మోడీ మెరుపులకు ఇక బ్రేకేనా…!!

వంద రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఇంకా ఏ కొత్త అస్త్ర్రాలు ఉన్నాయా అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో [more]

Update: 2019-09-07 16:30 GMT

వంద రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఇంకా ఏ కొత్త అస్త్ర్రాలు ఉన్నాయా అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేవలం మూడు నెలల కాలంలోనే నరేంద్ర మోదీ తలాక్ బిల్లు చట్టంగా తెచ్చారు, కాశ్మీర్ వంటి అతి పెద్ద సమస్యను 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా శాశ్వతంగా పరిష్కరించేశారు. మరో వైపు పాకిస్థాన్ దూకుడుకు ప్రపంచంలో ఏ దేశమూ మద్దతు లేకుండా తనదైన దౌత్య రాజకీయంతో అడ్డుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా మిగిలిన 57నెలల పాలన నరేంద్ర మోదీ ఎలా సాగిస్తారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. నరేంద్ర మోదీ తొలి అయిదేళ్ళ పాలనను చూస్తే దేశభక్తిని తురుపు కార్డుగా వాడుకున్నారని అర్ధమవుతుంది. పాక్ ని బూచిగా చూపించి పెద్ద నోట్ల రద్దు నుంచి బాల్ కోట్, పుల్వామా మెరుపు దాడుల వరకూ కధ నడిపించారు. తద్వారా నరేంద్ర మోదీ దేశానికి తాను ఎంత అవసరమో గట్టిగా చెప్పుకుని మళ్ళీ ప్రధాని అయ్యారు. నిజానికి పెద్ద నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదం తగ్గలేదు కనీ దేశంలోని పేదలంతా చితికిపోయారు.

మౌలిక సమస్యల సంగతేంటి?

దేశంలో గత అయిదేళ్ళలో ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దానికి కారణం పెద్ద నోట్ల రద్దు, ఆర్ధిక పరిస్థితి మందగమనంలోకి వెళ్ళడానికి కూడా అదే కారణం. తాపీగా చేసినట్లు కనిపించిన ఈ పని ఒక్కసారిగా దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసి పారేసింది. జీఎస్టీ ద్వారా దేశ సంపద ఎంత పెరిగిందో తెలియదు కానీ ఆర్ధిక వెతలు కతలు బాగానే పెరిగాయని కూడా ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఇక ఏటా కోటి ఉద్యోగాలు అంటూ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ఆ తరువాత అయిదేళ్ళు ఆ మాటే మరచారని విమర్శలు ఉన్నాయి. తన మొదటి విడత పాలనలో కొత్త ఉద్యోగం ఒక్కటీ కూడా స్రుష్టిందలేకపోయిన నరేంద్ర మోదీ పొరుగు దేశం బూచిని బాగానే వాడుకుని బయటపడ్డారని రాజకీయ ప్రత్యర్ధులు అన్నారంటే అది సహేతుకమేననిపిస్తుంది. ఇపుడు మూడు నెలల్లో కూడా అదే విధమైన తీరు నరేంద్ర మోదీ కనబరుస్తున్నారు. కాశ్మీర్ విషయంలో దేశమంతా నరేంద్ర మోదీ వెనకాల నిలబడింది. అది మంచిదేనని కూడా అంతా అంటున్నారు. అయితే దేశంలోని పేరుకుపోయిన మౌలిక సమస్యలను ప్రస్తావించకుండా నరేంద్ర మోదీ మిగిలిన కాలాన్ని ఎలా నెట్టుకు రాగలరన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.

ముంచుకొస్తున్న ముప్పు…

మరో వైపు ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగిస్తూ దూసుకువస్తున్న ఆర్ధిక మాంద్యం వచ్చే ఏడాది నుంచి భారత్ లో విలయతాండవం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. దాని ధాటికి తట్టుకునే నేర్పు, ఓర్పు భారత్ కి ఉందా అన్నది ఇపుడు ఆలోచించాల్సిన విషయం అంటున్నారు. నిజానికి దీని కంటే ముందే మూడేళ్ళుగా చిన్న వ్యాపారం కుదేలైపోయి చిరుద్యోగులు రోడ్డున పడిన పరిస్థితి దేశంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఆర్ధిక విధానాల పుణ్యమా అని వచ్చేసింది. ఇపుడు ఆర్ధిక‌ మాంద్యం కనుక వీర విజృంభణ చేస్తే దేశం గతేం కాను అన్న బెంగ అందరిలోనూ ఉంది. పైకి నరేంద్ర మోదీ అండ్ కో బింకంగా ఉన్నా అసలు భయాలు అలాగే ఉన్నాయి. దీని మీద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు మాట్లాడుతూ, అది తమ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ అని అంగీకరించారు. ఆర్ధిక మాంద్యం కనుక ముదిరితే జనం తన సొంత అజెండాలతో ముందుకు వస్తారు, అపుడు పాకిస్తాన్ బూచి చూపించినా ఆ ఆగ్రహం చల్లారదు, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో కోత పెడుతూ, కొత్త ఉద్యోగాలను తగ్గిస్తున్న పాలకులు ఆర్ధిక కష్టాలకు ఇప్పటినుంచే తగిన మందు వేయకపోతే మాత్రం దేశభక్తి నినాదాలు నరేంద్ర మోదీ సర్కార్ ని ఏ విధంగానూ కాపాడలేవని అంటున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు నరేంద్ర మోదీ మెరుపులు ఇక ఆగిపోయాయని, ముందుంది అసలైన పండుగ అంటున్నారు. చూడాలి. నరేంద్ర మోదీ మరే రకమైన వ్యూహాలతో దేశ ప్రజలను తన వైపునకు తిప్పుకుంటారో.

Tags:    

Similar News