ఒక మోడీ.. ఈ దేశాన్ని ఏం చేస్తున్నారు? ఫెడ‌ర‌ల్‌.. ఫేడ్ అవుతోందా?

దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రధాన‌మంత్రి పీఠంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఇప్పటి వ‌రకు అనేక మంది మేధావులు ఈ దేశాన్ని పాలించారు. వారి విష‌యంలో [more]

Update: 2020-05-22 18:29 GMT

దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రధాన‌మంత్రి పీఠంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఇప్పటి వ‌రకు అనేక మంది మేధావులు ఈ దేశాన్ని పాలించారు. వారి విష‌యంలో ఈ త‌ర‌హా చ‌ర్చ ఎప్పుడూ సాగ‌లేదు. కానీ, ఇప్పుడు న‌రేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జ‌రుగుతున్న మార్పుల‌పై మాత్రం అన్ని వ‌ర్గాల నిపుణులు కూడా ఆశ్చర్యంతో కూడిన ఆస‌క్తికర చ‌ర్చ సాగిస్తున్నారు. వాస్తవానికి మ‌న రాజ్యాంగంలో పేర్కొన్న మేర‌కు మ‌న‌ది లౌకిక దేశం. అధ్యక్ష త‌ర‌హా పాల‌న ఇక్కడ ఉండ‌దు. రాష్ట్రాల‌కు కూడా అనేక అధికారాల‌ను రాజ్యాంగం క‌ట్టబెట్టింది. దీనిని పాటించాల‌ని కూడా ఖరాఖండీగా చెప్పింది. గ‌తంలో పాలించిన ప్రధానులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. రాష్ట్రాల‌ ప్రయోజ‌నాల‌కు భంగం క‌ల‌గ‌కుండా ముందుకు సాగారు.

రాష్ట్రాల ప్రయోజ‌నాల‌ను….

అదే స‌మ‌యంలో రాష్ట్రాల ప్రయోజ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. దీంతో అప్పట్లో ప్రధానుల విష‌యంలో ఈ త‌ర‌హా సందిగ్ధ వాతావ‌ర‌ణం కానీ, అయోమ‌య ప‌రిస్థితి కానీ, చ‌ర్చ కానీ చోటు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు ప్రధాని న‌రేంద్ర మోదీ విష‌యంలో మాత్రం లౌక‌క‌త్వానికి సంబంధించిన కీల‌క ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. రాష్ట్రాల‌ను క‌లుపుకొని పోతూ అభివృద్ధి దిశ‌గా అడు గులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న దివంగ‌త ప్రధాని వాజ‌పేయి స్ఫూర్తికి విరుద్ధంగా నేడు ఆయ‌న శిష్యుడిన‌ని చెప్పుకొనే న‌రేంద్ర మోదీ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. గ‌త జ‌న‌వ‌రిలోనే మ‌నం ఏడు ద‌శాబ్దాల‌కు పైబ‌డిన గ‌ణ‌తంత్ర దినోత్సవాన్ని జ‌రుపుకొన్నాం. ఈ ఏడు ద‌శాబ్దాల్లోనూ ఏ పాల‌కులు కూడా రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించి, త‌మ‌దే పెత్తనం అనే అధ్యక్ష త‌ర‌హా పాల‌నకు తెర‌దీసింది మ‌న‌కు క‌నిపించ‌దు.

ఫెడ‌ర‌లిజానికి తూట్లు….

