కరోనా కాలం….సంక్షోభం ముదిరింది

కరోనా కల్లోలంలో అసంఘటిత రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అనేక రంగాల మాదిరే మీడియా కూడా పెద్ద ఎత్తున కుదుపుకు గురైంది. పదిహేను రోజులకే మాధ్యమాల పరిస్థితి తలకిందులయ్యింది. [more]

Update: 2020-04-15 11:00 GMT

కరోనా కల్లోలంలో అసంఘటిత రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అనేక రంగాల మాదిరే మీడియా కూడా పెద్ద ఎత్తున కుదుపుకు గురైంది. పదిహేను రోజులకే మాధ్యమాల పరిస్థితి తలకిందులయ్యింది. ఇప్పట్లో కోలుకోలేననంత సంక్షోభాన్ని అవి చవిచూస్తున్నాయి. చిన్నపెద్ద తేడా లేకుండా తెలుగునాట అన్ని సంస్థలు ఏదో రకంగా పొదుపు చర్యలు చేపట్టాయి. ఉద్యోగుల కుదింపు., బలవంతపు సెలవులు, వేతనాల్లో కోతలు ఇవన్నీ బాధితుల వైపు నుంచి చూస్తే చాలా పెద్ద సమస్యలు. న్యూస్‌ ప్రింట్‌ దిగుమతులు భారమైపోవడం, కలర్‌ ఇంకుల ఖరీదులు పెరగడం, సర్క్యూలేషన్‌ భారం ఇవన్నీ సంస్థల కష్టాలకు కారణం. ఇటీవల ఓ మిత్రుడు వాల్‌లో తెలుగు పత్రికల్లో తలెత్తిన కరోనా కల్లోలం చూసిన తర్వాత ఇందులో ఎక్కువ ఆయా సంస్థల స్వయంకృతమే ఎక్కువ కనిపించింది. ఈ సమయంలో నా అభిప్రాయాన్ని చెప్పడం వల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏది లేదు కాబట్టి మనసులో అనిపించింది కక్కేస్తున్నా.

అధికారంలో ఉంటే…..

తెలుగు పత్రికలు కొని చదవడం మానేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నో ఏళ్లుగా ఉన్న అలవాటు వదులుకోవడం మొదట్లో కొంత కష్టం అనిపించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం దాదాపు అన్ని తెలుగు పత్రికలు రాజకీయ అనుబంధ పుత్రికలే కావడం ప్రధాన కారణం. ఎవరు ఒప్పుకున్నా., ఒప్పుకోకున్నా తెలుగులో తటస్థ పత్రికలు లేవు. రాజకీయ అనుబంధ పత్రికలు తప్ప నిష్పాక్షిక వార్తలు అందించే పత్రికలు లేనే లేవు. వామపక్షాలకు సొంత పత్రికలు ఉన్నట్టే మిగిలిన రాజకీయ పక్షాలకు అనుకూల పత్రికలు ఉన్నాయి. వాటి పేర్లు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అది అందరికి తెలిసిన విషయమే. పాఠకుడు కొని పత్రికలు వాటి ఆలోచనా ధోరణులను, ఉద్దేశాలను, లక్ష్యాలను, ప్రయోజనాలను పాఠకుడి మెదడులో ఇంకేలా చేయడమే లక్షంగా పనిచేయడం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. సోషల్ మీడియా ప్రభావం అంతగా లేని రోజుల్లో ఈ ధోరణి చెల్లుబాటైంది కాని ఇప్పుడు నెలకు రూ.160 చెల్లించి పత్రికను కొని బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం ఎవరికి పెద్దగా కనిపించడం లేదు. ఏ పత్రికలో అయినా మొదటి పేజీ వార్తలు ఖచ్చితంగా పత్రిక యాజమాన్య అజెండాకు అనుగుణంగానే ఉంటుంది. అది యాజమాన్య పాలసీ…. ఈ యాజమాన్య పాలసీ ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల ఆధారంగా అటుఇటుగా మారుతుంటుంది. గత పదేళ్లలో పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు, గత పదినెలల్లో ఇచ్చిన ప్రకటనలు చూస్తే అధికారంలో ఎవరు ఉంటే, వారి అనుకూల పత్రికలకు ప్రకటనల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా అందుతుందనేది స్పష్టం అవుతుంది.

విసుగు తెప్పించేవిగా….

