చివరకు ఇలా అయిపోయారేంటి?

“ రాష్ట్రంలో మ‌న‌కు గుర్తింపు లేదు. మ‌నోళ్ల వ్యాపారాలు కూడా ముందుకు సాగ‌డం లేదు. పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నా. ఏ ఒక్క ప‌నీ చేయించుకోలేక పోతున్నా. నిక‌రంగా [more]

Update: 2021-01-15 13:30 GMT

“ రాష్ట్రంలో మ‌న‌కు గుర్తింపు లేదు. మ‌నోళ్ల వ్యాపారాలు కూడా ముందుకు సాగ‌డం లేదు. పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నా. ఏ ఒక్క ప‌నీ చేయించుకోలేక పోతున్నా. నిక‌రంగా చెప్పాలంటే.. మ‌న ప్రభుత్వం ఏర్పడాలి. మ‌నోళ్లు అధికారంలోకి రావాలి. అప్పుడే మ‌న‌కు న్యాయం జ‌రుగుతుంది. ఇదేదో ఉత్తినే చెబుతున్న మాట కాదు“ ఇదీ 2019 ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు.. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య. ఇదేదో.. ఆయ‌న చాటుగా చెప్పింది కాదు.. బ‌హిరంగంగానే వ్యాఖ్యానించి సంచ‌ల‌నం రేపారు. ఇది.. వైసీపీ పుంజుకునేందుకు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం వైసీపీ వెంట న‌డిచేందుకు చాలా వ‌ర‌కు దోహ‌ద‌ప‌డింది.

ఎక్కడా కన్పించడం లేదే?

2009 ఎన్నిక‌లకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి న‌ర‌సారావుపేట ఎంపీ సీటు ద‌క్కించుకుని గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2014లో రాయ‌పాటి కోసం త‌న సీటు వ‌దులుకుని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎంపీ సీటు వ‌దులుకున్నందుకు చంద్రబాబు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఇవ్వలేద‌ని మోదుగుల ఐదేళ్ల పాటు అస‌హ‌నంతోనే ఉన్నారు. చివ‌ర్లో టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గుంటూరు ఎంపీ టికెట్ సంపాదించి పోటీ చేశారు. క‌ట్ చేస్తే.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైసీపీలో ఆయ‌న మాట వినిపించ‌డం లేదు. ఆయ‌న ఫొటో కూడా క‌నిపించ‌డం లేదు.

మాట వరసకయినా…?

ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఊసు కూడా లేకుండా పోయింది. అస‌లు గుంటూరు జిల్లాలో వైసీపీ వాళ్లు మాట‌వ‌ర‌సకు అయినా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు త‌ల‌వ‌డం లేదు స‌రిక‌దా ? ఆయ‌న్ను చాలా కార్యక్రమాల‌కు పిల‌వ‌ని ప‌రిస్థితి. ఓ సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న ఫోటో కూడా ఫ్లెక్సీల్లో వేయ‌డం లేదు. పార్టీలో ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. అనేక‌మైన స్థానిక ప‌ద‌వులు ఇచ్చారు. చాలా మందికి ఎమ్మెల్సీగా కూడా అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్‌.. రాజ్యస‌భ స‌భ్యత్వాల‌ను కూడా ఇచ్చిన సీఎం.. మోదుగుల‌ను మాత్రం ప‌క్కన పెట్టారు. ఇదే గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రాజ్యస‌భ టికెట్ ఇచ్చారు. కానీ, మోదుగుల విష‌యాన్ని మాత్రం ప‌ట్టించుకోలేదు.

గుర్తింపు లేకుండా…?

అదేస‌మ‌యంలో ప‌లువురికి నామినేటెడ్ ప‌దవులు కూడా క‌ట్ట‌బెట్టారు.కానీ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మాత్రం ప‌ట్టించుకోలేదు. దీంతో వేణు అలిగార‌ని కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. కానీ.. అత్యంత స‌న్నిహితులు చెబుతున్నది మ‌రో రీజ‌న్ ఉంది.. పార్టీలోను ప్రభుత్వంలోనూ కీల‌కంగా ఉన్న స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మోదుగుల‌కు ఆటంకంగా మారార‌ని అంటున్నారు. ఏ విష‌యంలోనూ మోదుగుల‌కు అవ‌కాశం ఇవ్వకుండా అడ్డుపుల్ల వేస్తున్నార‌ని అంటున్నారు. దీనివెనుక వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఆయ‌న పార్టీలోనే ఉన్నా.. ఎక్కడా జెండా ప‌ట్టుకోవ‌డం లేదు. పార్టీ కార్యక్రమాల‌కు కూడా హాజ‌రుకావ‌డం లేదు. ఫుల్లు సైలెంట్‌గానే ఉండిపోయారు. టీడీపీలో ప‌దేళ్లు ఎంపీ, ఎమ్మెల్యే ప‌ద‌వులు అనుభ‌వించి వ‌చ్చిన మోదుగుల వైసీపీలో చివ‌ర‌కు గుర్తింపుకు కూడా నోచుకోకుండాపోయారు.

Tags:    

Similar News