Ycp : ఈయనకు మంత్రి పదవి గ్యారంటీ

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గవిస్తరణపై ఎందరో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ వంద శాతం మంత్రివర్గాన్ని మార్చివేస్తున్నట్లు వార్తలు రావడంతో పోటీ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా [more]

Update: 2021-11-05 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గవిస్తరణపై ఎందరో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ వంద శాతం మంత్రివర్గాన్ని మార్చివేస్తున్నట్లు వార్తలు రావడంతో పోటీ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మంది మంత్రి పదవులు తమకు దక్కుతాయని నమ్మకంగా ఉన్నారు. వీరిలో ముగ్గురు కీలకంగా ఉన్నారు. వారిలో ముదునూరు ప్రసాదరాజుకు మంత్రి పదవి గ్యారంటీ అన్న టాక్ జిల్లాలో నడుస్తుంది.

నమ్మకంగా ఉంటూ…

ముదునూరి ప్రసాదరాజు జగన్ వెంట నమ్మకంగా ఉన్నారు. 2009 లో నరసాపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ వైసీీపీలో చేరడంతో ఆయన అప్పట్లో అందరిలాగే రాజీనామా చేశారు. కానీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో జగన్ కోసం రాజీనామా చేసి దాదాపు అందరూ గెలిచినా ప్రసాదరాజు మాత్రం గెలవలేకపోయారు. అప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.

రాజుల లాబీయింగ్ తో…..

2014లో కాంగ్రెస్ నుంచి కొత్త పల్లి సుబ్బారాయుడు వైసీపీలోకి రావడంతో ఆయనకు టిక్కెట్ దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ముదునూరి ప్రసాదరాజు విజయం సాధించారు. జగన్ కు నమ్మకంగా ఉండే అతి కొద్ది వ్యక్తుల్లో ఈయన ఒకరంటారు. అయితే తొలి మంత్రివర్గంలోనే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా రాజుల లాబీయింగ్ తో రంగనాధరాజుకు ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి ఈయనకు మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు.

ముగ్గురు పోటీ….

రఘురామ కృష్ణరాజు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రసాదరాజుకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ సామాజికవర్గాన్ని సంతృప్తిపర్చవచ్చన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు కూడా పోటీ పడుతున్నారు. ఈసారి కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు గ్యారంటీ కావడంతో ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News