పత్రికల ఆదాయం గణనీయంగా పడిపోవడం వల్ల ఉద్యోగుల కుదింపు, యూనిట్ల మూసివేత., వేతనాల కుదింపు పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో పత్రికలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికలు అవి అందించే వార్తలు పాఠకులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయన్నది ప్రశ్నించుకోవాల్సిన తరుణం. గత ఐదారేళ్లుగా పత్రికల ధోరణి గమనిస్తే వీలైనన్ని ఎక్కువ పేజీలు ప్రభుత్వ వార్తలే ఉంటాయి. పాలక పక్ష అధినేతల వార్తలతోనే మాస్ట్‌ హెడ్‌ ఉంటుంది. ప్రభుత్వ వైరిపక్షాల పత్రికల్లో ప్రభుత్వాలను తూర్పారబట్టే వార్తలు ఉంటాయి. ఈ ప్రకటనలు, వాటి ఖండనలే పత్రికలుగా అమ్ముడైపోవడం చాలామంది పాఠకులకు విసుగుతెప్పించింది. తెలుగు పత్రికల సర్క్యూలేషన్‌ గణనీయంగా తగ్గిపోడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. పాఠకులు ఏమి అచ్చు వేసినా చదువుతారనే భ్రమల్లోనే పత్రికా నిర్వాహకులు ఉండటం ఓ విషాదం.

సామాజిక వర్గాల ప్రయోజనాలే…..

పత్రికల్లో వచ్చే వార్తల్లో అన్ని సామాజిక వర్గాల ప్రయోజనాలు., సమాజంలో సమతుల్యత, అసమానత, దోపిడి నిర్మూలన, పీడన నిరోధం, సాంఘిక ప్రయోజనాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ పూట స్టాండ్లలో వీలైనన్ని ఎక్కువ కాపీలు అమ్ముడయ్యేలా చూడటమే వాటి అసలు లక్ష్యం. కరపత్రాలను కొని చదివే ధోరణి ఎక్కడా ఉండదు. కానీ పెద్ద సంఖ్యలో కరపత్రాలను గుదిగుచ్చి పత్రికగా అచ్చు వేస్తే మాత్రం పాఠకుడు కొని చదవాల్సిన దౌర్భాగ్యం. పత్రికలను ఎందుకు కొని చదవాలి అనే ఆలోచన ఏ వర్గంలోనో, సమూహంలోనో తలెత్తితే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన ఇప్పటికీ జరగలేదు. ప్రతి పత్రిక తమ ఆలోచనల్ని విస్త్ర్రతం చేసుకోవడానికి., తమ సిద్ధాంతాల వ్యాప్తి తద్వారా భావసారూప్య వర్గం విస్తృతి పెంచుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి తప్ప అందులో అట్టడుగు వర్గాల ప్రయోజనాలు ఏమున్నాయి, సమాజనంలో అసమానతల నిర్మూలనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే ఆలోచన ఉండదు. సోషల్‌ మీడియా పుణ్యమాని ఇలాంటి ఆలోచనల విస్తృతి గణనీయంగా పెరిగింది. విశ్వ వ్యాప్త ఆలోచన ధోరణి అందరికి అందుబాటులోకి రావడం వల్ల జరిగిన మేలు ఉంది. పత్రికల కష్టాల గురించి బాధపడే అవసరం ఉద్యోగులకు తప్ప సామాన్యులకు ఏ మాత్రం లేని సమయమిది. ఎందుకంటే కోట్లాది ప్రజలు వందలు, వేల కిలోమీటర్లు కాలినడకన కష్టాలతో ఉన్న సమయంలో ఫలానా పత్రికకు ఇంత కష్టమొచ్చిందా అనే నిట్టుర్పు కూడా దక్కదు.

మెజారిటీ ధోరణి ఇంతే…..

ఇక ప్రసార మాధ్యమాల్లో ఉద్యోగులు చాలా మంది వేతన జీవులు కాదు. క్షేత్ర స్థాయిలో పనిచేసే కంట్రిబ్యూటర్లకు కనీస వేతనాలు., ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం ఉండదు. చాలామందికి ఉద్యోగులకు నియామకాలు ఉండవు. మార్కెటింగ్‌., అడ్వైర్టైజింగ్‌ సెక్షన్లలో వారు తెచ్చే ఆదాయాన్ని బట్టి వేతనాలు, వార్తా పత్రికలు కావొచ్చు. టీవీ మాధ్యమాలు కావొచ్చు. వాటి సంపాదకీయ ధోరణిలో చాలా సందర్భాల్లో ఛాందన భావాలే ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా న్యూస్‌ రూమ్‌లలో తల నిండా బూజు పట్టిన మెదళ్లతో అవి పనిచేస్తుంటాయి. మానవ సమాజ వికాసం కానీ, సామాజిక ప్రయోజనాలు కానీ వాటికి పట్టని వ్యవహారాలు. వార్తల అమ్మకంలో లాభాన్ని మాత్రమే చూసూ లాలూచి ధోరణి ఆ మెదళ్లకు ఉంటుంది. విశ్వసనీయత, విలువలు ఇవేమి వాటికి అక్కర్లేని విషయాలు. పత్రికలు కొని చదివే వారంతా తమ కులమో, వర్గమో కానక్కర్లేదనే ఉదారత, ఉద్యోగుల విషయంలో మాత్రం ఉండదు. పాఠకులు, ప్రేక్షకుల విషయంలో లేని పట్టింపు ఉద్యోగుల విషయంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుబడిదారి మీడియాకు ఉంటుంది. టీవీలలో కూడా ఇదే పరిస్థితి. పత్రికలు చదివే పాఠకులు, టీవీల్లో వీక్షించే ప్రేక్షకులు తమ వర్గం వారే అయ్యుండాల్సిన అవసరం మీడియా పెట్టుబడి వర్గాలకు ఉండదు. కానీ వార్తల్ని రూపొందించే మెదళ్లు, ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లే వారధులు చాలా సందర్భాల్లో వర్గ ప్రయోజనాలను కాపాడేవారే అయ్యుండాల్సి ఉంటుంది. ఇందులో అక్కడక్కడ కొన్ని మినహాయింపులు ఉండొచ్చు కానీ మెజార్టీ ధోరణి ఇలాగే ఉంటుంది.

