మంత్రి అయ్యాక తీరు మారిందే

ఏపీలో అత్యంత కీల‌క‌మైన హోం శాఖ మంత్రిగా ఉన్న మేక‌తోటి సుచ‌రిత చుట్టూ.. ఫిర్యాదులు చుట్టుముట్టాయి. నిప్పులేందే పొగ‌రాదు..! అన్నట్టుగా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఐదు మాసాలు [more]

Update: 2019-12-05 00:30 GMT

ఏపీలో అత్యంత కీల‌క‌మైన హోం శాఖ మంత్రిగా ఉన్న మేక‌తోటి సుచ‌రిత చుట్టూ.. ఫిర్యాదులు చుట్టుముట్టాయి. నిప్పులేందే పొగ‌రాదు..! అన్నట్టుగా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఐదు మాసాలు కూడా పూర్తికాక‌ముందుగానే మేక‌తోటి సుచ‌రిత దూకుడు ప్రద‌ర్శిస్తోంద‌ని అంటున్నారు గుంటూరు జిల్లా వైసీపీ నాయ‌కులు. ప్రత్తిపాడు నుంచి విజ‌యం సాధించిన మేక‌తోటి సుచ‌రిత వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ త‌న ప్రభుత్వం ఏర్పడ‌గానే ఎంతో కీల‌క‌మైన హోం శాఖ ప‌ద‌విని మేక‌తోటి సుచ‌రితకు అప్పగించారు. ఎస్సీ మ‌హిళ కావ‌డం, ముఖ్యంగా ఏపీలో మ‌హిళ‌కు హోం శాఖ ప‌గ్గాలు అప్పగించ‌డం రికార్డు సృష్టించింది.

అందుబాటులో లేకపోవడం….

మొద‌టి మూడు మాసాలు బాగానే ఉన్నా మేక‌తోటి సుచ‌రిత చుట్టూ.. ఇప్పుడు సొంత పార్టీలోనే విభేదాలు ముసురు కున్నాయి. ఆమె స్థానికంగా నాయ‌కుల‌కు అందుబాటులో లేకుండా పోయార‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. కేవ‌లం మంత్రిగా త‌న ప‌ని చేసుకుని పోతున్నార‌ని, త‌మ‌కు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వ డం లేద‌ని ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కులే ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో గుంటూరు జిల్లాకే చెందిన ఆత్మకూరుల శాంతి భ‌ద్రతల విష‌యం పెను క‌ల‌క‌లం సృష్టించింది. అదే స‌మయంలో టీడీపీ నుంచి మంత్రి మేక‌తోటి సుచ‌రితపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. శాంతి భ‌ద్రత‌లు అదుపు త‌ప్పాయ‌ని పెద్ద విమ‌ర్శలే వ‌చ్చాయి. వీటిపై మేక‌తోటి సుచ‌రిత స‌రిగా స్పందించ‌లేద‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో కూడా ఉంది.

కుమార్తె వివాహానికి…..

ఇక‌, ఇటీవ‌ల ఆమె త‌న కుమార్తె వివాహం చేశారు. ఈ విష‌యంలో కొన్ని ప‌నుల‌ను పార్టీలోని స్థానిక నేత‌ల‌కు అప్పగించారు. అయితే, వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించ‌క‌పోగా.. మేక‌తోటి సుచ‌రిత అందుబాటులో లేక పోవ‌డంతో ల‌క్షల్లో తాము క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని స్థానికంగా ఉన్న దిగువ శ్రేణి నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అదే స‌మ‌యంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల నిర్వహ‌ణ‌కు కూడా మంత్రిగా మేక‌తోటి సుచ‌రిత ఎలాంటి బాధ్యతా తీసుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

క్యాడర్ లో అసహనం….

ఎన్నిక‌ల స‌మయంలో ఆమెకు అండ‌గా నిలిచిన కేడ‌ర్ వంక ఇప్పటి వ‌ర‌కు క‌న్నెత్తి చూడ‌లేద‌ని, ఇలా అయితే, మేం పార్టీలో ఉండి ఏం ప్రయోజ‌నం అని కార్యక‌ర్తలు వాపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల్లో స్థానిక కేడ‌ర్‌కు మేక‌తోటి సుచ‌రిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ప్రాధాన్యత అస్సులు ఏ మాత్రం ఇవ్వడం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మ ఎమ్మెల్యే హోం మంత్రి అవ్వడంతో వెన‌క‌ప‌డిన ప్రత్తిపాడు రూపురేఖ‌లే మారిపోతాయ‌ని అనుకున్న ఆ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కుల‌కు ఇప్పుడు ఆమె అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వక‌పోవ‌డంతో వారి దీన‌గాథ ఎవ్వరూ వినే ప‌రిస్థితి కూడా లేద‌ట‌. మ‌రి ఈ నేప‌థ్యంలో మంత్రి త‌న శైలిని మార్చుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News