అమెరికా ఫ్లైట్ ఎక్కితే అంతేనా…..?

అమెరికాకు భారత దేశ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. అమెరికా ఫ్లైట్ చూస్తే చాలు అసమ్మతి రాగాలు గొంతు పెద్దవి చేస్తాయి. . వెన్నుపోటు కత్తి పదునెక్కుతుంది. [more]

Update: 2019-07-25 16:30 GMT

అమెరికాకు భారత దేశ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. అమెరికా ఫ్లైట్ చూస్తే చాలు అసమ్మతి రాగాలు గొంతు పెద్దవి చేస్తాయి. . వెన్నుపోటు కత్తి పదునెక్కుతుంది. కుర్చీ మీద ప్రేమ కాస్తా అలవికాని అభిమానంగా మారిపోతుంది. అంతే అటు ఫ్లైట్ అలా వెళ్ళిపోగానే ఇటు ఆపరేషన్ మొదలుపెట్టేస్తారు. దేశ రాజకీయాల్లో చూస్తే ఈ రక‌మైన కధలు చాలా కనిపిస్తాయి. తాజాగా కర్నాటకలో కుమారస్వామి సర్కార్ కుప్పకూలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుర్చీని కాపాడుకోలేక కుమారస్వామి రాజీనామా ఇవ్వాల్సివచ్చింది. దీనికి ముందు మూడు వారాల పాటు రసవత్తరంగా రాజకీయ డ్రామా కూడా సాగింది. దానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటే అమెరికా ఫ్లైట్ ని చూశాకే అనాల్సివస్తోంది.

అమెరికాలో ఉండగానే…..

తన సర్కార్ కి ఏం కాదు అనుకున్నారో ఏమో కానీ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా యాత్ర చేపట్టారు. అంతే ఇలా అయన విమానం అటు వైపుగా పరుగులు తీసిందో లేదో అలా కర్ణాటకం మొదలైపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. సీఎం కుమారస్వామి కళ్ళలోకి చూడలేం అనుకున్నారో ఏమో కానీ ఆయన వెనకాలే పని కానిచ్చేశారు. అంతేనా విషయం తెలిసి హడావిడిగా కుమారస్వామి సొంత గడ్డకు చేరుకున్నా ఎవరూ మళ్ళీ ఆయన్ని కలవలేదంటే మాజీని చేసేంతవరకూ నిద్రపోలేదన్నమాట. అమెరికా నేరక వెళ్లాననుకుని ఇపుడు తాపీగా కుమారస్వామి కుమిలిపోతున్నారట. అయినా ఏం లాభం. తప్పంతా అమెరికా ఫ్లైట్ ది అయితేను అంటున్నారుట అనుచర వర్గం.

ఏపీలోనూ అదే కధ….

ఇక ఏపీ రాజకీయాల్లోనూ ఇలాంటి కధే ఒకటి మూడున్నర దశాబ్దాల క్రితం జరిగింది. అప్పట్లో అంటే 1984 ఆగస్ట్ లో అమెరికాకు అన్న నందమూరి వెళ్ళారు. అమెరికా ఫ్లైట్ కన్ను గీటిందో ఏమో అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాదెండ్ల భాస్కరరావు అనబడే కో పైలెట్ తన ఫ్లైట్ ని ఏకంగా సీఎం అధికార‌ నివాసం వైపు నడిపాడు. అంతే రామారావు అంతటి ప్రజా నాయకుడు తొలిసారి వెన్నుపోటుకు గురి అయి సీఎమ్ పదవి పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కాక, కానీ అమెరికా యాత్ర సీఎం సీటు గోవింద యాత్రగా మారిపోయింది. ఆ తరువాత కొన్నాళ్ళు దేశంలోని సీఎం లు ఎవరూ విదేశాలకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఆయనే మొనగాడేమో…?

ఇక విదేశాలకు సీఎం లు వెళ్తే కుర్చీ ఆక్రమిద్దామనుకునే బాపతు దేశ రాజకీయాల్లో చాలామందే ఉన్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ 2012లో లండన్ టూర్ కి వెళ్తే ఆ విమానం అలా వెళ్లగానే ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయింది. విషయం తెలిసి హుటాహుటిన వెనక్కి తిరిగి వచ్చిన నవీన్ పార్టీ నుంచి కొందరిని గెంటేసి మరీ పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. లేకపోతే అప్పట్లోనే ఆయన మాజీ అయ్యేవారు. ఇక ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉండగా చేసినన్ని విదేశీ యాత్రలు ఎవరూ చేయలేదు కానీ ఆయన ఎక్కడ ఉన్నా తమ పక్కనే ఉన్నట్లుగా తమ్ముళ్ళు భావించేవారో ఏమో కానీ సీఎం కుర్చీలోనే బాబుని చూసుకుని అలా పదవిని కాపాడుకుంటూ వచ్చారు. మొత్తానికి అమెరికా యాత్రలు మాత్రం సీఎం కుర్చీలకు ఎసరు పెడతాయని భారత దేశ రాజకీయ చరిత్ర చెప్పిన సత్యం.

Tags:    

Similar News