లోకేష్ లక్కీ ఫెలోయేగా

ఎవరెంతగా అనుకున్నా ప్రతివారికి కొందరు స్పూర్తిగా ఉంటారు. ప్రత్యర్ధులైనా కూడా వారిని అనుసరించడంలో తప్పు లేదనుకుంటారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని సొంత [more]

Update: 2019-10-31 12:30 GMT

ఎవరెంతగా అనుకున్నా ప్రతివారికి కొందరు స్పూర్తిగా ఉంటారు. ప్రత్యర్ధులైనా కూడా వారిని అనుసరించడంలో తప్పు లేదనుకుంటారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని సొంత కుమారుడే ఇపుడు గ్రహించినట్లున్నారు. అందుకే తండ్రి చాటు బిడ్డగా ఉండకుండా తెరలు తొలగించుకుని బయటపడేందుకు తానుగా ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో తన సాటి యువ నేతలు పవన్, జగన్ లను చూసి స్పూర్తి పొందుతున్నాడట. లోకేష్ ది నిజంగా రాజకీయాల్లో గోల్డెన్ స్పూన్. వైఎస్సార్ బతికి ఉంటే జగన్ కధ అచ్చం అలాగే ఉండేదేమో. కానీ జగన్ కి వేలు పట్టి నడిపించే నాన్న కనుమరుగు కావడంతో రాజకీయం ముళ్లపానుపు అయింది. అదే ఇపుడు ఆయన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది కూడా. లోకేష్ ఈ విషయంలో అదృష్టవంతుడు. ఆయనకు అడగగానే మంత్రి పదవి వచ్చేసింది. కోరిన శాఖలు కూడా దక్కాయి. దాంతో రెండేళ్ల పాటు అమాత్య కిరీటాన్ని ధరించి మురిసిపోయారు. ఆ సరదా అలా ఉండగానే ఎన్నికలు వచ్చి ఓటమి పాలు అయ్యారు. ఇపుడే రాజకీయం అంటే లోకేష్ కి బాగా తెలిసివస్తోంది.

పవన్ కి పోటీగా….

చంద్రబాబుది ఎర్లీ సెవెంటీస్, ఐటీస్ పాలిటిక్స్. వయసు కూడా పెద్దది. దాంతో లోకేష్ తండ్రిని అనుసరిస్తే అప్ టూ డేట్ పాలిటిక్స్ కి దూరం అవుతానని అర్ధం చేసుకున్నట్లున్నారు. పైగా ఆయనకు కళ్ల ముందే రాజకీయ ప్రత్యర్ధి జగన్ ఘన విజయం సాధించిన తీరు కనిపిస్తోంది. మరో వైపు పవన్ ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలకు పదును తేరుతున్న వైఖరి కనిపిస్తోంది. దీంతో ఈ ఇద్దరిని అనుసరిస్తూ తనదైన రాజకీయాన్ని లోకేష్ తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. లోకేష్ ఇసుక కొరతపైన దీక్షకు కూర్చోవడం ఇందులో భాగమే. నిజానికి ఈ దీక్ష పవన్ చేయాల్సింది. ఆయన పార్టీ వారు ముందు లాంగ్ మార్చ్ అని నిర్ణయించడంతో అది వాయిదా పడింది. దాన్ని అందిపుచ్చుకుని లోకేష్ పవన్ లాంగ్ మార్చ్ కంటే ముందే రోడ్డెక్కి జనసేనానికి లోకేష్ గట్టి పోటీ ఇచ్చారు. రేపటి రోజున పవన్ లాంగ్ మార్చ్ చేసినా కూడా టీడీపీకి పొలిటికల్ మైలేజ్, అడ్వాన్స్ గా చేసిన క్రెడిట్ రెండూ దక్కేలా లోకేష్ వ్యూహం ఇక్కడ కనిపిస్తోంది.

జగన్ మాదిరిగానే…

ఇక ముద్దులు, ముచ్చట్లు జగన్ మార్క్ పాలిటిక్స్. జగన్ పాదయాత్ర చేసినా, మీటింగ్ పెట్టినా, ఓదార్పు యాత్రలకు వెళ్ళినా కూడా చిన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడే సీన్లు వేలల్లో లక్షల్లో కనిపిస్తాయి. అదే విధంగా ఆడవాళ్ల తల మీద చేయిపెట్టి భరోసా ఇస్తూ వృధ్ధుల బుగ్గలు నిమురుతూ జగన్ చూపించే ఈ ఆప్యాయతే రాజకీయంగా ఆయన్ని ఇంతటి హీరోను చేసింది. తనది తెల్ల చొక్కా అయినా అవతల వారు మురికిగా ఉన్నా కూడా అక్కున చేర్చుకుని ఓదార్చడంలో జగన్ ఎపుడో అందరినీ మించిపోయారు. దాంతో జగన్ మనవాడు అన్న ఫీలింగ్ కలిగేలా చేసుకున్నారు.

లోకేష్ కూడా అలాగే….

సరిగ్గా అదే విధానాన్ని లోకేష్ కూడా ఇపుడు అనుసరిస్తున్నారు. దీక్ష సందర్భంగా చిన్నారి పిల్లలను లోకేష్ ఎత్తుకోవడం ద్వారా నారా ఫ్యామిలీ కూడా జనాలకు కడు దగ్గర అని నిరూపించారు. ఇకపై ముద్దు ముచ్చట్లు కూడా లోకేష్ పొలిటికల్ సినిమా నుంచి బోలెడన్ని ఆశించవచ్చు అని చెప్పేశాడు చినబాబు. రానున్న రోజుల్లో తండ్రిని పక్కన పెట్టి తనదైన స్టైల్లో ముందుకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచన. బాబు రోటీన్ ఉపన్యాసాలు, హావభావాలు బాడీ లాంగ్వేజ్ తో ఓట్లు రాలవని గ్రహించిన యువనేత లోకేష్ ఇపుడు తనదైన మార్క్ పాలిటిక్స్ కి తెర తీస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అగ్రెసివ్ గా జగన్ సర్కార్ మీద‌ ఆయన బాటలోనే విరుచుకుపడాలనుకుంటున్నాడుట. అదే సమయంలో ఏ ఒక్క ఛాన్స్ పవన్ కి దక్కకుండా చేయడానికి సైతం సై అంటున్నాడుట. చూద్దాం నారా వారి అబ్బాయి నయా రాజకీయం ఎలా సాగుతుందో.

Tags:    

Similar News