ఈ విన్యాసం… అన్నింటిపైనా ఉంటే?

పత్రికల పరమావధి సామాజిక ప్రయోజనాలు అనేది జర్నలిజం తరగతుల్లో మొదటి రోజు నుంచి చెప్పే మాట. జర్నలిజం అర్థం ఎలా మారిపోయిందో సామాజిక ప్రయోజనం అర్థం కూడా [more]

Update: 2020-07-05 12:30 GMT

పత్రికల పరమావధి సామాజిక ప్రయోజనాలు అనేది జర్నలిజం తరగతుల్లో మొదటి రోజు నుంచి చెప్పే మాట. జర్నలిజం అర్థం ఎలా మారిపోయిందో సామాజిక ప్రయోజనం అర్థం కూడా మారిపోయింది. సామాజిక పదానికి వర్గ ప్రయోజనం జత చేరింది. సామాజిక ప్రయోజనాన్ని సామాజిక వర్గ ప్రయోజనంగా మలచడంలో పత్రికల కృషి గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 200 రోజులుగా జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలకు ప్రధాన పత్రికల్లో పతాక స్థాయిలో చోటు దక్కుతోంది. నిజానికి పత్రికల నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్కో పత్రిక మార్కెట్ లోకి రావాలంటే దాని ఉత్పాదక వ్యయంలో , మూడో వంతు ఖరీదుతో విక్రయించాలంటే నష్టాలను భరిస్తూ నడపాల్సిందే.

నష్టాలను భరిస్తూ…..

మరి నష్టాలను భరిస్తూ పత్రిక వ్యాపారం ఎందుకు కొనసాగిస్తున్నాయి అంటే అంతకు మించిన ప్రయోజనాలు ఇతర మార్గాల్లో వారికి దక్కుతాయి. పత్రికల నిర్వహణకు ప్రకటనలు ప్రధాన ఆదాయ వనరు. ప్రభుత్వాల ప్రయోజనాల కాపాడుకునే క్రమంలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం, వాటి స్థాయి, సర్క్యూలేషన్ బట్టి గిట్టుబాటు అవుతుంది. ఇతర మార్గాల్లో వచ్చే ప్రకటనలు కలుపుకుని వాటి ఉత్పాదక వ్యయాన్ని యాజమాన్యాలు అధిగమిస్తుంటాయి. మరి అమరావతి విషయంలో పత్రికలు ఏ ప్రయోజనాలు పొందడం వల్ల పెద్ద ఎత్తున వార్తలు ఇస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పత్రికలు మనుగడ సాధించాలంటే తాము కోరుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని కోరుకుంటాయి. ప్రభుత్వాలు అధికారంలో ఉండాలంటే అందుకు తగ్గ ఆర్థిక వనరులతో సొంత వర్గం పరిపుష్టం కావాలి. రాజధాని వార్తలు, ఉద్యమాలు వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే.

పెద్దయెత్తున వార్తలు ఇవ్వడానికి…

అధికారానికి దూరం కావడం, సామాజిక వర్గ ప్రయోజనాలకు గండి పడటం, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తినడం…. వీటన్నింటి నుంచి గట్టెక్కడానికి ప్రజల్ని చురుగ్గా ఉంచడం తమ బాధ్యతగా పత్రికలు భావిస్తున్నాయి. ఉదాహరణకి 8రూపాయల ఖరీదు చేసే ఈనాడులో మాస్ట్ హెడ్ తో పాటు 5 పేజీలలో 10వార్తలు, ఆంధ్ర జ్యోతిలో 3 పేజీలలో మాస్ట్ హెడ్ తో పాటు, ఎడిట్ పేజీ, మరో 16వార్తలు అమరావతి ఆందోళనపై ఇచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున వార్తలు ఇవ్వడానికి వేరే కారణం ఏది వాటికి అక్కర్లేదు. కులానికి కలిగిన కష్టాన్ని సమాజానికి జరిగిన నష్టంగా ప్రజల్ని మభ్య పెట్టడంలో భాగంగా ఈ వార్తల విన్యాసం జరుగుతోంది.

సామాజికవర్గమేనా?

కొద్దిసేపు ఈ వార్తలు సమాజ ప్రయోజనాల కోసమే ఇచ్చినవి అనుకుందాం. సమాజంలో అన్ని కులాల ప్రయోజనాలు, కష్టాల విషయంలో ఇలాగే ఏకబిగిన పత్రికల మద్దతు లభిస్తుందా…, ప్రజాందోళనలు, పౌర సమస్యలు, సామాజిక రుగ్మతలు, మూఢ నమ్మకాలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు విషయంలో ఈ స్థాయి మద్దతు ఎన్నడూ కనిపించలేదే? పత్రికలు, ప్రసార మాధ్యమాల నిర్వహణ వ్యాపారం అనే సూత్రం అప్పుడు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? కుల ప్రయోజనాలను సమాజ ప్రయోజనాలుగా మభ్య పెట్టడం ద్వారా ఎంతో కాలం మనుగడ సాదించలేరనే సంగతి మాధ్యమాలు గుర్తించాలి. పత్రికలను కొనుగోలుచేసే పాఠకుల డబ్బుతో సొంత సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అవుతుందనే ఆత్మ విమర్శ చేసుకుంటే వాటి మనుగడకు మంచిది.

Tags:    

Similar News