లోకేష్ అదృష్టమో..దురదృష్టమో తెలియదు కానీ?

లోకేష్ కు ఈ మూడేళ్లు కలిసి వచ్చేటట్లే కనపడుతుంది. తన నాయకత్వాన్ని ప్రదర్శించుకునేందుకు అనువైన సమయం ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. లోకేష్ [more]

Update: 2021-01-09 03:30 GMT

లోకేష్ కు ఈ మూడేళ్లు కలిసి వచ్చేటట్లే కనపడుతుంది. తన నాయకత్వాన్ని ప్రదర్శించుకునేందుకు అనువైన సమయం ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. లోకేష్ అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా అయి మంత్రి అయ్యారు. అధికారంలో ఉండటంతో మూడేళ్ల పాటు క్షేత్రస్థాయిలో లోకేష్ పెద్దగా పర్యటించలేదు. అప్పుడప్పుడు వెళ్లినా అధికారంలో ఉండటంతో ఆయనకు నేతలు స్వాగతం చెప్పేందుకే ఆరాటపడ్డారు తప్ప అసలైన ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు.

అతి విశ్వాసంతో….

దీంతో నారా లోకేష్ మూడేళ్ల పాటు తమకు అధికారం తిరిగి దక్కుతుందన్న అతి విశ్వాసంలో ఉన్నారు. తండ్రి చంద్రబాబు చాణక్య నీతితో ఏపీలో ఇక తమ పార్టీకి ఎదురు ఉండదని భావించారు. కట్ చేస్తే లోకేష్ తో సహా కీలకనేతలందరూ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కరోనా కారణంగా లోకేష్ ఎక్కువగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు. కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారన్న విమర్శలు విన్పించాయి.

క్షేత్రస్థాయి పర్యటనలతో…..

అయితే తాజాగా ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు పార్టీలో ఊపు తెచ్చాయంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో లోకేష్ కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూడా ధీటుగానే విమర్శించారు. జగన్ తో పాటు మంత్రులను కూడా టార్గెట్ చేసి లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా లోకేష్ ఈ పర్యటనలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.

క్యాడర్ లో భరోసా……

ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి పార్టీ పరంగా లోకేష్ తీసుకున్న నిర్ణయం ఆయనకు మరింత పట్టు పెంచింది. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారి కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. వారి కొడుకులిద్దరికీ పూర్తి చదువు బాధ్యతలు టీడీపీ చూసుకుంటుందని చెప్పారు. సుబ్బయ్య హత్యకేసులో కేసు నమోదు చేసేంత వరకూ తాను ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చారు. లోకేష్ ఒక రాత్రి ప్రొద్దుటూరులోనే ఉండి సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో లోకేష్ నాయకత్వంపై కింది స్థాయి క్యాడర్ లో సయితం కొత్త ఆశలు రేపిందనే చెప్పాలి. రానున్న కాలంలో లోకేష్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు.

Tags:    

Similar News