చిన బాస్ కు పనిలేదటగా

తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు మామూలే. ఆ పార్టీకి ఇవి కొత్తమీ కాదు. నేతలను తయారు చేసి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అంటూ చంద్రబాబు పదే పదే వ్యాఖ్యలు [more]

Update: 2019-12-03 08:00 GMT

తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు మామూలే. ఆ పార్టీకి ఇవి కొత్తమీ కాదు. నేతలను తయారు చేసి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అంటూ చంద్రబాబు పదే పదే వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత కల్పించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి పతనం ప్రారంభమయిందంటున్నారు కొందరు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఛాంబర్ కు క్యూకట్టే నేతలు ఇప్పుడు అటు వైపు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు.

దాదాపు ఒంటరిగానే….

గత కొద్దిరోజులుగా నారా లోకేష్ దాదాపుగా ఒంటరిగానే గడుపుతున్నారు. ఆయన తన సన్నిహితులైన కొందరితో మాత్రమే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాను ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి మంగళగిరి పార్టీ నేతలను కూడా కలవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా నారా లోకేష్ ఆధిపత్యం చెలాయించేవారు. ప్రతి శాఖలో తాను వేలుపెట్టి నిర్ణయాలు తీసుకునేవారు. అయినా మంత్రులు సయితం ఆయను ఒక్క మాట అనేవారు కాదు. చినబాబు చెప్పినట్లే జరగాలని తమ శాఖ అధికారులను ఆదేశించేవారు.

అధికారంలో ఉన్నప్పుడు….

అంతేకాదు తమ భవిష్యత్ నేత నారా లోకేష్ అంటూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకూ ప్రతి సభలో ప్రకటించేవారు. పొగడ్తలతో ముంచెత్తే వారు. తమ నియోజకవర్గాలకు రారమ్మంటూ ఇబ్బడి ముబ్బడిగా ఆహ్వాన లేఖలు నారా లోకేష్ కార్యాలయానికి వచ్చేవి. జిల్లా నేతలు కూడా నారా లోకేష్ వస్తున్నారంటే నానా హంగామా చేసేవారు. అయితే ఇటీవల కాలంలో నారా లోకేష్ వద్దకు వెళ్లేందుకు కూడా ఎవరూ రావడం లేదు. తొండెపు దశరధ జనార్థన్, చినరాజప్ప, కళా వెంకట్రావు వంటి నేతలు కూడా అడపా దడపా బాగోదని విష్ చేసి వెళుతున్నారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్.

బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలపై…..

ప్రధానంగా వల్లభనేని వంశీ పార్టీని వీడుతూ నారా లోకేష్ పై చేసిన కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నారా లోకేష్ తాను పెట్టిన సోషల్ మీడియా ద్వారా టీడీపీ నేతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కొందరు టీడీపీ నేతలు నిజమేనంటున్నారు. తమపై కూడా ఇలాగే గతంలో వార్తలు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లెక్క చేయనితనంగా, అవగాహనలేమితో వ్యవహరించిన తీరును కూడా తప్పుపడుతూ లోకేష్ ను కలిసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఇప్పటికైతే తమ నేత చంద్రబాబేనంటూ ఒకరిద్దరు నేతలు వ్యాఖ్యానిస్తుండటం కూడా గమనార్హం. మొత్తం మీద పార్టీలో నారా లోకేష్ పరిస్థితి ఐదు నెలల్లోనే తేలిపోయిందనే చెప్పాలి.

Tags:    

Similar News