ధోని ది గ్రేట్ ….!

పొమ్మనకుండా పొగపెడుతుంది మహేంద్ర సింగ్ ధోనికి బిసిసిఐ. తన కెరియర్ కి పొంచి వున్న ప్రమాదం గుర్తించిన గ్రేట్ ఫినిషర్ ఇప్పుడు తన రిటైర్మెంట్ కి సమయం [more]

Update: 2019-07-21 02:00 GMT

పొమ్మనకుండా పొగపెడుతుంది మహేంద్ర సింగ్ ధోనికి బిసిసిఐ. తన కెరియర్ కి పొంచి వున్న ప్రమాదం గుర్తించిన గ్రేట్ ఫినిషర్ ఇప్పుడు తన రిటైర్మెంట్ కి సమయం దగ్గర పడిందని కోడై కూస్తున్న లోకానికి షాక్ ఇచ్చాడు. వెస్ట్ ఇండీస్ టూర్ కి సెలక్షన్ కి ముందే తాను రెండు నెలలపాటు అందుబాటులో ఉండనంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పేశాడు. అయితే తన పదవీవిరమణ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై పలు రకాల ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. తనపై అటు విమర్శకులు ఇటు ప్రశంసకులు నోరు పారేసుకుంటున్నా మిస్టర్ కూల్ మాత్రం తన పని తాను చేసుకుపోతుండటం గమనార్హం.

ఇప్పటికే టెస్ట్ లకు గుడ్ బై …

వన్డే ప్రపంచ కప్, టి ట్వంటీ ప్రపంచ కప్, టెస్ట్ లలో టీం ఇండియా నెంబర్ వన్ ర్యాంక్. ఇలా అన్ని ఫార్మెట్లలో తన కెప్టెన్సీ తో భారత పతాకం ఎగురవేసిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీది. ఒక కెప్టెన్ గా అంతకన్నా సంతృప్తి ఎవరికి దక్కుతుంది. టీం వికెట్ కీపర్ గా కూడా అద్భుత రికార్డ్ లు మహేంద్ర సింగ్ ధోని సొంతం. ఇక ప్రపంచంలోనే వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెట్టే బ్యాట్స్ మెన్ గాను ధోని ఘనత వహించాడు. వివాద రహితుడిగా తన కెరియర్ మొదటి నుంచి రాణించిన ఈ జార్ఖండ్ డైనమేట్ బ్యాట్ ఝళిపిస్తే సిక్సర్లు, బౌండరీ ల వాన కురవాలిసిందే. ఎప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచాలో మ్యాచ్ ఎలా ఫినిష్ చేయాలో మహేంద్ర సింగ్ ధోని కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి అరుదైన స్టార్ క్రికెటర్ తొందరగా రిటైర్ కావాలని టీం ఇండియా లో స్థానం ఆశిస్తున్న యువ క్రికెటర్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై కొట్టేశాడు. పొట్టి క్రికెట్ ను ఆస్వాదిస్తున్నాడు. ఈ రెండు ఫార్మెట్లలోనూ కూడా ఎప్పుడు ధోని బై చెబుతాడా అని వెయిటింగ్ లో వున్న క్రికెటర్లు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మహేంద్ర సింగ్ ధోని ఆడినంతకాలం ఆ స్థానం మరొకరితో భర్తీ చేసే సాహసం బిసిసిఐ చేయలేకపోవడమే. ఆ ప్రయోగం వికటిస్తే అంతా బోర్డు పై నిప్పులు కురిపిస్తారు. అదే తనకు తానుగా రిటైర్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. అదే కోరుకుంటుంది బోర్డు కూడా.

ధోని రెండు నెలలు చేసేది ఇది ….

ఇంతకి ఈ రెండు నెలలు మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసేది దేశ సేవ కోసం కావడం విశేషం. తాను క్రికెట్ నుంచి తప్పుకుంటే ఆర్మీకి సేవలందిస్తానని ఇదివరకే మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. తాజాగా తన చివరి వరల్డ్ కప్ తరువాత మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కి గుడ్ బై కొడతాడనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు మహేంద్రుడు. వెస్ట్ ఇండీస్ టూర్ కి మహేంద్ర సింగ్ ధోని సెలక్టర్ లు ఎంపిక చేయని ఆటగాళ్ళలో ఉంటాడనే ఊహాగానాలు వినిపించాయి. ఇవేమి పట్టించుకోని మహేంద్ర సింగ్ ధోని ఆర్మీ లోని ప్యారాచూట్ విభాగం లో రెండు నెలల శిక్షణకు సిద్ధం అయ్యాడు. ఆ విధంగా తన నిర్ణయాన్ని ప్రకటించడంతోబాటు తన దేశభక్తిని శంకించేవారికి అన్ని రకాల సమాధానం చెప్పేశాడు. అయితే విండీస్ టూర్ తరువాత మహేంద్ర సింగ్ ధోని తిరిగి జట్టులోకి వస్తాడా ? లేక ఒక మంచి ముహూర్తం చూసుకుని గుడ్ బై కొడతాడా ? వచ్చే ఏడాది జరిగే టి ట్వంటీ వరల్డ్ కప్ కి మహేంద్ర సింగ్ ధోని లేని టీం ఇండియా టోర్నీ కి వెడుతుందా ఇవే ఇప్పుడు సగటు క్రీడాభిమానులు తొలిచే ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పేది మహేంద్ర సింగ్ ధోని మాత్రమే కావడంతో నడుస్తున్న ఊహాగానాలన్ని కొట్టిపారేయొచ్చంటున్నారు క్రీడాపండితులు.

Tags:    

Similar News