‍Nara lokesh : ఏడాది పాటు సైకిల్ దిగరట

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచే తన సైకిల్ యాత్రను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇచ్ఛాపురం నుంచి [more]

Update: 2021-11-04 13:30 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచే తన సైకిల్ యాత్రను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నియోజకవర్గాల మీదుగా కొనసాగే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్దమవుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తాను యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. బహుశ ఆయన బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. చంద్రబాబు యాత్ర సీమ జిల్లాల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

వచ్చే ఏడాది ప్రారంభంలో….

దీంతో పాటు నారా లోకేష్ సయితం యాత్రకు సిద్ధమవుతున్నారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ యాత్ర ఉండే అవకాశాలున్నాయి. వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలా లోకేష్ యాత్ర రూట్ మ్యాప్ రూపొందుతుంది. రోజుకు ముప్ఫయి కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగే అవకాశాలున్నాయి. ఈ యాత్ర కడప జిల్లాలో ముగిసేలా రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు సమాచారం. మార్చి నెలలో ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీలో కీలకంగా మారేందుకు….

నారా లోకేష్ పార్టీలో మరింత పట్టు సంపాదించుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడనుంది. లోకేష్ నాయకత్వంపై ఇప్పటికీ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయకత్వమే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహించినా, లోకేష్ కూడా పార్టీలో తన ప్రాధాన్యతను గుర్తించాలని సైకిల్ యాత్రను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర నుంచే….

వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా అనుసరిస్తున్న విధానాలను తన సైకిల్ యాత్ర ద్వారా ప్రజల ముందు ఉంచాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. పార్టీ విజయం సాధిస్తే తాను కూడా కీలక భూమిక పోషించానని చెప్పుకోవడానికి ఈ యాత్ర లోకేష్ కు ఉపకరిస్తుంది. అందుకోసమే ఆయన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టనుంది. స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వివిధ సమస్యలతో తన యాత్ర ద్వారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News