కానీ,ఇప్పుడు న‌రేంద్ర మోదీ వ్యవ‌హారం చూస్తే.. రాను రాను రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఫెడ‌ర‌లిజానికి న‌రేంద్ర మోదీ తూట్లు పొడుస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రాల‌కు కీల‌క‌మైన హ‌క్కుగా ఉన్న, ఆదాయానికి మంచి మార్గంగా ఉన్న గ‌నుల విష‌యంలో కేంద్రం గుత్తాధిప‌త్యం తీసుకునేందుకు మార్గం సుగ‌మం చేసుకుంది. నిన్నటి వ‌రకు గ‌నుల విష‌యంలో ప్రత్యేకంగా రాష్ట్రాల‌కు హ‌క్కులు ఉన్నాయి. అంతేకాదు, ప్రతి రాష్ట్రం కూడా గ‌నుల శాఖ పేరుతో ఒక పోర్ట్ ఫోలియో కూడా నిర్వహిస్తోంది. అయితే, తాజాగా ఈ గ‌నుల విష‌యంలో కేంద్రం త‌న స్వాధీనం చేసుకుని, మెజారిటీ వాటాను అమ్మేస్తామ‌ని ప్రక‌టించింది. ఇది, నిజంగా రాష్ట్రాల‌కు ఉన్న ఆదాయ మార్గాల‌ను హ‌రించ‌డ‌మే కాకుండా కీల‌క‌మైన అధికారాలు, హ‌క్కుల‌ను కూడా హ‌రించ‌డం కింద‌కే వ‌స్తుంద‌ని అంటున్నారు నిపుణులు.

ప్రతి విషయంలోనూ…

ఇక‌, ఇప్పటికే న‌రేంద్ర మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స్వతంత్ర వ్యవ‌స్థల‌యిన ఎల‌క్షన్ క‌మిష‌న్‌, ఆర్బీఐ, సీబీఐ, సీఐసీ, సుప్రీం కోర్టు, సీవీసీ ఇలా అనేక సంస్థల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో న‌డుపుతున్నార‌నే వాద‌న కూడా ఉంది. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే.. రాష్ట్రాలు బ‌లంగా ఉండాల్సిన ప్రజాస్వామ్య దేశంలో కేవ‌లం రాష్ట్రాల ప‌రిధిలోని అంశాలైన విద్య, ర‌క్షణ‌, శాంతి భ‌ద్రతల విష‌యంలోనూ కేంద్రం జోక్యం పెరిగిపోయింది. నీట్‌. ఇది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప‌రీక్ష. త‌ద్వారా రాష్ట్రాల‌కు అప్పటి వ‌ర‌కు ఉన్న ఎంబీబీఎస్ వంటి కీల‌క ప‌రీక్షను నిర్వహించే అవ‌కాశం లేకుండా పోయింది. మావోయిస్టుల పేరుతో ప్రత్యేక ద‌ళాల‌ను కేంద్రమే రూపొందించి రాష్ట్రాల్లో అనుమ‌తులు కూడా తీసుకోకుండానే ప‌నిచేసేలా చేస్తోంది.

కరోనా విషయంలోనూ…

అదేవిధంగా ఎన్ఐఏ వంటి వాటి ద్వారా అధికారాన్ని కేంద్రీక‌రించి రాష్ట్రాల‌ను కేవ‌లం నామ‌మాత్రం చేసే ప్రక్రియ‌కు న‌రేంద్ర మోదీ శ్రీకారం చుట్టార‌నే వాద‌న‌లు, విమ‌ర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క అంశం.. క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ నుంచి రాష్ట్రాల‌ను ఆదుకోవాల్సిన కేంద్రం .. త‌న బాధ్యత విష‌యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. మీరు అప్పులు తెచ్చుకునే సామ‌ర్ధ్యాన్ని స‌వ‌రిస్తున్నాం.. కాబ‌ట్టి అప్పులు చేసుకుని రాష్ట్రాల్లో స‌మ‌స్యలు తీర్చుకోండ‌ని చెప్పింది. నిజానికి ఇది గ‌ణ‌తంత్ర స్పూర్తికి విఘాతం. అదే స‌మ‌యంలో ఈ అప్పులుగా తెచ్చుకున్న మొత్తాల‌ను కూడా వేటికి వేటికి ఖ‌ర్చు పెట్టాలో కూడా తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ చెప్పారు.

రాష్ట్ర హక్కుల్లోకి….

అంటే.. ఇది నేరుగా రాష్ట్రాల హ‌క్కుల్లోకి జొర‌బ‌డ‌డ‌మే అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా.. అనేక విష‌యాల్లో న‌రేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం చేస్తున్న విన్యాసం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విఘాత‌మే కాకుండా దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేస్తోంద‌ని చెప్పడానికి ఉదాహ‌ర‌ణ‌లుగా ఉన్నాయ‌ని, ఇది మున్ముందు ప్రమాద‌క‌ర‌మైన సంకేతాల‌ను ఇస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News