అక్షరంలో లాభాలు…..

పత్రికల్లో వచ్చే వార్తల్లో పాఠకుల ప్రయోజనమో, ప్రజా ప్రయోజనమో అనేది ఆత్మవంచనే…. వందల కోట్ల రుపాయలు పెట్టుబడులుగా పెట్టి… ప్రతి అక్షరంలో లాభాలను వెదుక్కోవడంలో … తప్పు వెదకాల్సిన పనేమి లేదు. ఆయా పత్రికల పాఠకులుగా మారడం ద్వారా తాము అభిమానించే నాయకత్వానికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉపయోగపడుతున్నామనే స్పృహ పాఠకులకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. తద్వారా పత్రికలు కొనడం ద్వారా తాము కోరుకున్న నాయకత్వానికి మద్దతు ఇవ్వగలుగుతున్నామని మాత్రమే సంతోషపడాలి తప్ప అంతకు మించి పాఠకులు ఆశించకూడదు. ఇది చాలామందిని నొప్పించవచ్చు కానీ, పత్రికలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని లేదా ప్రభుత్వ విధానాలను శాసించాలని., శాసించగలుగుతున్నామనో చాలా ఏళ్లుగా బలంగా నమ్ముతున్నాయి. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎన్నికయ్యే ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉంటాయని, వార్తల ద్వారా., విశ్లేషణల ద్వారా ప్రజల ఆలోచనా విధానాన్ని తామే నిర్దేశించగలుగుతున్నామనేది పత్రికల పెట్టుబడిదారి వర్గాల ఆలోచన. అనుకూల వార్తల ద్వారా అధికారంలో ఉండే ప్రభుత్వాల నుంచి ప్రకటనల ఆదాయం పొందగలిగితే, ప్రతిపక్షంలో ఉండే వారికి అదే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాల నుంచి ఆదాయం అందుతుంటుంది. ఈ పోరాటంలో అందులో పనిచేసే ఉద్యోగుల పరిధి., పాత్ర చాలా చిన్నది. మిగిలిన ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ మీడియా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. పాలక పక్షాల మెప్పు పొందడమో, ప్రతిపక్షాల అస్త్రాలుగా మారడమన్నది అన్ని చోట్ల ఉన్నదే అయినా ఈ రోగం మన దగ్గర ఎక్కువ కనిపిస్తుంది.

ప్రకటనలు నిలిచిపోవడంతో….

ఓ పత్రిక బయటకు రావడానికి 25-30రుపాయలు ఖర్చయితే దానిని ఐదు రుపాయలకు మార్కట్లో విక్రయిస్తే మిగిలిన నష్టం భరించడానికి పెట్టుబడుదారులు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారనది ఎవరికైనా వచ్చే ఓ సందేహం. అంతకు మించిన ప్రయోజనాలు పత్రికలో నిర్వహణలో ఉండటమే దీనికి కారణం. పత్రిక ఉత్పాదక వ్యయంలో అమ్ముడయ్యే ఖరీదు పోను మిగిలిన మొత్తం ఇన్నాళ్లు ఏదొక రూపంలో వాటికి అందేది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో., ప్రధానంగా ఏపీలో ప్రింట్‌., ఎలక్ట్రానిక్‌ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు దాదాపు నిలిచిపోయాయి. ప్రభుత్వ అనుకూలంగా ఉండే వాటికి మాత్రమే నిర్దేశిత నిబంధనల మేరకు ఆదాయం లభిస్తోంది. ఇక ఎలక్ట్రానిక్‌ మీడియా ఎప్పట్నుంచో గడ్డు పరిస్థితి ఎదుర్కోంటోంది. ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. పాఠకులకు నచ్చే., మెచ్చే వార్తల్ని ఇవ్వడంలో మాధ్యమాలు ఎప్పుడో విఫలమయ్యాయి. సర్క్యూలేషన్‌., రేటింగ్‌ రేసుల్లో అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు కరోనా పుణ్యమాని ఈ సంక్షోభం మరింత ముదిరింది. మాధ్యమాలు మారుతాయా, పాఠకుల్ని మెప్పిస్తాయా లేకుంటే చతికిల పడతాయా అన్నది కాలమే తేల్చాలి. పత్రికలు కొని చదవాలో, వద్దో అనే నిర్ణయం పాఠకులు తీసుకునేలా చేయాల్సింది కూడా పత్రికలే.

 

శరత్‌ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News