మళ్లీ కొంపముంచేస్తున్నారా?

“రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం పెంచుతున్నాం. గ‌తంలో మేం చేసిన త‌ప్పుల‌ను పున‌రావృతం కానివ్వం. ఎట్టి ప‌రిస్తితిలోనూ రాబోయే రోజుల్లో యువ‌త‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎవ‌రూ దిగులు పెట్టుకోవాల్సిన [more]

Update: 2019-11-13 03:30 GMT

“రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం పెంచుతున్నాం. గ‌తంలో మేం చేసిన త‌ప్పుల‌ను పున‌రావృతం కానివ్వం. ఎట్టి ప‌రిస్తితిలోనూ రాబోయే రోజుల్లో యువ‌త‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎవ‌రూ దిగులు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌రూ స‌మ‌న్వయంతో, క‌ల‌సి క‌ట్టుగా పార్టీని ముందుకు న‌డిపించండి“- ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవ‌ల వివిధ జిల్లాల్లో ప‌ర్యటిస్తున్న సంద‌ర్భంలో ఆయా జిల్లాల్లోని తెలుగు యువ‌త‌కు ఇస్తున్న హామీ. దీంతో టీడీపీ యువ విభాగం అయిన తెలుగు యువ‌తలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ముఖ్యంగా పార్టీలో దూకుడుగా ఉన్నయువ నాయ‌కులకు ఇప్పటి వ‌ర‌కు ప‌ద‌వులు రాక‌పోవ‌డంతో విసుగెత్తిపోయారు. ఇలాంటి వారు చంద్రబాబు ఇచ్చిన హామీతో సంతోషంలో మునిగిపోయారు. త‌మ ఆశ‌లు ఫ‌లిస్తున్నాయ‌ని, త‌మ‌కు కూడా ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

లోకేష్ విరుద్ధంగా…..

వ‌చ్చేరోజుల్లో త‌మ‌కు ఖ‌చ్చితంగా పార్టీలో ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని భావించారు. క‌ట్ చేస్తే.. చంద్రబాబు మాట‌ల‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, ఆయ‌న కుమారుడు, యువ మాజీ మంత్రి నారా లోకేష్ పోక‌డ‌క‌ల‌కు మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌న్నట్టుగా ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక ప‌క్క చంద్రబాబు చెప్పినట్టు యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని అంటూనే నారా లోకేష్ ఎత్తుగ‌డ మ‌రో విధంగా ఉంది. యువ‌త అంటే.. ఈయ‌న దృష్టిలో 'యువ వార‌సులు'గా అనిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయిన యువ వార‌సుల‌కే నారా లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ట్రీట్ సందర్భంగా…..

ఇటీవ‌ల నారా లోకేష్ పార్టీలోని యువ నాయ‌కుల‌కు ట్రీట్ ఇచ్చారు. ఇంకేముంది కొన్నేళ్లుగా పార్టీకి ఒళ్లు దాచుకోకుండా ప‌నిచేస్తున్నాం.. కాబ‌ట్టి మ‌న‌కు ప్రాధాన్యం ఖాయం అని అన్ని జిల్లాల్లోని నాయ‌కులు చంక‌లు గుద్దుకున్నారు. తీరా ట్రీట్ ముగిసిన త‌ర్వాత కానీ, నారా లోకేష్ దృష్టిలో యువ నాయ‌కులు అంటే.. ఎవ‌రో వారికి తెలియ‌లేదు. తీరా తెలిసిన త‌ర్వాత చేసేది లేక‌.. నోరెళ్ల బెట్టారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. నారా లోకేష్ ఇచ్చిన యువ ట్రీట్‌కి పార్టీలో ఉండి.. ఎలాంటి ప‌ద‌వులూ ఆశించ‌కుండా క‌ష్టప‌డిన యువ‌త‌కు కాకుండా.. రాజ‌కీయ దిగ్గజాల కుమారుల‌కు, కుమార్తెల‌కు మాత్రమే నారా లోకేష్ ప్రాధాన్యం ఇచ్చారు.

వారేనా యువకులు…..?

వీరిలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, దేవినేని అవినాష్, ప‌రిటాల శ్రీరాం, బొజ్జల సుధీర్ రెడ్డి, సిద్దా రాఘ‌వ‌రావు కుమారుడు, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప‌వ‌న్ రెడ్డి ఇలా మొత్తంగా యువ వారసుల‌కే నారా లోకేష్ ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో వీరే క‌నిపించారు త‌ప్ప.. ఎలాంటి వార‌స‌త్వం లేని యువ‌త , పార్టీ కోసం ఎంతో క‌ష్టించిన యువ‌త ఎక్కడా క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడు వీరంతా కూడా నారా లోకేష్ వ్యవ‌హార శైలిపై తీవ్రస్థాయిలో మండిప‌డుతున్నారు. ఇన్నాళ్లు తాము ఎదురు చూసింది ఇందుకేనా ? అంటూ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో.. మొత్తానికి చంద్రబాబు మాటేమో కానీ, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ దృష్టిలో యువ‌త‌కు ప్రాధాన్యం అంటే.. పార్టీలోని కీల‌క యువ వార‌సులేన‌ని అర్ధమ‌వుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇలా అయితే, పార్టీకి ఇబ్బంది కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

Tags:    

Similar News