లవర్స్‌ డే మూవీ రివ్యూ

బ్యానర్: సుఖీభవ సినిమాస్ న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, దిల్‌ రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: [more]

Update: 2019-02-14 11:55 GMT

బ్యానర్: సుఖీభవ సినిమాస్
న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, దిల్‌ రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: శీను సిద్ధార్థ్‌
మ్యూజిక్ డైరెక్టర్: షాన్ రెహ‌మాన్‌
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన ఒరు ఆడార్‌ ల‌వ్‌ ని తెలుగులోకి లవర్స్ డే అనే పేరుతొ డబ్ చెయ్యడానికి ఒకే ఒక్క కారణం ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు ఆడార్‌ ల‌వ్‌ సినిమాలో బాయ్ ఫ్రెండ్ ని చూసి కన్నుకొట్టి… ముద్దుపెట్టి.. వేళ్లని గన్ లా చేసి పేల్చడం తో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా క్వీన్ గా రాత్రికి రాత్రే అవతారమెత్తింది. అప్పటి నుండి ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ మాములుగా పెరగలేదు. కేవలం కన్నుగీటు సుందరిగా ప్రియా ప్రకాష్ అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. ఇక ప్రియా ప్రకాష్ క్రేజ్ తోనే ఒరు ఆడార్‌ ల‌వ్‌ నిర్మాతలు ఈ సినిమాని అన్ని భాషల్లోకి డబ్ చేశారు. ఇక తెలుగులో వాలంటైన్స్ డే సందర్భంగా ఒరు ఆడార్‌ ల‌వ్‌ సినిమాని లవర్స్ డే పేరుతో విడుదల చేశారు. ఇక ప్రియా ప్రకాశ్ కి ఉన్న క్రేజ్ తో ఈ లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ హీరో అల్లు అర్జున్ అటెండ్ అవడంతో.. అందరి చూపు ఈ సినిమా మీద పడింది. మరి కన్నుగీటు సుందరి లవర్స్ డే ని ప్రేక్షకులు ఏ మేర ఆదరించారు అనేది సమీక్షలో తెలుసుకుందాం.

క‌థ

టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీ నేప‌థ్యంలో సాగే ప్రేమకథ ఈ లవర్స్ డే సినిమా. కాలేజ్ లో రోష‌న్(రోష‌న్‌), ప్రియా(ప్రియా వారియ‌ర్‌), గాథ జాన్(నూరిన్ షెరిఫ్‌) మంచి ఫ్రెండ్స్. వీరంతా ఒకే క్లాస్ చదువుతుంటారు. అయితే రోష‌న్‌, ప్రియా మొదటి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. రోషన్, ప్రియా ఒక్క‌టి కావ‌డానికి గాథ సాయ‌ప‌డుతుంది. కానీ కొన్ని అనుకోని అవాంతరాల వల్ల రోష‌న్‌కు, ప్రియాకు మ‌ధ్య దూరం పెరుగుతుంది. ప్రియా.. రోషన్ కి బ్రేక‌ప్ చెబుతుంది. విడిపోయిన రోషన్, ప్రియాలను మ‌ళ్లీ ఒక్క‌టి చేయాల‌ని… ఫ్రెండ్స్ అంతా కలిసి గాథని రంగంలోకి దింపుతారు. గాథ, రోష‌న్‌లు ప్రేమలో ప‌డిన‌ట్టుగా న‌టించాల‌ని ఫ్రెండ్స్ చెబుతారు. కానీ కొన్నాళ్ల‌ రోషన్, గాథ నిజాంగానే ప్రేమలో పడతారు. మరి గాథ, రోషన్ ప్రేమలో పడితే.. ప్రియా పరిస్థితి ఏమిటి? అసలు ప్రియా, రోషన్ లు కలుస్తారా? రోషన్, ప్రియా, గాథ ల ప్రేమ దేనికి దారితీస్తుంది? తెలుసుకోవాలంటే లవర్స్ డే ని వీక్షించాల్సిందే.

