వాళ్లు మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. చాలా మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్న విష‌యంపై తాజాగా నివేదిక అందుకున్న చంద్రబాబుకు ఈ నేత‌ల [more]

Update: 2020-07-22 00:30 GMT

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. చాలా మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్న విష‌యంపై తాజాగా నివేదిక అందుకున్న చంద్రబాబుకు ఈ నేత‌ల ప‌నితీరు, వారి గ్రాఫ్ కూడా న‌చ్చడం లేదు. అంతేకాదు, వారి ప‌రిస్థితి తెలుసుకుని ఆయ‌న ఏం చేయాల‌నే ధోర‌ణిని ప్రద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఎన్నో ఆశ‌ల‌తో.. అంటే.. రెండో సారి కూడా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఆశ‌తో చాలా మంది వైఎస్సార్ సీపీ నేత‌లు, కొంద‌రు వైఎస్సార్ సీపీలోకి రావాల‌నుకున్న నేత‌లు.. కూడా చంద్రబాబు చెంత‌కు వెళ్లారు. అయితే, రెండోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకున్న టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

వైసీపీ నుంచి వచ్చి చేరి…..

అంతేకాదు, కీల‌క నాయ‌కులు ఓడిపోయారు. దీంతో ఈ పార్టీలో చేరి, పోటీ చేసిన వైఎస్సార్ సీపీ నాయ‌కులు, చాలా మంది యువ నేత‌లు కూడా ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా రాజాం మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీ మోహ‌న్‌, చిత్తూరుకు చెందిన మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి, విజ‌య‌వాడ‌కు చెందిన జ‌లీల్‌ఖాన్, క‌ర్నూలుకు చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చ‌రిత, అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి దంప‌తులు, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మ‌రో కేంద్ర మాజీ మంత్రి వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్‌, నెల్లూరుకు చెందిన మ‌రో మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఇలా చాలా మంది నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వెళ్లి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు.

అయిష్టంగానే కొనసాగుతున్నారని…..

వీరంతా ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీలో ఉన్నప్పటికీ.. వారి మ‌న‌సుమాత్రం వైఎస్సార్ సీపీలోనే ఉంద‌ని అంటున్నారు. వీరిలో ఒక్క ముర‌ళీ త‌ప్ప.. మిగిలిన వారంతాం కూడా క్షణికావేశంలో వైఎస్సార్ సీపీని విడిచామ‌ని, అక్కడే ఉండి ఉంటే.. మంచి ఛాన్స్‌లు ద‌క్కి ఉండేవ‌ని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మ‌ళ్లీ వైఎస్సార్ సీపీలోకి రావాల‌ని వారు ప్రయ‌త్నిస్తున్నా.. పార్టీలో ఇప్పటికే తామ‌ర తంప‌ర‌గా నాయ‌కులు ఉండ‌డంతో వీలు లేద‌ని సీఎం జ‌గ‌న్ త‌లుపులు మూసేశారు. ఈ నేప‌థ్యంలోనే వారంతా టీడీపీలో అయిష్టంగానే కొన‌సాగుతున్నార‌నేది టీడీపీ అధినేత చంద్రబాబుకు అందిన స‌మాచారం.

రెంటికి చెడ్డ రేవడిగా…

ఈ క్రమంలోనే ఈ నేత‌లు అంతా గ‌త యేడాది కాలంగా పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని, ఏ కార్యక్రమానికీ హాజ‌రుకావ‌డం లేద‌ని కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. పోనీ.. మిగిలిన వారైనా, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యాక్టివ్‌గా ఉందామంటే.. వీరిని పార్టీ అధిష్టానం తొలిగించ‌లేదు. దీంతో ఎలాంటి ప‌ద‌వులు లేకుండా తామెందుకు పార్టీ కార్యాక్రమాలు చేయాల‌ని మిగిలిన వారు మౌనం పాటిస్తున్నారు. దీంతో రెండికీ చెడ్డరేవ‌డి మాదిరిగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఉంద‌ని చంద్రబాబుకు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News