లోకేష్ ఆ పని చేస్తాడటగా

అమరావతి కాదు కానీ నారా ఫ్యామిలీ అతలాకుతలం అవుతోంది. నిజానికి పాలకులు మారితే విధానాలు మారుతాయి. అమరావతి విషయం తీసుకుంటే అక్కడ ఏవీ పెద్దగా కట్టడాలు, యాక్టివిటీ [more]

Update: 2020-01-05 02:00 GMT

అమరావతి కాదు కానీ నారా ఫ్యామిలీ అతలాకుతలం అవుతోంది. నిజానికి పాలకులు మారితే విధానాలు మారుతాయి. అమరావతి విషయం తీసుకుంటే అక్కడ ఏవీ పెద్దగా కట్టడాలు, యాక్టివిటీ లేకపోవడంతో పాటు, పదమూడు జిల్లాల ప్రజానీకం అది తమ సొంత రాజధాని అని మనసులో భావించకపోవడం వల్ల ఇపుడు రాజధాని తరలింపు అంశం పెద్ద రాజకీయ అంశం కావడంలేదు. అయితే అమరావతితోనే ఆంధ్రా మొత్తం అంటూ టీడీపీ బిల్డప్ ఇస్తోంది. అదే సమయంలో కొన్ని అనుకూల మీడియా సంస్థలు కూడా పతాక శీర్షికల్లో ఇదే అంశం ప్రస్తావించి జనాల్లో పెట్టాలని చూస్తున్నాయి. అయినా సరే అమరావతి కాక పక్క జిల్లాలకే పాకడంలేదు. అయితే నారా వారి ఫ్యామిలీ మాత్రం అమరావతితోనే అన్నీ అన్నంతగా హడావుడి పడుతోంది. ఇప్పటిలో చంద్రబాబు ఇల్లాలు భువనేశ్వరి రోడ్డు మీదకు వచ్చి రైతుల నిరసనలో పాలుపంచుకున్నారు. ఇపుడు భావి వారసుడు లోకేష్ వంతు అంటున్నారు.

ఫోకస్ అవుతాడా…?

అమరావతి రాజధాని కోసం నేను సైతం అంటూ అతి పెద్ద పోరాటానికి లోకేష్ రెడీ అవుతున్నారని పసుపు శిబిరంలో ప్రచారం సాగుతోంది. లోకేష్ ఏకంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగిపోతారని అంటున్నారు. చావనైనా చస్తాను కానీ అమరావతి రాజధాని తరలిపోనీయను అంటూ చినబాబు గట్టి శపధమే చేస్తున్నాడుట. ఇందుకోసం తన ప్రాణాలకు తెగించి కేసీఆర్ తరహాలో దీక్ష చేపట్టబోతాడని అంటున్నారు. ఓ విధంగా అమరావతిని అడ్డం పెట్టుకుని లోకేష్ ఫోకస్ కావాలని, తిరుగులేని నేతగా అవతరించాలని భావిస్తున్నారుట.

దీక్ష చేసినా…?

నిజానికి లోకేష్ లో లీడర్ ఒకరు ఉన్నారని ఆయన సొంత పార్టీ వారికి తెలియని విషయం అని సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ వారసుడు మాత్రమే తప్ప నాయకుడు కారని కూడా విమర్శలు ఉన్నాయి. అయితే అమరావతి రైతుల కోసం లోకేష్ అమరణ దీక్షకు కూర్చుంటే ఆ కధే వేరుగా ఉంటుందని, స్వామి కార్యం స్వకార్యం కూడా నెరవేరుతాయని తమ్ముళ్ళు అంటున్నారు. లోకేష్ లోని పోరాట పటిమకు ఇది గీటురాయి అవుతుదని కూడా వారు చెబుతున్నారు. ఇంతకాలం లోకేష్ పదవులకే పరిమితం అయ్యారని, ఇపుడు సరైన సమస్యలతో బయటకు వస్తే ఆయన కూడా ఎలివేట్ అవుతారని అంటున్నారు. కానీ దీక్షలకు ఇది సరైన సమయమా, వాటితో కుదిరే పనేనా అన్న చర్చ కూడా ఉంది.

లేపేశారుగా…?

అపుడెపుడో పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తరువాత దీక్షలు అన్నీ కూడా ఆసుపత్రికి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నవేనని అంటున్నారు. కేసీఆర్ దీక్ష వెనక తెలంగాణా ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ప్రకటన వచ్చింది కానీ దీక్ష వల్ల కానే కాదని కూడా అంటున్నారు. ఆ మాటకు వస్తే విపక్ష నేతగా జగన్ ఎన్నో రకాలుగా ఏడేసి రోజుల పాటు దీక్షలు చేశారని, వాటిని ఏమాత్రం నాటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. 2015 లో ఇదే అమరావతిలో జగన్ ప్రత్యేక హోదా కోసం ఏడు రోజుల దీక్ష చేస్తే బాబు సర్కార్ ఆయన టెంట్లు తీయించి అక్కడ నుంచి తరలించిన సంగతిని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇపుడు అమరావతి రాజధాని ఉద్యమం పేరిట లోకేష్ దీక్ష చేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదని, ఆయన్ని కూడా ఆసుపత్రికి తరలిస్తారు అంతే జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి లోకేష్ లోని లీడర్ ఇపుడు ఎలా బయటకు వస్తారో.

Tags:    

Similar News