లోకేష్ ప‌ర్యట‌న.. అయ్యబాబోయ్‌.. త‌మ్ముళ్ల కామెంట్లు

టీడీపీలో ఎన్నడూ లేని విధంగా ఓ వింత వైఖ‌రి క‌నిపిస్తోంది. పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న నారా లోకేష్ త‌మ ప్రాంతంలో ప‌ర్యట‌న‌కు వ‌స్తున్నార‌ని స‌మాచారం అంద‌గానే [more]

Update: 2021-01-02 03:30 GMT

టీడీపీలో ఎన్నడూ లేని విధంగా ఓ వింత వైఖ‌రి క‌నిపిస్తోంది. పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న నారా లోకేష్ త‌మ ప్రాంతంలో ప‌ర్యట‌న‌కు వ‌స్తున్నార‌ని స‌మాచారం అంద‌గానే నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారు. “అయితే.. ఎక్కడికైనా చెక్కేయ‌డం బెట‌ర్ !“ అని నాయ‌కులు ముందుగానే రెడీ అయిపోతున్నారు. లేని ప‌ర్యట‌న‌లు, కార్యక్రమాలు, ఫంక్షన్లు సైతం పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి త‌ప్పుకొంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీలో కీల‌క‌నేత‌, భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో నారా లోకేష్ వ‌స్తుంటే.. ఎదురేగి స్వాగ‌తం ప‌లుకుతార‌ని అంద‌రూ అనుకుంటారు.

అధికారంలో ఉన్నప్పుడు….

నిజ‌మే.. గ‌త ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ జిల్లాల ప‌ర్యట‌న‌కు వెళుతున్నాడంటే చంద్రబాబు రేంజ్ హ‌డావిడి ఉండేది. లోకేష్ ప్రాప‌కం పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో హ‌డావిడి చేసేవారు. ఇక నారా లోకేష్ మంత్రి అయ్యాక జిల్లాల‌కు వ‌స్తున్నాడంటే సీఎం రేంజ్‌లో హంగామా ఉండేది. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ప్రచారం కోసం.. త‌మ్ముళ్లు.. భారీగానే క్యూ క‌ట్టారు. మా నియోజ‌క‌వ‌ర్గానికి రావాలంటే.. మా ద‌గ్గర‌కు రండి అంటూ.. ఆయ‌న‌పై ఒత్తిడి కూడా చేశారు. ఆ స‌మ‌యంలో భారీగానే ఖ‌ర్చు చేశారు. పార్టీ ఓడిపోయింది.

ఓటమి తర్వాత…..

ఆయ‌న ప్రచారం చేసిన నియోజ‌క‌వర్గాల్లో ఏ ఒక్కరూ విజ‌యం సాధించ‌లేదు. పైగా త‌నే ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ పై పార్టీ నేత‌ల్లో విఫ‌ల‌మైన నాయ‌కుడిగా పేరుంది. ఆయ‌న క‌న్నా తామే ప్రచారం చేసుకుని ఉంటే.. గెలుపు గుర్రం ఎక్కే వార‌మ‌ని శ్రీకాకుళానికి చెందిన ఓ యువ నాయ‌కుడు పేర్కొన్నారు. భ‌విష్యత్ ముఖ్యమంత్రిగా ప్రచారం జ‌రిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పార్టీలో చాలా మంది నేత‌ల‌కు, గెలిచిన వారికి చుల‌క‌న అయ్యార‌న్నది వాస్తవం. ఏ విష‌యంలోనూ గ‌ట్టిగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి. పైగా కేశినేని నాని లాంటి వాళ్లు గెల‌వ‌ని వాళ్లకు ప్రయార్టీ ఏంట‌ని గ‌తంలో ప‌రోక్షంగా నారా లోకేష్ పై కూడా సెటైర్లు వేశారు.

ఇమేజ్ పెంచుకునేందుకు…..

ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న నారా లోకేష్ పార్టీ ఓడిపోయిన త‌ర్వాత కూడా అదే పంథాను కొన‌సాగించారు. ప్రజల్లోకి వ‌స్తున్నా.. ఆశించిన విధంగా రేంజ్‌ను పెంచుకునే ప్రయ‌త్నం చేయ‌లేక పోతున్నారు. అంతేకాదు ఇప్పట‌కీ నోరు విప్పితే త‌ప్పులు మాట్లాడుతున్నార‌నే అప‌వాదు అలాగే ఉంది. ఇక క‌రోనా స‌మ‌యంలో హైద‌రాబాద్ నుంచి చాలా రోజుల‌కు ఏపీకి రాక‌పోవ‌డం కూడా ఆయ‌న రాజ‌కీయ స‌మ‌ర్థత‌పై అనేక సందేహాలు లేవ‌నెత్తింది. ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. నారా లోకేష్ ప‌ర్యట‌న‌ల‌కు ఎక్కడికి వ‌చ్చినా.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌కు ఆర్థికంగా పెను భారం ప‌డుతోంద‌నే టాక్ వినిపిస్తోంది.

అన్నీ ఖర్చులు తామే భరించాలంటూ….

నారా లోకేష్ ఎక్కడ ప‌ర్యటించినా.. భారీ ఎత్తున ప్రజ‌ల‌ను స‌మీక‌రించ‌డంతో పాటు మీడియాలో ప్రయార్టీ వ‌చ్చేలా ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు..అన్ని ఖ‌ర్చులూ తామే భ‌రించాల్సి వ‌స్తోంద‌ని త‌మ్ముళ్లు త‌ల ప‌ట్టుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌మ ద‌గ్గర డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని వారు అంటున్నారు. ఇటీవ‌ల లోకేష్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌స్తామ‌న్నా అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌లు అయిష్టత చూపార‌ట‌. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ ప‌ర్యట‌న అంటే.. చ‌లీ జ్వరం వ‌చ్చిన వారిలా .. త‌ప్పించుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News