మనోడు కాలు కదిపితే కదా?

నారా లోకేష్ భావి పార్టీ అధినేత. చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయన నెంబర్ 2. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీ కోసం ఆయన పడుతున్న [more]

Update: 2021-07-16 08:00 GMT

నారా లోకేష్ భావి పార్టీ అధినేత. చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయన నెంబర్ 2. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీ కోసం ఆయన పడుతున్న శ్రమ ఎంత అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. యువకుడు అయి ఉండి కూడా కనీసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ లో ఉత్సాహం నింపాలన్న ధ్యాసలేదు. నారా లోకేష్ క్షేత్ర స్థాయి పర్యటనలు చేయకుండా కేవలం ట్విట్టర్ కే పరిమితం కావడంపైన కూడా పార్టీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ముందుండి నడిపించాల్సిన….

నాయకుడు అనే వాడు ముందుండి నడిపించాలి. ఆయన ఉత్సాహంగా అడుగులు వేస్తుంటే నేతలు కూడా అనుసరిస్తారు. కానీ నారా లోకేష్ లో ఆ ఉత్సాహం కొరవడింది. పొరుగు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలను ఈ సందర్భంగా కొందరు పార్టీ నేతలే గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ షర్మిలకు అక్కడ కనీసం క్యాడర్ లేకపోయినా ధైర్యంతో ముందుకు వెళుతున్నారు. అధికార పార్టీని ఢీకొడుతున్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం ఆందోళనకు ఏదో ఒక జిల్లాలో దిగుతున్నారు.

ఓటు బ్యాంకు ఉన్నా….

కానీ బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి యువనేతగా ఉన్న లోకేష్ మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. విద్యార్థుల పరీక్షల రద్దు మీద లోకేష్ బాగానే ఫైట్ చేశారు. ప్రభుత్వం దిగి రావడంతో ఆ సక్సెస్ కొంత లోకేష్ ఖాతాలో పడిందనే చెప్పాలి. జాబ్ క్యాలెండర్ మీద జూమ్ మీటింగ్ లు తప్పించి క్షేత్రస్థాయిలో లోకేష్ స్వయంగా ఆందోళనకు దిగాలన్నది పార్టీ నేతల భావన.

ఏదో ఒకచోట….

కానీ లోకేష్ అందుకు సుముఖంగా లేరు. కేవలం ఏదో ఒక చోట సభ పెట్టి మమ అనిపించేటట్లు ఉన్నారు. నిరుద్యోగ సమస్యను ప్రధాన అజెండాగా తీసుకుని లోకేష్ జిల్లాలను పర్యటించి మీటింగ్ లు పెడితే యువతలో కొంత మార్పు వస్తుందని సీనియర్లు సూచిస్తున్నారు. కాని మనోడు కదిలితే కదా? అని ఒక నేత వ్యాఖ్యానించడం లోకేష్ పరిస్థితికి అద్దం పడుతుంది. దాదాపు 75 ఏళ్ల చంద్రబాబు ఇప్పటికీ జనంలో తిరుగుతున్నారు. తండ్రిని చూసైనా లోకేష్ నిత్యం జనంలో ఉండేలా అలవాటు చేసుకోవాలని పలువురు పార్టీ నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News