నటీనటుల నటన

రోషన్, ప్రియా ప్రకాష్, నూరిన్ షెరిఫ్ పాత్రలే లవర్స్ డే సినిమాకి కీల‌కం. సినిమా మాత్రం ఆ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇక హీరో రోషన్ పాత్రలో ఎలాంటి వైవిద్యం కనబడదు. ఏప్పుడూ న‌వ్వుతూ క‌నిపిస్తుంటాడు. స్టూడెంట్స్ గా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కలిసిపోతాడు కానీ.. ప్రత్యేకంగా హీరోగా అనిపించాడు. ఇక ప్రియా క‌న్నుకొట్టే స‌న్నివేశంతో పాపుల‌ర్ అవ‌డంతో ఆమె సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా మారింది. అయితే మ‌రో హీరోయిన్ నూరిన్ షెరిఫ్ కూడా సినిమాలో త‌న అందంతో ఆక‌ట్టుకున్నది. కొన్ని సన్నివేశాల్లో నూరిన్ ప్రియాకి ధీటుగా నటించి మెప్పించింది. ఒక ద‌శ‌లో నూరిన్ పాత్రే సినిమాకి కీలకంగా కనిపిస్తుంది. న‌ట‌నప‌రంగా ప్రియా కన్నా ఎక్కువ స్కోప్ నూరిన్ కే ఉంది. మిగతా నటీనటులకు ఓ అన్నంత ప్రాధాన్యత లేకపోయినా… ఉన్నంతలో మెప్పించారు.

విశ్లేషణ

కాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఎలాంటి స్నేహం, ఈగోలు, తగాదాలు, ప్రేమ, ఆకర్షణ ఉంటుంది… అనే విషయాన్నీ అనేకమంది దర్శకులు తమదైన స్టయిల్లో చూపించారు. అందులో ప్రముఖంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ లాంటి సినిమాలు కనబడతాయి. ఇక ఈ లవర్స్ డే సినిమా కూడా కాలేజ్ వాతావరణంలోనే సాగుతుంది. దర్శకుడు పదో తరగతి తర్వాత రెక్కలొచ్చిన పక్షుల్లా కాలేజ్ లోకి అడుగుపెడట్టే విద్యార్థులు స్నేహానికి, ప్రేమకు, ఆకర్షణకు ఇచ్చే వాల్యుని కథగా మలిచి సినిమాగా తెరకెక్కించాడు. మొదటిసారి ప్రేమలో పడడం, ఆకర్షణ, ప్రేమలో ఉండే తగాదాలు, ప్రేమను దక్కించుకునేందుకు వేసే ఎత్తులు ఇలా ఈ లవర్స్ డే మొత్తం స్టూడెంట్స్ చుట్టూనే తిరుగుతుంది. అసలు మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన ఒరు ఆడార్‌ ల‌వ్‌ గురించి ఎవ్వరికీ అంత పెద్ద ఆసక్తి కాని అంచనాలు కానీ లేవు. కానీ ప్రియా వారియ‌ర్ క‌న్నుకొట్టే స‌న్నివేశం సోషల్ మీడియా ద్వారా సంచ‌ల‌నంగా మారిన త‌ర్వాత ఈ సినిమా క‌థ, కథనం మొత్తం మారిపోయింది. ప్రియకొచ్చిన క్రేజ్ ని పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ఆమె పాత్ర ప‌రిధిని సినిమాలో పెంచారు. ఈ సినిమాలో కాలేజీలో జ‌రిగే ఫ్రెష‌ర్స్ డే, యానువ‌ల్ డే సంద‌డితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో బ్రేక‌ప్‌, మ‌ళ్లీ కొత్త‌గా ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాల‌తో సాగుతుంది. టూకీగా చెప్పాలంటే ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాగదీత సీన్లతో నవ్వు రాని రొటీన్ కామెడీతో నడిపితే, సెకెండ్ హాఫ్ లో ఫ్లోలేని సన్నివేశాలతో అప్పుడే కథను మొదలు పెట్టి.. ఎలివేట్ కాని కథలోని మెయిన్ ఎమోషన్ తో సినిమాని చాలా బోరింగ్ గా నడిపాడు. ప్రేమ‌క‌థ‌ల‌కి ఎమోషనల్ సన్నివేశాలు కీల‌కం. కానీ ఆ అంశంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫలమయ్యాడు. అయితే అక్కడక్కడా రోష‌న్‌, గాథ‌ల మ‌ధ్య ప్రేమ పుట్టే స‌న్నివేశాలు మాత్రం ఆక‌ట్టుకుంటాయి. ఇంకా ఈ సినిమాలో మెయిన్ మైనస్ డబ్బింగ్. డబ్బింగ్ ఎక్కడా సినిమాకి ఏమాత్రం అత‌క‌లేదు. కేవలం కన్నుగీటు సుందరి క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుంది అని అనుకుంటే… మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇక సినిమా సాంకేతికంగా వీక్ గానే కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: ప్రియా ప్రకాష్ గ్లామర్, నూరిన్ షెరిఫ్‌ గ్లామర్, రెండు పాటలు, క్లైమాక్స్.

నెగెటివ్ పాయింట్స్: కథ, కథనం, ఎమోషనల్ సన్నివేశాల కొరత, కామెడీ, దర్శకత్వం, ఫస్ట్ హాఫ్

Tags:    

Similar News