ఆర్జీవీ సినిమా ఆగిపోతుందా …?

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సినిమా. అయితే ఈ సినిమా ప్రకటించిన నాటినుంచి సంచలనంగానే మారింది. దీనికి [more]

;

Update: 2019-01-23 02:30 GMT

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సినిమా. అయితే ఈ సినిమా ప్రకటించిన నాటినుంచి సంచలనంగానే మారింది. దీనికి కారణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకు ఎక్కించనుండటమే. వివాదాలకు ఎదురువెళ్ళి సినిమాలు తీయడం ఆది నుంచి వర్మకు అలవాటే. గతంలో రక్త చరిత్ర పేరిట పరిటాల రవి జీవిత కథను, వంగవీటి చిత్రం తో వంగవీటి రంగా కథను ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కొన్నా ప్రేక్షకుల ముందుకు తెచ్చేశారు వర్మ. తాజాగా ఎన్టీఆర్ జీవిత చరమాంకం పై వర్మ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో ఈ చిత్రం ఎన్నికల ముందు విడుదల అవుతుందా లేదా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

ఎన్టీఆర్ ఆశీస్సులు …

వచ్చే ఎన్నికల్లో వర్మ చిత్రం విడుదల అయితే చంద్రబాబు క్యారెక్టర్ పై గట్టి మచ్చ పడనుంది. మామకు వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న క్యారెక్టర్ లో చంద్రబాబు ఇమేజ్ అమాంతం డ్యామేజ్ కావడం ఖాయమే. వర్మ సినిమాకు నిర్మాతగా రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. లక్ష్మీపార్వతి ఆశీస్సులు మెండుగా వున్నాయి. ఆమె కూడా ఇప్పుడు జగన్ పార్టీ వైపే వున్నారు. ఈ నేపథ్యంలో వర్మ చిత్రం రాజకీయంగా ఎంతో కొంత నష్టం తెస్తుందని లెక్కేసింది టిడిపి. మరోపక్క బాలకృష్ణ రెండు భాగాలుగా తీసిన కథానాయకుడు చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోవడంతో మహానాయకుడు చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. ఈ సమయంలో వర్మ సినిమా హిట్ గాని అయితే అన్న భయం తమ్ముళ్లలో నెలకొంది.

సినిమా ఆపేయాలంటూ …

దీంతో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలుపుచేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్యెల్యే వర్మ హై కోర్టు తలుపు తట్టారు. ప్రజా ప్రయోజన వాజ్యం గా వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, వర్మ, సెన్సార్ బోర్డు లకు నోటీసులు జారీ చేసింది. వారు తమ వాదనలు దాఖలు చేయడానికి నాలుగు వారాలు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు భవిష్యత్తులో ఇవ్వబోయే తీర్పు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వర్మ పాటలే బెంబేలు పెట్టాయి …

మరో పక్క ఇప్పటికే వర్మ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన కొన్ని పాటలు సంచలనమే అయ్యాయి. బాలయ్య కథానాయకుడు విడుదల చేసిన రోజున వర్మ ఎన్టీఆర్ ను చేసిన వెన్నుపోటు ఇతివృత్తంగా విడుదల చేసిన పాట మరింత వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలయ్యాక చేసేది ఏమి లేదు కనుక ముందే ఈ సినిమాను అడ్డుకోవాలని టిడిపి తొందరపడింది. భావ ప్రకటన స్వేచ్చకు అడ్డు చెప్పడానికి అవకాశం లేకుండా రాజ్యాంగం కల్పించిన రక్షణ నేపథ్యంలో వర్మ చిత్రానికి బ్రేక్ వేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే ఫలానా అంశాలు తొలగించాలని కోరే పరిస్థితి ఉండొచ్చంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News