ఎన్నాళ్లిలా…? ఇలా అయితే కష్టమేనా?

తండ్రి చాటు రాజకీయాలు ఎప్పుడూ సాగవు. బీహార్ నే తీసుకుంటే అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినా ఐదేళ్ల నుంచి పార్టీని ఒంటిచేత్తో నడిపారు తేజస్వి [more]

Update: 2020-12-11 13:30 GMT

తండ్రి చాటు రాజకీయాలు ఎప్పుడూ సాగవు. బీహార్ నే తీసుకుంటే అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినా ఐదేళ్ల నుంచి పార్టీని ఒంటిచేత్తో నడిపారు తేజస్వి యాదవ్. మొన్న జరిగిన ఎన్నికల్లో తృటిలో అధికారం చేజారి పోయింది కాని నిజానికి తేజస్వి యాదవ్ నైతికంగా గెలిచినట్లే. తండ్రి ఏర్పరచిన బాటను తనకు అనుకూలంగా మలచుకున్నారు తేజస్వి యాదవ్. ఇవాళ కాకుంటే ఎప్పటికైనా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఆ పార్టీ లో ఉంది. కానీ లోకేష్ విషయంలో ఆ అభిప్రాయం ఉందా? అంటే అనుమానమే నంటున్నారు.

రావడమే…..

నారా లోకేష్ రాజకీయాల్లోకి రావడమే ఎమ్మెల్సీగా వచ్చారు. ప్రత్యక్ష్యంగా ఎన్నిక కాలేదు. ఎమ్మెల్సీ అయి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నరేళ్లు పాలనానుభవం మాత్రం లోకేష్ పొందారు. అయితే ఇప్పడు విపక్షంలోకి రావడంతో నారా లోకేష్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయినా లోకేష్ ఇంకా తండ్రి మీదనే ఆధారపడి ఉన్నట్లే కన్పిస్తుంది. కరోనాతో వయసు రీత్యా చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నా, లోకేష్ కూడా ఇంటిపట్టునే ఉండటం విమర్శలకు తావిస్తుంది.

భవిష‌్యత్ నేతగా….

ఎవరు అవునన్నా, కాదన్నా నారా లోకేష్ భవిష్యత్ లో పార్టీకి నాయకత్వం వహించాల్సిందే. అయితే ఇప్పుడున్న సమయంలో ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు నారా లోకేష్ ముందుకు రావాలి. తాజాగా వరదలు సంభవించి రైతులు నష్టపోయినా లోకేష్ మాత్రం కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారు. ప్రస్తుతం అన్ని పదవులను చంద్రబాబు భర్తీ చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల అద్యక్షులతోపాటు రాష్ట్ర కమిటీని కూడా నియమించారు.

సమన్వయం చేసుకుంటూ…..

వీరిందరినీ నారా లోకేష్ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పూర్తయి పదిహేను నెలలు గడుస్తున్నా లోకేష్ జిల్లాల పర్యటన చేపట్టలేదు. అడపా దడపా పరామర్శలకు వెళ్లి వచ్చారు తప్పించి లోకేష్ జిల్లాలను పర్యటించి అక్కడ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదు. ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడకపోవడమే లోకేష్ లో ఉన్న మైనస్ పాయింట్. ఇప్పటికైనా నారా లోకేష్ తన తీరు మార్చుకోకుంటే భవిష్యత్ లో పార్టీ అధినేతగా గుర్తింపు పొందడం కష్టమే. ఈ మాట టీడీపీ నేతలే అంటుండటం విశేషం.

Tags:    

Similar News