లోకల్ బాడీతో కబాడీ ఎవరికి ?
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉండే మోజే వేరు. అపుడు వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. జనం కూడా ఆ మైకంలో [more]
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉండే మోజే వేరు. అపుడు వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. జనం కూడా ఆ మైకంలో [more]
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉండే మోజే వేరు. అపుడు వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. జనం కూడా ఆ మైకంలో గుడ్డిగా మళ్ళీ మళ్ళీ ఓట్లు గుద్దేస్తారు. ఆ విధంగా వైసీపీ సర్కార్ ఒక సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకుంది అని చెప్పాలి. ఎందుకంటే 151 సీట్లు, 22 మంది ఎంపీలతో 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ తెలివిగా వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకుని ఉంటే క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడేది. కొత్త నాయకత్వం వచ్చేది. అసంతృప్తులు కూడా ఉండేవి కావు. వేలల్లో పదవులు వైసీపీ క్యాడర్ పరమయ్యేవి. మొత్తానికి భారీ విజయం మరొకటి నమోదు చేసి విపక్షం నోరు గట్టిగా మూతపడేది.
పుణ్యకాలం అలా…..
ఎందుకో జగన్ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో మొదట్లో పెద్దగా శ్రధ్ధ పెట్టలేకపోయారు. రిజర్వేషన్లు, కోర్టు వ్యవహారాలు ఎలా ఉన్నా ఎన్నికలు పెట్టాలనుకుంటే గత ఏడాది ఆగస్టులోనే పూర్తి అయ్యేవి. పుణ్యకాలమంతా దాటేసి ఈ ఏడాది మార్చిలో హడావుడి చేయడమే పెద్ద పొరపాటు. ఇక కరోనా వంటి ప్రపంచ విపత్తు గా దూసుకువచ్చి స్థానిక ఎన్నికలను మింగేసింది. దాంతో లోకల్ బాడీలకు కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అర్ధికంగా కుదేలు అయిన ఏపీకి అక్కరకు వచ్చే నిధులు దక్కకపోవడం కంటే దారుణం వేరొకటి ఉండదు కదా. ఇక జగన్ కి ఎన్నికల సంఘంతో కయ్యం ఏర్పడింది. ఆ మీదట జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. కోర్టుల దాకా వెళ్ళి తలబొప్పి కట్టించుకుని పరువు పోగొట్టుకుంది వైసీపీ సర్కార్.
రెండేళ్లు గడిస్తే…..
ఇక వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు అంటున్నారు. అంటే ఇపుడున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి తో ముగుస్తుంది. ఆ మీదట కొత్త వారిని నియమించుకుని ఆయన ఆద్వర్యంలో ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్. అయితే అప్పటికి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అవుతుంది. దాంతో మెల్లగా వ్యతిరేకత మొదలవుతుంది. జనాలు తమకు అందివచ్చిన అవకాశంగా స్థానిక ఎన్నికలను తీసుకుంటే మాత్రం ఫలితాలు ఇబ్బందికరంగా మారడం ఖాయం. పైగా కరోనా మిగిల్చిన ఆర్ధిక సంక్షోభాలు, రాజకీయ పోరాటాలు, సొంత పార్టీలో వర్గాలు ఇవన్నీ కలసి ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సీట్లు దక్కేలా చేస్తాయా అన్నది పెద్ద డౌట్.
ఆపడం కష్టమేనా…?
ఒకసారి జనాభిప్రాయం ఏదో రూపంలో బయటపడితే విపక్షాలకు కొత్త బలం వచ్చేస్తుంది. వారు స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకుని రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలుపులు తిప్పేసుకుంటారు. ఏపీలో అసలే టీడీపీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. లోకల్ బాడీలో ఏ మాత్రం వైసీపీకి తేడా కొట్టినా కబాడీ ఆడేందుకు రెడీగా ఉంటుంది. మరి జగన్ ఎన్నికలకు సై అంటారా లేక చంద్రబాబు బాటలోనే నడిచేసి వాయిదా వేసుకుంటూ పోతారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఎన్నికలు పెట్టడమే మంచిదని వైసీపీలో వినిపిస్తున్న మాట. ఎందుకంటే పార్టీ క్యాడర్ కి డైరెక్టుగా దక్కే పదవులు అవే. వారు క్షేత్ర స్థాయిలో గట్టిగా నిలబడితే వైసీపీకి మరో విజయానికి బాటలు వేస్తారు ఏది ఏమైనా లోకల్ బాడీ ఎన్నికలు వైసీపీ ఎపుడు జరిపినా ఫలితాలు మాత్రం ఆసక్తికరంగానే ఉంటాయన్న విశ్లేషణ మాత్రం ఉంది.