“పవర్” చూపిస్తే అంతేనట

అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు రాజకీయాలు చేస్తే ఫలితాలను ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు తర్వాత కాలంలో పాములై చుట్టుకుంటాయి. పైకి అందరినీ కలుపుకుని [more]

Update: 2020-02-27 00:30 GMT

అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు రాజకీయాలు చేస్తే ఫలితాలను ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు తర్వాత కాలంలో పాములై చుట్టుకుంటాయి. పైకి అందరినీ కలుపుకుని పోతున్నట్లు కన్పించినా సైలెంట్ గా గ్రూపు రాజకీయాలను చేయడంలో దిట్ట మాగంటి బాబు. ఫలితంగా నేడు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చిందంటున్నారు. మాగంటి బాబు ఫ్యామిలీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎందుకూ కొరకాకుండా పోయిందంటున్నారు.

కుటుంబానికే ప్రత్యేకత…

పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి బాబు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. మాగంటి బాబు తండ్రి రవీంద్రనాధ్ చౌదరి జిల్లా పరిషత్ ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత మాగంటి బాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మాగంటి కుటుంబం 2009లో టీడీపీలో చేరి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా నిలదొక్కుకున్నారు.

ఎమ్మెల్యేలతో పొసగక…..

ఎంపీగా గెలిచిన మాగంటి బాబుకు జిల్లాలోని ఎమ్మెల్యేలతో పొసగలేదు. అప్పటి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ లకు ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేక గ్రూపులు తయారు చేశారన్న ఆరోపణలున్నాయి. మాగంటి బాబు అప్పట్లో చింతమనేని ప్రభాకర్ తో కలసి గ్రూపులకు తెరతీశారన్న విమర్శలున్నాయి. అనేకసార్లు మాగంటి బాబుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు మౌనంగానే ఉన్నారు.

గ్రూపు విభేదాలే ఇప్పుడు….

ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో అదే గ్రూపు విభేదాలు మాగంటి బాబుకు శాపంగా పరిణమించాయంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా చుర్గుగా పాల్గొనడం లేదు. తన కుమారుడు రాంజీని యాక్టివ్ గా పార్టీలో పార్టిసిపేట్ చేద్దామనుకున్నా నేతల సహకారం దొరుకుతుందో? లేదో? అన్న అనుమానం ఉంది. తన కుమారుడు రాంజీని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని చేసి నారా లోకేష్ కు చేరువ చేసినా ఆయన పట్ల కొందరు నేతలు సుముఖంగా లేరని తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని కూడా మాగంటి బాబు అంచనా వేసుకుని సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. మొత్తం మీద అధికారంలో ఉన్న ప్పుడు తాను ఇబ్బంది పెట్టిన నేతలతో ఇప్పుడు మాగంటి బాబుకు తలనొప్పిగా తయారయింది.

Tags:    

Similar News