రోజాకు ఆ ఛాన్స్ ఉందటగా…?

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లా నగరి ఒకటి. ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే [more]

Update: 2019-05-08 00:30 GMT

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లా నగరి ఒకటి. ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పోటీ చేస్తుండటంతో ఆమె గెలుపోటములపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన రోజా ఈసారి గాలి ముద్దుకృష్ణమ చిన్న కుమారుడు గాలి భాను ప్రకాష్ తో పోటీ పడ్డారు. గత ఎన్నికల్లానే ఈసారి కూడా ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. అయితే, తమ నాయకురాలు మళ్లీ విజయం సాధించడం ఖాయమని, ఈసారి ఆమె మంత్రి పదవి కూడా దక్కించుకుంటుందని ఆమె అనుచరులు ధీమాగా ఉన్నారు.

తెలుగుదేశం అభ్యర్థికి ఇంటిపోరు

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత పదవుల పంపకాల వద్ద ఆయన కుమారుల మధ్య విభేదాలు తలెత్తాయి. నగరి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆయన ఇద్దరు కుమారులు తీవ్రంగా పోటీ పడగా.. చివరకు పార్టీ క్యాడర్ తో సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతో గాలి భానుకు టిక్కెట్ కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. తన తండ్రికి నియోజకవర్గంలో ఉన్న పేరు, టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటం, తండ్రి మరణంతో సానుభూతి కలిసి రావడం వంటి అంశాలతో ఆయన విజయం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే, కుటుంబంలోనే విభేదాలు ఆయనకు మైనస్ గా మారాయి. ఆయనకు స్వంత కుటుంబమే ఎన్నికల్లో సహకరించలేదు. ఇక, మొదటిసారి పోటీ చేయడం, పార్టీ క్యాడర్ ను పూర్తిగా సమన్వయం చేసుకోలేకపోవడం ఆయనకు కొంత నష్టం చేసినట్లు కనిపిస్తోంది.

సానుభూతి చేదిస్తే రోజాదే విజయం

గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బయటపడిన రోజా ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకున్నారు. అధికార పార్టీలో లేకపోవడం వల్ల అభివృద్ధిలో వెనుకబడినా స్వంత ఖర్చులతో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ఎంపీల నిధులతోనూ పలు పనులు చేయించగలిగారు. రాష్ట్ర స్థాయిలో నాయకురాలిగా ఎదగడంతో సహజంగానే నియోజకవర్గంలో ఆమె పట్ల సానుకూలత పెరిగింది. ఆమె రెడ్డి సామాజకవర్గానికి చెందిన వారు కావడం, ఆమె భర్త తమిళుడు కావడం, ఇక్కడి రెండు మండలాల్లో తమిళులు, ముఖ్యంగా ఆమె భర్త సెల్వమణి సామాజకవర్గం వారు ఎక్కువగా ఉండటంతో సామాజకవర్గ సమీకరణాలు కూడా ఆమెకు ప్లస్ అయ్యాయి. దీంతో ఈసారి కూడా ఇక్కడ హోరాహోరీ పోరు జరిగినా రోజాకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సానుభూతి బలంగా పనిచేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు.

Tags:    

Similar News