లోకేషే భారమేనా?
పార్టీ నుంచి వీడిపోతున్న వారంతా ఒక్కటే మాట అంటున్నారు. అది నిన్నటి వల్లభనేని వంశీ అయినా, నేడు విశాఖకు చెందిన అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ [more]
పార్టీ నుంచి వీడిపోతున్న వారంతా ఒక్కటే మాట అంటున్నారు. అది నిన్నటి వల్లభనేని వంశీ అయినా, నేడు విశాఖకు చెందిన అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ [more]
పార్టీ నుంచి వీడిపోతున్న వారంతా ఒక్కటే మాట అంటున్నారు. అది నిన్నటి వల్లభనేని వంశీ అయినా, నేడు విశాఖకు చెందిన అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ ఎ రహమాన్ అయినా అదే మాట….లోకేష్ పార్టీ కొంప ముంచుతున్నాడన్న మాట. ఇదే బాధ పార్టీలో మిగిలిన వారికి కూడా ఉంది. వారు కూడా ఏదో రోజు బయటకు వచ్చినపుడు ఇదే ముక్క చెప్పిపోతారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నా అధినేత చంద్రబాబు మాత్రం కుమారుడు లోకేష్ భావి వారసుడు పార్టీకి ఎలా అవుతారని కొండంత ఆశలు పెట్టుకున్నారో అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు వరకూ పార్టీ అంతా ఏకీభవిస్తున్న సంగతిని కూడా ఇక్కడ గమనించాలి.
కుండబద్దలు కొట్టి మరీ….
లోకేష్ వల్లనే పార్టీ సర్వనాశనం అయిందని విశాఖకు చెందిన మాజీ మంత్రి ఎస్ ఏ రహమాన్ ఘాటైన కామెంట్స్ చేశారు. ఆయన పార్టీకి రాజీనామా చేసిన తరువాత పార్టీలో జరుగుతున్న బాగోతాన్ని బయటపెట్టారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాక పచ్చని పార్టీ కాస్త మోడులా మారిందని రహమాన్ అంటున్నారు. పార్టీలో నేతలకు, చంద్రబాబుకు మధ్య లోకేష్ అడ్డుగా మారారని కూడా ఈ మైనారిటీ నాయకుడు చెబుతున్న విషయం. లోకేష్ కి రాజకీయ మేధస్సు లేదని, కానీ ఆయన పార్టీని శాసిస్తున్నారని, ఇదే పుట్టె ముంచుతోందని కూడా రహమాన్ అసలు కధ చెప్పేశారు.
అదే నిజమైతే…?
రహమాన్ ఈనాటి నాయకుడు కాదు, ఆయన మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయనకు టికెట్ ఇచ్చి మరీ నాడు అన్న నందమూరి ప్రోత్సహించారు. ఆయన సైతం గెలిచి తన సత్తా చాటారు. అయితే చంద్రబాబు హయాంలో మాత్రం రహమాన్ వెలగలేకపోయారు. దానికి ఆయన చెబుతున్న కారణాల్లో లోకేష్ కూడా ఒకరు. ఇదే మాట విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఈ మధ్య చెప్పారు. లోకేష్ వల్ల చంద్రబాబు డమ్మీ అయిపోయారని ఆయన పరుషమైన మాటలనే వాడేశారు. లోకేష్ కారణంగానే గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్లు కూడా చంద్రబాబుని కలవలేక దూరంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. ఇలా పార్టీలో అనేకమంది లోకేష్ తీరు పట్ల గుస్సాగా ఉన్నారని తమ్ముళ్ళు చెబుతున్నారు.
పోయేవారే కానీ…?
ప్రతిపక్షంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా టీడీపీ మునుపటి సత్తువను కూడదీసుకోలేకపోతోంది. దానికి కారణం చంద్రబాబు అనుసరిస్తున్న అవుట్ డేటెడ్ పాలిటిక్స్ ఒక కారణమైతే, భావి వారసుడుగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం మరో కారణం. చంద్రబాబు ఎంతసేపు మనసులో మాట చెప్పకుండా రాజకీయం చేయడం, జగన్ మాదిరిగా డైరెక్ట్ గా ఏ విషయం చెప్పకపోవడం వల్ల పార్టీలో నాయకులే చాటు మాటుగా బాధలు చెప్పుకుని ఆవేదన చెందుతున్న సంగతి విదితమే. ప్రతి దాన్నీ సాగదీయడం. అన్నింటా రాజకీయాలు చేయాలని చూడడం, ఇలా చంద్రబాబు మార్క్ సెవెంటీస్ పాలిటిక్స్ తో టీడీపీ బాగా వెనకబడిపోయింది. దానికి తోడు అన్నట్లుగా లోకేష్ కూడా పెను భారంగా పార్టీకి మారారని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. ఏం చూసుకుని పార్టీలో ఉండాలో తెలియడం లేదన్న వారే ఎక్కువగా ఉన్నారు. రహమాన్ వంటి వారు ఇపుడు బయటపడిపోయారు. మరెంతమంది ఇలా వస్తారో చూడాలి అంటున్నారు.