నిజాయితీకి నజరానా ఇదేనా?

మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఆయన ఐదేళ్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ [more]

Update: 2021-03-31 18:29 GMT

మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఆయన ఐదేళ్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో నారాయణస్వామికి కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన కేవలం ప్రచారం మాత్రమే నిర్వహిస్తారని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. నారాయణస్వామి విషయంలో కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి.

ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా…..

నారాయణస్వామి ఐదేళ్ల పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తన సమయమంతా అప్పటి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీతో పోరాటానికే వెచ్చించారు. కిరణ్ బేడీకి, నారాయణస్వామికి మధ్య విభేదాలు దాదాపు నాలుగేళ్లు సాగాయి. నారాయణస్వామి తీసుకున్న ఏ నిర్ణయాన్ని కిరణ్ బేడీ అమలు చేయకపోవడం, పాలనకు అడ్డంకిగా మారడంతో నారాయణస్వామి న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్రపతిని కలసి కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

అవినీతి లేకుండా….

నారాయణస్వామి తన పరిపాలనలో ఎటువంటి అవినీతి మరకను అంటించుకోలేదు. స్వచ్ఛమైన పాలననే అందించడానికి నారాయాణస్వామి ప్రయత్నించారు. అయితే పాలన చివరి సమయంలో నారాయణస్వామి సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తిని ఎదుర్కొన్నారు. చివరి సమయంలో ఆయన ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే కూల్చేవేశారు. బలనిరూపణ చేసుకోలేక నారాయణస్వామి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

సొంత పార్టీ నేతలే….

అయితే నారాయణస్వామి నాయకత్వంలో పనిచేసేందుకు పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు ఇష్టపడటం లేదు. ఆయన తినరు.. మరొకరిని తినరివ్వరు అన్న కారణంగా ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ కు నమ్మకంగా ఉన్న నేతలే పార్టీని వీడిపోయారు. దీంతో నారాయణస్వామికి కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. నారాయణస్వామి ప్రాతినిధ్యం వహించే నెల్లిధోవ్ స్థానాన్ని డీఎంకే కు కాంగ్రెస్ కేటాయించింది. ఆయనను ప్రచారానికే పరిమితం చేసింది.

Tags:    

Similar News