మ‌ల్లాదికి పొగ‌బెట్టిందెవ‌రు..?

రాజ‌కీయంగా ఎప్పుడు ఎలాంటి ప‌రిణామ‌మైనా చోటు చేసుకునే అవ‌కాశం మెండుగా ఉంది. బ‌ళ్లు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్లు అవుతాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఏనిముషానికి ఏం జ‌రిగినా.. జ‌ర‌గొచ్చ‌ని [more]

Update: 2021-09-14 14:30 GMT

రాజ‌కీయంగా ఎప్పుడు ఎలాంటి ప‌రిణామ‌మైనా చోటు చేసుకునే అవ‌కాశం మెండుగా ఉంది. బ‌ళ్లు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్లు అవుతాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఏనిముషానికి ఏం జ‌రిగినా.. జ‌ర‌గొచ్చ‌ని చెబుతారు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే.. బెజ‌వాడ రాజ‌కీయాల్లోనూ చోటు చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును ప్ర‌భుత్వం ప‌క్క‌కు త‌ప్పించింది. ఈ ప‌ద‌విని సీతంరాజు సుధాక‌ర్‌కు అప్ప‌గించారు. అయితే.. ఈ అనూహ్య మార్పు వెనుక ఏం జ‌రిగింద‌నేది కీల‌క చ‌ర్చ‌గా మారింది. అస‌లు మ‌ల్లాది విష్ణు వంటి కీల‌క నేత‌ను ప‌క్క‌కు పెట్టి.. ఎందుకిలా చేశారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఆ పదవే కోరుకున్నా…?

వాస్త‌వానికి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన మ‌ల్లాది విష్ణు జ‌గ‌న్ కేబినెట్లో బ్రాహ్మ‌ణ కోటాలో మంత్రి పీఠాన్ని ఆశించారు. దీనికి గాను ఆయ‌న గ‌తంలో వైఎస్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని వాడుకున్నారు. అయితే.. ఆయ‌న ఎన్నిక ల‌కు ముందు పార్టీలో చేర‌డం.. పెద్ద‌గా మెజారిటీ కూడా రాక‌పోవ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలోను.. అప్ప‌టికే మ‌రికొంద‌రు సీనియ‌ర్లు కూడా ఉండ‌డంతో జ‌గ‌న్ ఈయ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌కవ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెలంప‌ల్లికి అవ‌కాశం ఇచ్చారు.

ఇద్దరి మధ్య విభేదాలతో….

నిజానికి ఈ ఇద్ద‌రూ వైసీపీకి కొత్త నేత‌లే. ఒక‌రు బీజేపీ నుంచి కొంత ముందు వస్తే.. మ‌రొక‌రు కాంగ్రెస్ నుంచి కొంచెం లేటుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అంతే. అయిన‌ప్ప‌టికీ.. వెలంప‌ల్లికి అవ‌కాశం చిక్క‌డం.. స‌హ‌జంగానే మ‌ల్లాది విష్ణు వ‌ర్గంలో అసంతృప్తిని రేపింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఇరు వ‌ర్గాలు.. సంపూర్ణంగా స‌హ‌క‌రించుకోవ‌డం మానేశాయి. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. మంత్రి ప‌ద‌విని ఆశించిన మ‌ల్లాది విష్ణుకి .. జ‌గ‌న్ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇది దాదాపు దేవదాయ శాఖ‌తో ముడిప‌డి ఉండ‌డం.. దేవ‌దాయ శాఖ‌మంత్రిగా ఉన్న వెలంప‌ల్లికి ఈయ‌న‌కు మ‌ధ్య అంత‌ర్గ‌త విభేదాలు సాగుతుండ‌డంతో కార్పొరేష‌న్‌ను మ‌ల్లాది విష్ణు పూర్తిగా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

సలహాదారు జోక్యంతో..?

ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇరువురి మ‌ధ్య స‌ఖ్య‌త‌లేక‌పోవ‌డం.. వెలంప‌ల్లికి అనుకూలంగా ఒక స‌ల‌హాదారు వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా.. కార్పొరేష‌న్ ప‌ద‌వి నుంచి మ‌ల్లాది విష్ణుని ప‌క్క‌న పెట్టార‌ని.. విజ‌య‌వాడ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. అదే స‌మ‌యంలో మ‌ల్లాది విష్ణు వ‌ర్గం ఈ విష‌యంలో ఫుల్లు సైలెంట్ అయిపోయింది. కానీ, వెలంప‌ల్లి వ‌ర్గం మాత్రం .. అనూహ్యంగా ఒక వింత ప్ర‌చారం ప్రారంభించింది. మ‌ల్లాది విష్ణుకి త్వ‌ర‌లోనే మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని.. అందుకే త‌ప్పించార‌ని.. వెలంప‌ల్లి వ‌ర్గంగా ఉన్న కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నార్హం. జగన్ దృష్టిలో మ‌ల్లాది విష్ణును చెడుగా చూపడానికి ఇలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారట. మొత్తంగా చూస్తే.. మ‌ల్లాది విష్ణు ఎపిసోడ్‌లో తెర‌వెనుక అనేక సంగ‌తులు వున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News