోలేద‌ట‌. ఇప్పుడు మున్సిప‌ల్ కౌన్సెల్లో కొత్తప‌ల్లి సుబ్బారాయుడు వ‌ర్గంగా ఉన్న వారికి ఒక్క ప‌ద‌వి కూడా ఇవ్వ లేదు. ప్రసాద‌రాజు అన్ని ప‌ద‌వులు త‌న వ‌ర్గానికే ఇప్పించుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొత్తప‌ల్లి సుబ్బారాయుడు వ‌ర్గంగా ఉన్న నేత‌ల‌కు క‌నీసం గ్రామ‌స్థాయిలో కూడా ప‌నులు కావ‌డం లేదు.

క్యాడర్ సయితం…?

ఇక వైసీపీ కేడ‌ర్ కూడా కొత్తప‌ల్లి సుబ్బారాయుడుని న‌మ్మి ఆయ‌న వెంట ఉంటే ఎప్పుడు పార్టీ మార‌తారో ? చెప్పలేం అని ఆయ‌న‌కు దూర‌మై ఎమ్మెల్యే వెంట న‌డుస్తున్నారు. పైగా త్వర‌లోనే ప్రసాద‌రాజు మంత్రి అవుతార‌ని..కొత్తప‌ల్లి సుబ్బారాయుడు వెంట ఉంటే ఉప‌యోగం ఉండ‌ద‌ని స్థానిక వైసీపీ కేడ‌ర్ చెవులు కొరుక్కుంటోంది. ఏదేమైనా పూలు అమ్మిన‌చోటే క‌ట్టెల‌మ్మే స్థితికి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు రాజ‌కీయం వ‌చ్చేసింది.

Tags:    

Similar News