ఆ….30 నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీలో బంధువుల‌వే

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఎటు చూసినా బంధువర్గమే క‌నిపిస్తోంది. వియ్యంకులు, అల్లుళ్లు, చెల్లెళ్లు, అన్నలు, కుమార్తెలు, కుమారులు ఇలా.. నాయ‌కుల బంధువుల‌తోనే పార్టీ పూర్తిగా నిండిపోయిన ట్టు [more]

Update: 2020-12-22 03:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఎటు చూసినా బంధువర్గమే క‌నిపిస్తోంది. వియ్యంకులు, అల్లుళ్లు, చెల్లెళ్లు, అన్నలు, కుమార్తెలు, కుమారులు ఇలా.. నాయ‌కుల బంధువుల‌తోనే పార్టీ పూర్తిగా నిండిపోయిన ట్టు క‌నిపిస్తోంది. ఇలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాలు బంధువుల‌తోనే తొణికిసలాడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు 40 వ‌దిలేస్తే మిగిలిన జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 35కు పైగా ఈ బంధువులే పంచుకున్న ప‌రిస్థితి ఉంది. దీంతో పార్టీలో యువ‌త‌కు, క‌ష్టప‌డే వారికి ఇంకెక్కడ అవ‌కాశాలు వ‌స్తాయో ? అర్థం కాని దుస్థితి.

వారి పెత్తనమే…..

ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌న‌గ‌రంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆయ‌న కుమార్తె, శ్రీకాకుళంలో కింజ‌రాపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడు, రామ్మోహ‌న్ సోద‌రి ఆదిరెడ్డి భ‌వానీ రాజ‌మ‌హేంద్రవ‌రం సిటీ ఎమ్మెల్యే. ఈ కుటుంబానికే మూడు సీట్లు. ఇక విశాఖ విష‌యానికి వ‌స్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు (ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు) ఆయ‌న ఇద్దరు వియ్యంకులకు మూడు సీట్లు ఉన్నాయి. గంటా విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయ‌న వియ్యంకుల్లో నారాయ‌ణ నిన్నటి వ‌ర‌కు నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్‌. ఇప్పట‌కీ అక్కడ తెర‌వెన‌క అంతా ఆయ‌న పెత్తన‌మే. ఇక గంటా మ‌రో వియ్యంకుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ఇన్‌చార్జ్‌.

గెలవడని తెలిసినా….

ఇక‌, తూర్పు గోదావ‌రి జిల్లాకు వ‌స్తే.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఫ్యామిలీ తునిలో ద‌శాబ్దాలుకుగా పాతుకుపోతే… ఆయ‌న వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ ‌మైదుకూరులో పాగా వేశారు. ఆయ‌న గెల‌వ‌డ‌ని తెలిసినా సీటు ఇవ్వక త‌ప్పని ప‌రిస్థితి. ఇక‌, గుంటూరు విష‌యానికి వ‌స్తే వియ్యంకులు జీవీ ఆంజ‌నేయులు (వినుకొండ‌), కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ ‌(పెద‌కూర‌పాడు) రెండు చోట్ల పాగా వేసేశారు. ప్రస్తుతం పార్టీ ప‌రిస్థితి సంక్లిష్టంగా ఉండ‌డంతో ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేస్తామంటూ కొమ్మాల‌పాటితో పాటు మ‌రో సీనియ‌ర్ నేత య‌ర‌ప‌తినేని త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతోన్న ప‌రిస్థితి.

అందుకే అసంతృప్తి….

అనంత‌పురం జిల్లాలో మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌.. కుమారుడు శ్రీరాంలు ఇష్టమైనా క‌ష్ట‌మైనా ధ‌ర్మవ‌రం, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు తీసుకోక త‌ప్పని ప‌రిస్థితి ఉంది. ఇక అదే జిల్లాలో జేసీ కుటుంబానికి తాడిప‌త్రి అసెంబ్లీ, అనంత ఎంపీ సీటు ఇచ్చేయాలి. ఈ ఒక్క జిల్లాలోనే రెండు ఫ్యామిలీల‌కు రెండు సీట్లు అంటే మిగిలినోళ్లకు చోటెక్కడ అన్న ఆవేద‌న ఉంది. విజ‌య‌వాడ‌ను ప‌రిశీలిస్తే.. ఎంపీ కేశినేని నాని, ఆయ‌న కుమార్తె శ్వేత ‌(విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని ప్రక‌టించారు ). దీనిపై కూడా పార్టీ వ‌ర్గాల్లో అసంతృప్తి ఉంది.

ఒకే కుటుంబంలో….

అదే స‌‌మ‌యంలో ఇక్కడే గ‌ద్దె రామ్మోహ‌న్ న‌గ‌రంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉండ‌గా.. ఆయ‌న భార్య జ‌డ్పీ మాజీ చైర్మన్ అనూరాధ కూడా మ‌రో స్థానంలో పాగా వేసేందుకు కాచుకునే ఉన్నారు. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌న్నవ‌రం నుంచి ఛాన్స్ రాక‌పోదా ? అన్న ఆశ‌తో ఉన్నారు. ఇక‌, చంద్రబాబు కుటుంబం నుంచి ఏకంగా న‌లుగురు రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్నారు. ఒక‌రు ఆయ‌న‌, రెండు ఆయ‌న కుమారుడు లోకేష్‌, మూడు వియ్యంకుడు బాల‌య్య, నాలుగు బాల‌య్య అల్లుడు విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన భ‌ర‌త్‌. ఈ కుటుంబానికే నాలుగు సీట్లు ఫిల్ అయ్యాయి.

జగన్ మాత్రం……

ఇలా .. ఎటు చూసినా.. 30 నుంచి 40 మంది వ‌ర‌కు వార‌సులే పార్టీలో క‌నిపిస్తున్నారు. వీరికి టికెట్లు ఇవ్వక త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో అసెంబ్లీ అంతా రేపు టీడీపీ బంధువుల‌తోనే నిండిపోతుంద‌న్న అసంతృప్తులు పార్టీ ఎక్కువ అవుతున్నాయి. టీడీపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. సీఎం జ‌గ‌న్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఎన్నిక‌ల్లో త‌న కోసం ప్రచారం చేసిన త‌ల్లిని, చెల్లిని కూడా ప‌క్కన పెట్టి.. బంధు వ‌ర్గాన్ని దూరంగా ఉంచుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యంలో చంద్రబాబు ఎలా రియ‌లైజ్‌ అవుతారో చూడాలి.

Tags:    

Similar News